ప్రధాని పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: ఇమ్రాన్ ఖాన్ స్పష్టీకరణ
- ఇమ్రాన్ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- ఈ నెల 31న ధర్నాకు పిలుపునిచ్చిన ఉలేమా-ఏ-ఇస్లామ్
- భారత్ కు లబ్ది చేకూర్చే ప్రయత్నమన్న ఇమ్రాన్
గత ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ రిగ్గింగ్ చేసి గెలుపొందారని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఆరోపిస్తున్నారు. అక్రమ మార్గంలో గెలిచిన ఇమ్రాన్ కు ప్రధాని పదవిలో కొనసాగే హక్కులేదని విమర్శిస్తున్నారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు.
"మౌలానా (ఫజ్లుర్) సమస్య ఏంటో నాకు అర్థం కావడంలేదు. ఇప్పుడు ధర్నా చేయడం ద్వారా భారత్ కు సంతోషం కలిగిస్తున్నారు. మౌలానా ధర్నా వార్తలతో భారత మీడియా సంబరాలు చేసుకుంటోంది. ఈ నిరసన ప్రదర్శన కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని పక్కకు మళ్లిస్తుంది. దీనివల్ల ఎవరికి లబ్ది చేకూరుతుందో మనం ఆలోచించాలి" అని హితవు పలికారు.