ఉద్ధవ్...మోదీ భేటీపై సర్వత్రా ఆసక్తి: మర్యాదపూర్వకమే అంటున్న శివ సేన

expectations on modi uddav meet
  • అతిగా ఊహించుకోవద్దని వినతి 
  • ఎన్పీఆర్ కు అనుకూలంగా శివసేన 
  • అందుకే ఈ భేటీకి ప్రాధాన్యం

దేశంలో అగ్గిరాజేసిన ఎన్పీఆర్ ను చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ 'తమ రాష్ట్రంలో మాత్రం అమలు చేసి తీరుతాం' అని ఘంటాపథంగా చెబుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలవనుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇది మర్యాదపూర్వక భేటీయేనని, అతిగా ఊహించుకోవద్దని ఓవైపు శివసేన చెబుతున్నా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు నెలలు దాటిన తర్వాత మర్యాదపూర్వక భేటీ ఏంటని, ఏదో ఉందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

మహారాష్ట్రలో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనలు అధికారం చేజిక్కించుకునేందుకు సరిపడే స్థానాలు సాధించినా ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. అధిక స్థానాలు తమవే కాబట్టి సీఎం పదవి తమదేనని బీజేపీ స్పష్టం చేస్తే.. అధికారం చేజిక్కించుకునేందుకు తామే కీలకం కాబట్టి తమకే ఆ పదవి దక్కాలని శివసేన పట్టుదలకు పోవడంతో ఇరు పార్టీల మధ్య అఘాతం పెరిగింది.

ఎత్తుకు పై ఎత్తు వ్యూహాల నేపథ్యంలో మాటల యుద్ధమే కొనసాగింది. దీంతో శివసేన తన  సిద్ధాంతాలను పక్కన పెట్టి బద్ధ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో భాగస్వామ్య పక్షాలు ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తుండగా, అమలు చేసి తీరుతామని శివసేన పట్టుబడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంలో శివ సేన, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీతో ఉద్దవ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి.

Go Back to Shorts
Maharashtra
Narendra Modi
Udhav
sivasena
BJP

More Telugu News