పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో 'జనగణమన'... ముంబయిలో ఓపెనింగ్.. విజయ్ ఎంట్రీ మామూలుగా లేదుగా!
Add ap7am to your home Screen

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో 'జనగణమన'... ముంబయిలో ఓపెనింగ్.. విజయ్ ఎంట్రీ మామూలుగా లేదుగా!

Puri Jagannadh Janaganamana with Vijay Devarakonda announced
  • హెలికాప్టర్ లో వచ్చిన విజయ్ దేవరకొండ
  • ఆర్మీ దుస్తుల్లో విజయ్
  • పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై చిత్రం
  • 2023 ఆగస్టు 3న రిలీజ్
ఓవైపు లైగర్ విడుదలకు సిద్ధమవుతుండగానే, పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో మరో చిత్రం ప్రకటించారు. జనగణమన (జేజీఎమ్) అనే టైటిల్ తో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం నేడు ఓపెనింగ్ జరుపుకుంది. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది. ముంబయిలో ఈ చిత్రం ప్రారంభం కోసం హీరో విజయ్ దేవరకొండ హెలికాప్టర్ లో రాగా, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్మీ కమాండో వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. 

ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, చార్మీ, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. పూరీ జగన్నాథ్ జనగణమన కథను గతంలోనే మహేశ్ బాబుతో తీయాలని కోరుకున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు ఫైనల్ కాకపోవడంతో, ఇప్పుడు విజయ్ దేవరకొండతో తీస్తున్నట్టు సమాచారం. అయితే, మహేశ్ తో అనుకున్న కథ ఇదేనా, కాదా అనేదానిపై స్పష్టత లేదు. టైటిల్ మాత్రం పూరీ సర్కిల్ లో ఎప్పట్నించో వినిపిస్తోంది. 

కాగా ఈ చిత్ర నిర్మాణంలో టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాలుపంచుకుంటున్నాడు. మైహోమ్ సంస్థ సినిమా నిర్మాణ బ్యానర్ శ్రీకర స్టూడియోస్ తరఫున వంశీ పైడిపల్లి ముంబయిలో జనగణమన సినిమా ఓపెనింగ్ కు హాజరయ్యాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇవాళే ఎనౌన్స్ చేశారు. 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు. 

ఈ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఇది ప్రధానంగా సైనిక నేపథ్యంలో వచ్చే సినిమా అని తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
Janaganamana
JGM
Vijay Devarakonda
Puri Jagannadh

More Telugu News