రేపు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ రాక
- ఇప్పటంలో ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ పవన్ ఆగ్రహం
- తమకు స్థలం ఇచ్చారన్న కక్షతో ఈ చర్యకు దిగారని ఆరోపణ
- ఈ రాత్రికి పవన్ మంగళగిరి చేరుకుంటారన్న నాదెండ్ల
- రేపు ఇప్పటం గ్రామస్థులను కలుస్తారని వెల్లడి
కాగా, ఇదే అంశంపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తమకు ఓటు వేయని వారిని శత్రువుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఈ ఉదయం నుంచి జరుగుతున్న అరాచకమే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.
అమరావతిలోనే జనసేన ఆవిర్భావ సభ జరుపుకోవాలని తాము భావించామని, స్థలం కోసం అన్వేషిస్తుండగా, సభకు స్థలం దొరకకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులు, హెచ్చరికలకు పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అయినప్పటికీ ఇప్పటం గ్రామస్థులు ధైర్యంగా ముందుకువచ్చి తమకు స్థలం ఇచ్చారని వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధి ఆగ్రహానికి ఇదే కారణమని తెలిపారు. తమకు స్థలం ఇచ్చారనే కూల్చివేతలకు పాల్పడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉండగా, దాన్ని 120 అడుగుల చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ ఉదయం నుంచి జేసీబీల సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని తెలిపారు. కూల్చివేతలపై గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించడంతో, ఆగమేఘాలపై కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు.
ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన జనసైనికులు, వీరమహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఈ అరాచకానికి అండగా నిలబడ్డారని పవన్ విమర్శించారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదని, ఇప్పటం గ్రామస్థులకు జనసేన అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.