వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ నేతలకు గౌరవ ఆహ్వానం
- ఒకే వేదికపైకి వైసీపీ, టీడీపీ నాయకులు?
- ఏమిటీ మతలబు అని తలలు పట్టుకుంటున్న పలువురు
- విజయవాడ పోలీస్ జంక్షన్ లో విగ్రహం పునఃప్రతిష్ట
తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అదే జంక్షన్లో, అదే ప్రాంతంలో వైఎస్సార్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదేమీ అంత విశేషం కాకున్నా ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడమే చర్చనీయాంశమయ్యింది.
విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు జరగనుంది.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆహ్వాన పత్రికలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నానితోపాటు టీడీపీలోని కీలక నేతలైన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బీజేపీ నేత సుజనా చౌదరి పేర్లను కూడా ముద్రించారు.
శిలాఫలకంపై కూడా వీరి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మరి ఈ నేతలు ఆ కార్యక్రమానికి వెళ్తారా? లేదా? అనేదే తేలాల్సిన విషయం.