ఇప్పటం గ్రామస్థులకు రూ.50 లక్షలు ప్రకటిస్తున్నా: పవన్ కల్యాణ్
- నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ
- ఇప్పటం గ్రామం వద్ద సభ నిర్వహణ
- రైతులు పొలాలు ఇచ్చి సహకరించారన్న పవన్
- అందుకే ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోగలిగామని వెల్లడి
ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని జై ఆంధ్రా, జై తెలంగాణ, జై భారత్ అంటూ ప్రారంభించారు. లోక కల్యాణం కోరే హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మత పెద్దలకు, నిత్యం రామకోటి రాసే స్త్రీమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.
"కొదమ సింహాల్లాంటి జనసైనికులు, ఆడబెబ్బులి వంటి వీరమహిళలకు శుభాభినందనలు. ఈ సభను మా పొలాల్లో జరుపుకోండి అని సహకరించిన ఇప్పటం రైతులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సభ పెట్టుకోండి అని సహకరించిన మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇప్పటం గ్రామానికి నా ట్రస్టు తరఫున రూ.50 లక్షలు ప్రకటిస్తున్నాను. అలాగే, సభ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీసు అధికారులకు, నా సోదరులైన పోలీస్ కానిస్టేబుళ్లకు, తోటి భీమ్లానాయక్ లైన మా ఎస్సైలకు... మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ వ్యాఖ్యానించారు.