దక్షిణాఫ్రికా సిరీస్‌కు ధోనీకి తలుపులు మూసుకుపోయినట్టే!
Add ap7am to your home Screen

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ధోనీకి తలుపులు మూసుకుపోయినట్టే!

  • జట్టులో రిషబ్ పంత్ స్థానం పదిలం
  • విండీస్‌ను ఓడించిన జట్టునే యథాతథంగా ప్రకటించనున్న సెలక్టర్లు
  • వచ్చే నెల 15 నుంచి టీ20 సిరీస్ మొదలు
విండీస్‌ పర్యటనకు వ్యక్తిగత కారణాలతో దూరమైన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి సెలక్టర్లు మొండిచేయి చూపేలా కనిపిస్తోంది. వచ్చే నెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ధోనీకి స్థానం దక్కే సూచనలు కనిపించడం లేదు. అతడి స్థానంలో ప్రస్తుతం ఆడుతున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌నే కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

2020లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ మరో 22 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టును ఇప్పటి నుంచే బలంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా విండీస్‌తో తలపడిన జట్టునే యథాతథంగా సౌతాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

వచ్చే నెల 4న సౌతాఫ్రికాతో తలపడే జట్టును ఎంపిక చేయనున్న సెలక్టర్లు కరీబియన్లతో తలపడిన జట్టునే ఎటువంటి మార్పులు లేకుండా ప్రకటించనున్నట్టు సమాచారం. ధర్మశాలలో సెప్టెంబరు 15న తొలి టీ20 జరగనుండగా, 18న మొహాలీలో రెండో మ్యాచ్, 22న బెంగళూరులో చివరిదైన మూడో మ్యాచ్ జరగనుంది. కాగా, ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత ప్రొటీస్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్.
MS Dhoni
west Indies
south africa
rishabh pant

More Telugu News