Chandrababu: చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించి మీ పేరు పెట్టుకోండి... హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై చంద్రబాబు ఫైర్

Chandrababu fires on NTR health university name change
షార్ట్స్‌లో చూడండి
విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్సార్ పేరును పెట్టాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన బిల్లును కాసేపటి క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... ఎన్టీఆర్ పేరు తొలగింపు ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని అన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. 

'ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టాము. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్సార్ సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోంది.  

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం.. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్లు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, వైఎస్సార్ కు ఏం సంబంధం ఉంది?

దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా... ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలి' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Jagan
YSR
YSRCP

More Telugu News