కేంద్రంలో ఓ దొంగ.. రాష్ట్రంలో మరో దొంగ.. దేశాన్ని నాశనం చేస్తున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- దేశంలో కేసీఆర్ అంత అవినీతి, అసమర్థ సీఎం ఎవరూ లేరన్న జీవన్ రెడ్డి
- మోదీ, కేసీఆర్ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శ
- ప్రతిపక్షాలను బలహీనం చేస్తే బలపడరని వ్యాఖ్య
కేసీఆర్ కు కుర్చీ దొరకడం లేదా?
ఎన్నికల ముందు కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్య తీరుస్తానన్న సీఎం కేసీఆర్కు ఇప్పటికీ కుర్చీ దొరకడం లేదా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గిరిజనులకు హామీ ఇచ్చిన మేర రిజర్వేషన్లు కల్పించకుండా వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా.. అన్యాయంగా గిరిజనుల నుంచి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.
దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూములు ఎక్కడికిపోయాయని నిలదీశారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు వివక్షకు గురవుతున్నారంటే.. కేవలం సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్లేనని మండిపడ్డారు. ఈ అసమర్థ పాలనకు ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. జాతీయ పార్టీ పెడతా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అంటూ ఊకదంపుడు మాటలు చెప్పడం మానేసి.. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని సీఎం కేసీఆర్కు సూచించారు.