Yarapathineni Srinivasa Rao: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు మితిమీరి ప్రవర్తిస్తున్నాడు: యరపతినేని

Yarapathineni Srinivasarao fires in Thopudurti Prakash Reddy brother
  • చంద్రబాబు, లోకేశ్ లపై తోపుదుర్తి సోదరుడి వ్యాఖ్యలు
  • మండిపడిన యరపతినేని శ్రీనివాసరావు
  • చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు అమానవీయం అని ఆగ్రహం
  • కడుపుమంటతో మాట్లాడుతున్నారని విమర్శలు
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి మితిమీరి ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్, కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లపై అతడు చేసిన వ్యాఖ్యలు అమానవీయం అని విమర్శించారు. 

జాకీ కంపెనీ వైసీపీ నాయకులవల్లే పోయిందంటే తప్పా? ఇంత కడుపు మంట ఎందుకు? అది వారిని బాధించినట్లు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబునాయుడును... వైఎస్ ఒక్కమాట చెప్పివుంటే మొద్దుశీను చంపేవాడని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడం అతని ఫ్యాక్షనిజాన్ని తెలియజేస్తోందని యరపతినేని స్పష్టం చేశారు. 

"ఫ్యాక్షనిజం మొదలుపెడితే లోకేశ్ ని టార్గెట్ చేస్తామనడం ఎంత ధైర్యం? వీరు మాట్లాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉంది. పత్రికల్లో ఒకటి, రెండుసార్లు వస్తేనే ఇంతగా బాధపడుతున్న వైసీపీ నాయకులు... అవినీతి పుత్రిక సాక్షి చెత్త పత్రికలో 10 సంవత్సరాలుగా చంద్రబాబు, లోకేశ్, తెలుగుదేశంపై ఇష్టారాజ్యంగా రాస్తూ వస్తున్నారు, మాకెంత బాధ ఉంటుందో ఆలోచించాలి. 

చంద్రబాబునాయుడు కూడా చంపండని చెప్పివుంటే మీరు పాదయాత్రలు చేసేవారా? అధికారంలోకి వచ్చేవారా? నేడు మీరు ఇలా మాట్లడగలిగేవారా? ఉగ్ర నరసింహుడి రూపంలో లోకేశ్ కనపడుతున్నాడని ఆయనపై మాట్లాడుతున్నారంటే అది వైసీపీ నాయకుల ప్యాంట్లు తడవడం, భయంతోనే. 

పరిశ్రమలు తరలడానికి వైసీపీ నాయకుల నిర్వాకం, బెదిరింపులే కారణం. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా వుంది.  వైసీపీ నాయకులకు, ప్రభుత్వంలోని పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు స్టేషన్ లోనే చంపుతామని బెదిరిస్తున్నారు. వారి వైఖరిపై డీజీపీ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో టీడీపీ నాయకులు కూడా వైసీపీలానే  దాడులు చేయాలని సంకేతాలిచ్చినట్లుంది. 

పై స్థాయిలో ఉన్న చంద్రబాబు, లోకేశ్ లపై మాట్లాడితే కింది స్థాయి నాయకులు భయపడతారని అనుకుంటున్నారు. నోరు పారేసుకునే చెత్త బ్యాచ్ చంద్రబాబు, లోకేశ్ లను ఏమీ చేయలేరని గుర్తు పెట్టుకోవాలి. అసభ్యంగా మాట్లాడే ఊరకుక్కల్ని ప్రజలు తరుముతారు. మీకు ఇవే చివరి ఎన్నికలు, జగన్ కు చివరి సీఎం పదవి ఇదే. 

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మీకు డిపాజిట్లు కూడా రావని భయపడుతున్నారు. ఎలా పోటీ చేయాలో మాకు బాగా తెలుసు, మిమ్మల్ని ఎలా పాతర వేయాలో కూడా మాకు బాగా తెలుసు. ప్రజలు కూడా మిమ్మల్ని సాగనంపడానికి సిద్ధంగా వున్నారు. వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Yarapathineni Srinivasa Rao
Thopudurti Prakash Reddy
Chandrasekhar Reddy
Chandrababu
Nara Lokesh
TDP
YSRCP

More Telugu News