జైలుకెళ్లినోళ్లంతా గొప్ప నాయకులు అవుతారు: జమ్మూకశ్మీర్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
- నేనైతే 30 సార్లు జైలుకెళ్లా..
- నిర్బంధంలో ఉన్నామని బాధపడొద్దు
- ఎన్నికల్లో ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది
ఆర్టికల్ 370ని ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత గవర్నర్ మాలిక్ తొలిసారి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతోపాటు ఇతర నేతల నిర్బంధం కొనసాగుతుండడంపై విలేకరులు ప్రశ్నించారు.
దీనికి గవర్నర్ బదులిస్తూ.. ‘‘వారు గొప్ప నేతలు అవడం ఇష్టం లేదా? నేను 30 సార్లు జైలుకు వెళ్లొచ్చా. ఎవరైతే జైలుకు వెళ్తారో, ఎవరైతే ఎక్కువ రోజులు జైలులో ఉంటారో వారు గొప్ప నేతలు అవతారు. ఎన్నికల సందర్భంలో ఇది వారికి బాగా కలిసొస్తుంది. నేనైతే ఆరు నెలలు జైలులో గడిపా’’ అని మాలిక్ పేర్కొన్నారు. కాబట్టి నిర్బంధంలో ఉన్నందుకు విచారం వద్దని హితవు పలికారు.