అందరినీ ఒప్పించడం అంత తేలికకాదు... కానీ, సుప్రీం కోర్టు ధైర్యంగా వ్యవహరించింది: మోదీ
- అయోధ్య వివాదాస్పద భూమి హిందువులదేనని సుప్రీం తీర్పు
- స్వాగతించిన ప్రధాని నరేంద్ర మోదీ
- మహోన్నతమైన తీర్పు అంటూ వ్యాఖ్యలు
అన్ని వర్గాల వాదనలను, అభిప్రాయాలను, సూచనలను సుప్రీం కోర్టు ఎంతో సహనంతో, తెగువతో ఆలకించిందని పేర్కొన్నారు. దేశ న్యాయచరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం మొదలైందని, న్యాయమూర్తులు, న్యాయాలయాలకు శుభాభినందనలు అని వ్యాఖ్యానించారు. ఓ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించిందని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచమంతా గుర్తించిందని తెలిపారు.
భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం నేడు సంపూర్ణత్వంతో వికసించిందని పేర్కొన్నారు. భారతదేశపు ఈ మూల మంత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని మోదీ వివరించారు. నవంబరు 9 భారత చరిత్రలో నిలిచిపోయే రోజని, పాకిస్థాన్ తో సయోధ్యలో భాగంగా కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభమైందని, మరోవైపు అయోధ్య అంశంలో చారిత్రాత్మక తీర్పు వచ్చిందని అన్నారు.