హైదరాబాద్ నగరానికి మళ్లీ వర్ష సూచన... మరో మూడ్రోజులు భారీ వర్షాలే!
- హైదరాబాదుపై వరుణుడి పంజా
- గత రాత్రి కూడా కుండపోత
- నగరం జలమయం
- క్యుములోనింబస్ మేఘాలే కారణమంటున్న వాతావరణ శాఖ
మరో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలో కురుస్తున్న వర్షాలు, రాగల 48 గంటల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు కూడా వ్యాపిస్తాయని తెలిపింది.
వాతావరణంలో విపరీత మార్పులే ఈ వర్షాలకు కారణమని, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా ఎక్కడికక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.