వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్
- దేశంలోని రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్న సోనూ సూద్
- ఆ రోజుల్లో రైళ్లలో పేపర్లు పరుచుకుని నిద్రించిన సందర్భాలను గుర్తు తెచ్చుకున్న వైనం
- దేశాభివృద్ధిలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
ప్రస్తుతం వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్నానని పేర్కొన్న సోనూ సూద్, దేశంలోని రైల్వే వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందడం గర్వకారణమని అన్నారు. రైలులోని ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన ఆహారం, సిబ్బంది ప్రవర్తన, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు.
ఈ ప్రయాణం తన మొదటి రైలు ప్రయాణాన్ని గుర్తు చేసిందని ఆయన చెప్పారు. నాగ్‌పూర్‌లో చదువు పూర్తి చేసిన తర్వాత నటుడు కావాలనే కలతో ముంబైకి వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రైళ్లలో రిజర్వేషన్ కూడా దొరకక, పొడవాటి కంప్యూటర్ పేపర్లను మడతపెట్టి జనరల్ బోగీల్లో ప్రయాణించేవాళ్లమని తెలిపారు. రాత్రిళ్లు పడుకోవడానికి చోటు లేక రైలు టాయిలెట్‌ల దగ్గర నేలపై పేపర్లు పరుచుకుని నిద్రించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.
అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని, వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లను నడిపే స్థాయికి భారతీయ రైల్వే చేరుకోవడం గొప్ప విషయమని సోనూ సూద్ కొనియాడారు. సామాన్య ప్రజల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చిన రైల్వే శాఖకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దేశ అభివృద్ధిలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇలాంటి మంచి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.