హిప్ హిప్ హుర్రే ... ఐపీఎల్ వేలం తర్వాత 'హిట్' మెయిర్ చిందులు!

  • రూ.7.75 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ జట్టు 
  • ఈ విషయం తెలిసి హోటల్ గదిలో ఆనందంతో డ్యాన్స్ 
  • మన అభిమానులకు ఆట మజా చూపించు అంటూ ఢిల్లీ ట్వీట్

ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు. అది కూడా రెండు నెలల క్రికెట్ ఆటకు. ఈ విషయం తెలిస్తే ఎవరు మాత్రం చిందేయరు. అందుకే ఐపీఎల్ వేలంలో తనను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.75 కోట్లకు దక్కించుకుందని తెలియగానే వెస్టిండీస్ బ్యాట్స్ మన్ హెట్ మెయిర్ హోటల్ గదిలో ఆనందంతో చిందులేశాడట.

ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ ''హిట్ మెయిర్‌' కు ఢిల్లీ క్యాపిటల్స్ స్వాగతం పలుకుతోంది. మన అభిమానులకు గొప్ప క్రికెట్ అనుభూతిని పంచుతావని ఆశిస్తున్నాం' అంటూ పేర్కొంది.

ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టులో హెట్ మెయిర్ సభ్యుడు. చెన్నైలో జరిగిన తొలివండేలో సెంచరీతో అదరగొట్టాడు. రెండో వన్డేలో విఫలమైనా అంతకు ముందు టీ20లో అతని అటతీరు, ఆ ముందు జరిగిన మ్యాచ్ లో బాగా రాణించడంతో ఢిల్లీ అతనిపై దృష్టిసారించింది.

ఇప్పటి వరకు తన కెరీర్ లో హిట్ మెయిర్ 16 టెస్టులు, 41 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. టెస్ట్ ల్లో 838 పరుగులు, వన్డేల్లో 1379 పరుగులు, టీ20ల్లో 279 పరుగులు చేశాడు. గత సీజన్లో హెట్ మెయర్‌ను బెంగళూరు దక్కించుకుంది.

ఈసారి ఆ జట్టు అతనిపై ఆసక్తి చూపించకపోవడంతో తమ జట్టులోకి తీసుకునేందుకు ఢిల్లీ, కోల్ కతా, రాజస్థాన్ పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ భారీ మొత్తం ఇచ్చి హిట్ మెయిర్ ను సొంతం చేసుకుంది.

Go Back to Shorts
IPL
westindes
Hetmyer
delhi capitals

More Telugu News