అప్పుడు న్యూజిలాండ్ ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్ వద్ద విలపిస్తూ కనిపించారు: నాటి ఘటనను గుర్తుచేసుకున్న ఇంజమామ్
- 2002లో పాక్ లో ఉగ్రదాడి
- భయకంపితులైన న్యూజిలాండ్ క్రికెటర్లు
- పర్యటన మధ్యలోనే ముగించుకుని స్వదేశం పయనం
రెండో టెస్టు కరాచీలో జరగాల్సి ఉండగా, ఉదయం పూట హోటల్ లో భారీ బాంబు పేలుడు జరిగిందని ఇంజమామ్ చెప్పాడు. ఆ సమయంలో తాను ప్రాక్టీసుకు వెళ్లడంతో బతికిపోయానని, తాను బస చేసిన గది కూడా పాక్షికంగా ధ్వంసమైందని తెలిపాడు. ప్రాక్టీసు ముగించుకుని స్టేడియం నుంచి హోటల్ కు వెళ్లిన తనను వెంటనే కింది ఫ్లోర్ కు వెళ్లాలని సూచించారని, తాను స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లేసరికి అక్కడ న్యూజిలాండ్ ఆటగాళ్లు విలపిస్తూ కనిపించారని వెల్లడించాడు.
వారు ఎప్పుడూ ఇలాంటి భయంకర అనుభవాన్ని చవిచూసి ఉండరని, బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్లిన ఆటగాళ్లు బాంబు భయంతో వణికిపోయారని నాటి సంగతులను ఇంజమామ్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆ సిరీస్ ను మధ్యలోనే ముగించుకుని కివీస్ జట్టు స్వదేశం వెళ్లిపోయిందని తెలిపాడు. కాగా, నాడు జరిగింది ఆత్మాహుతి దాడి కాగా, ఆ దాడిలో 11 మంది ఫ్రెంచ్ ఇంజినీర్లు, ఇద్దరు పాకిస్థాన్ పౌరులు సహా ఆత్మాహుతి దళ సభ్యుడు కూడా మరణించాడు.