India: చావో రేవో... నేడు గెలిచిన వారికే వన్డే సిరీస్!

Lst One day Match Between India and England Today
ఇండియాలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పర్యటన నేటితో ముగియనుంది. నేడు పుణె వేదికగా మూడవ వన్డే జరుగనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ లో విజయం సాధించిన ఇండియా, ఇంగ్లండ్ లో మూడవ వన్డేలో గెలిచి సిరీస్ ను తమ ఖాతాలో వేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించి, ఇంగ్లండ్ ను ఒట్టి చేతులతో పంపించాలని ఇండియా చూస్తుండగా, వన్డే సిరీస్ నైనా గెలుచుకుని కొంత పరువు నిలుపుకుని ఇంగ్లండ్ కు వెళ్లాలని ఆ జట్టు భావిస్తోంది.

ఇక మూడో వన్డే పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని, ఇదే సమయంలో సీమర్లకు కొంత స్వింగ్ కూడా లభిస్తుందని తెలుస్తోంది. నిలదొక్కుకుని ఆడితే భారీ స్కోరు సాధించడం సులువేనని క్యూరేటర్లు అంటున్నారు. అయితే, పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తే మాత్రం ఇంగ్లండ్ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. రెండో వన్డేలో ఇదే పునరావృతమైంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 337 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచినా, అలవోకగా ఇంగ్లండ్ ఛేదించింది. అదే ఉత్సాహాన్ని మూడవ వన్డేలోనూ చూపాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ లో తొలుత ఆడే జట్టు కనీసం 350 పరుగులు చేస్తేనే గెలిచేందుకు పూర్తి అవకాశాలు ఉన్నట్టని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదిలావుండగా, రెండో వన్డేలో భారీగా పరుగులు ఇచ్చి విఫలమైన కుల్ దీప్, కునాల్ స్థానంలో చాహల్, సుందర్ లను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కృనాల్ బ్యాటింగ్ స్కిల్స్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటే, తుది జట్టులో ఉంటాడనే భావించవచ్చు. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ 90 పరుగులు చేస్తే, వన్డేల్లో ఆరు వేల పరుగులు చేసిన 10వ భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

India
England
OneDay Series
Cricket

More Telugu News