అరెస్టయిన అధికారిణితో అమిత్ షా కలిసున్న ఫొటోను షేర్ చేసి కటకటాల పాలైన సినీ దర్శకుడు

Bollywood film maker Avinash Das arrested
  • గత నెలలో అరెస్టయిన పూజా సింఘాల్
  • మనీలాండరింగ్ కేసులో అరెస్ట్
  • పూజాతో అమిత్ షా కలిసున్న ఫొటోతో కలకలం రేపిన దర్శకుడు అవినాశ్ దాస్ 
  • ఆ ఫొటో ఇటీవలిదేనంటూ క్యాప్షన్
  • 2017 నాటిదని వెల్లడైన వైనం
బాలీవుడ్ దర్శకుడు అవినాశ్ దాస్ (46)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ తో అమిత్ షా కలిసున్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడన్న ఆరోపణలపై గుజరాత్ పోలీసులు అవినాశ్ దాస్ ను అరెస్ట్ చేశారు. తదుపరి న్యాయపరమైన చర్యల కోసం అతడిని పోలీసులు ముంబయి నుంచి అహ్మదాబాద్ తరలించారు. 

కాగా, అమిత్ షా, ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ కలిసున్న ఆ ఫొటో ఇటీవలిదేనని, పూజా సింఘాల్ అరెస్ట్ కావడానికి కొన్నిరోజుల ముందుదని దర్శకుడు అవినాశ్ దాస్ క్యాప్షన్ లో పేర్కొన్నాడు. అయితే, ఆ ఫొటో 2017 నాటిదని వెల్లడైంది. దీంతో అవినాశ్ దాస్ పై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 469 (ఫోర్జరీ), జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టం, ఐటీ చట్టం కింద అభియోగాలు మోపారు. అమిత్ షా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ విధమైన ఫొటోను పోస్టు చేశాడని క్రైమ్ బ్రాంచ్ భావిస్తోంది. 

ఈ కేసులో అవినాశ్ దాస్ కు ముందస్తు బెయిల్ లభించలేదు. సెషన్స్ కోర్టు అతడి పిటిషన్ ను తిరస్కరించింది. తనను అహ్మదాబాద్ తరలించకుండా చూడాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, సదరు ఫిలింమేకర్ కు అక్కడా నిరాశ తప్పలేదు. 

అవినాశ్ దాస్ 2017లో స్వరా భాస్కర్, సంజయ్ మిశ్రా, పంకజ్ త్రిపాఠీలతో 'అనార్కలీ ఆఫ్ ఆరా' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 'రాత్ బాకీ హై' అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. అంతేకాదు, నెట్ ఫ్లిక్స్ కోసం 'షీ' అనే వెబ్ సిరీస్ ను కూడా రూపొందించారు. కాగా, అవినాశ్ దాస్ షేర్ చేసిన ఫొటోలో అమిత్ షాతో పాటు ఉన్న ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ జూన్ లో మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. ఆమె ఝార్ఖండ్ రాష్ట్ర గనుల శాఖలో కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
Go Back to Shorts
Avinash Das
Amit Shah
Pooja Singhal
Arrest
Social Media

More Telugu News