రూ. 2 వేల నోట్లను కనిపించకుండా చేస్తున్న కేంద్రం!

2000 Notes Slowly Disappear form Circulation
  • క్రమంగా మాయమవుతున్న పెద్ద నోటు
  • రెండేళ్ల నుంచి ముద్రించని ఆర్బీఐ
  • చెలామణిలోని నగదులో రూ. 2 వేల నోటు వాటా 22 శాతమే
ఇటీవలి కాలంలో ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసినప్పుడు రూ. 2 వేల నోట్లు వచ్చాయా? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఎప్పుడో వచ్చాయి అనో, లేదా రాలేదనో సమాధానమే వినిపిస్తుంది. దీనికి కారణం, చలామణిలో ఉన్న 2 వేల రూపాయల నోట్లను క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించుకోవడమే కారణమని తెలుస్తోంది. 2016లో రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసిన కేంద్రం, ఆపై రూ. 2 వేల నోటును కొత్తగా ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

అప్పట్లో పెద్ద నోట్ల రద్దు, కొత్తగా రూ. 2 వేల నోటును విడుదల చేయడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా, కేంద్రం ముందడుగే వేసింది. ఆపై వరుసగా అన్ని రకాల నోట్లనూ మార్చిన కేంద్రం, వాటి ముద్రణను ప్రారంభించి, వరుసగా విడుదల చేస్తూ వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రూ. 2 వేల నోట్లు అడపాదడపా మాత్రమే దర్శనమిస్తున్నాయి.

ఇప్పటికే రూ. 2 వేల నోట్ల ముద్రణను నిలిపివేశామని, గత రెండేళ్లుగా వాటిని ముద్రించడం లేదని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే. కాగా, 2019 సాధారణ ఎన్నికలకు ముందు రూ. 2 వేల నోటుకు డిమాండ్ చాలా అధికంగా ఉండగా, ఆపై మాత్రం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో నోట్లు కూడా మాయం కావడం మొదలైంది. బ్యాంకులకు చేరిన నోట్లను తిరిగి ఖాతాదారులకు ఇవ్వడం కూడా తగ్గింది. మరోవైపు పెద్ద నోటును బడాబాబులు బ్లాక్ మనీ కింద వెనకేసుకుని వచ్చారని కూడా ఆరోపణలు వచ్చాయి.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల మేరకు మార్చి 2019 నుంచి మార్చి 2020 మధ్య చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు గణనీయంగా తగ్గాయి. ఇండియాలో ప్రస్తుతం 21 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చెలామణిలో ఉండగా, వాటిల్లో రూ. 2 వేల నోట్ల వాటా కేవలం 22.5 శాతమే. ఇక ఏప్రిల్ 2019 నుంచి రూ. 2 వేల నోట్లను ముద్రించాలని ఒక్క ఆదేశం కూడా ఆర్బీఐకి ఇవ్వకపోవడం గమనార్హం.
Go Back to Shorts
200
Note
India
Circulation
Demonitisation

More Telugu News