హైదరాబాద్‌లో విషాదం: ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ

Tragedy in Hyderabad Female techie jumps from sixth floor with baby
  • హైదరాబాద్‌లో ఆరు నెలల చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళా టెక్కీ
  • ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి, ప్రాణాలతో బయపడిన చిన్నారి
  • సోలార్ ఫెన్సింగ్ కేబుల్స్‌పై పడటంతో పసికందుకు తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల పసికందుతో సహా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి మాత్రం అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడటం గమనార్హం. హృదయ విదారకమైన ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇషా సాహు (37) తన భర్తతో కలిసి లక్ష్మీ ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ నిపుణులుగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం భర్తను ఏదో పని మీద షాపునకు పంపిన ఇషా, ఆ వెంటనే తన ఆరు నెలల కుమార్తెను తీసుకుని బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. తీవ్ర గాయాలైన ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

అయితే, కింద పడుతున్న సమయంలో ఆ చిన్నారి అపార్ట్‌మెంట్ ప్రహరీ గోడపై ఉన్న సోలార్ ఫెన్సింగ్ కేబుల్స్‌పై పడింది. ఆ తీగలే పసికందు ప్రాణాలను కాపాడాయి. చిన్నారి ఏడుపు విన్న పక్క అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వెంటనే స్పందించి, కేబుల్స్‌లో చిక్కుకున్న పాపను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

ఆరు నెలల క్రితం రెండో కుమార్తె పుట్టినప్పటి నుంచి ఇషా తీవ్రమైన డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళనతో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. వీరికి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Isha Sahu
Hyderabad techie suicide
Miyapur apartment tragedy
Baby survives miracle fall
Postpartum depression

More Telugu News