తెలంగాణలో కొవిడ్ టీకా పంపిణీ కోసం 50 వేల మందికి శిక్షణ.. తొలి విడతలో 75 లక్షల మందికి వ్యాక్సినేషన్!
- టీకా పంపిణీకి చర్యలు చేపట్టిన ప్రభుత్వం
- రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో సిబ్బందికి శిక్షణ
- ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు టీకా
- దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వారికి కూడా తొలి విడతలోనే
టీకా రాష్ట్రానికి చేరుకున్న వెంటనే తొలుత ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి ఇస్తారు. వీరందరికీ ఒకేసారి టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో దాదాపు 75 లక్షల మందికి టీకా ఇవ్వనుండగా, వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది దాదాపు 3 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. మరో రెండు లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బంది ఉంటారు. మిగతా వారంతా 50 ఏళ్ల వయసు పైబడినవారేనని తెలుస్తోంది. అలాగే, 50 ఏళ్ల లోపు వయసు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా టీకా ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 వేల బృందాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఒక్కో బృందం ఒక్కో కేంద్రంలో టీకాలు వేస్తుంది. ఇందుకోసం పదివేల మంది ఏఎన్ఎంలు, 25 వేల మంది ఆశా కార్యకర్తలు,15 వేల మంది వైద్యులు, నర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో రెండు కోట్లు, జిల్లా స్థాయిలో కోటి టీకాలను ఒకేసారి భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.