‘లవ్‌ యాత్రి’గా మారిన 'లవ్ రాత్రి'!

  • తన బావ హీరోగా సినిమా నిర్మించిన సల్మాన్
  • వివాదాస్పదంగా మారిన టైటిల్
  • నవరాత్రులను అవమానిస్తున్నట్టుగా ఉందని ఆగ్రహం
ఒక కొత్త కథనంతో హిందీలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం 'లవ్ రాత్రి'. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బావ ఆయుష్ శర్మను కథానాయకుడిగా పరిచయం చేస్తూ, సొంత బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ చిత్రం టైటిల్‌ చాలా వివాదాస్పదమైంది. అభిరాజ్ మీనావాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్ సరసన వారినా హుస్సేన్ కథానాయికగా నటించింది.

కథ ప్రకారం, నవరాత్రి పండుగ రోజున ఆయుష్, వారినా కలుస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వారి ప్రేమ ఎలా చిగురించిందన్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే తాము పవిత్రంగా భావించే దేవీ నవరాత్రులను అవమానిస్తున్నట్టుగా ఈ చిత్రం టైటిల్ ఉందని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ ని మార్చకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికలు చేశారు.

ఈ క్రమంలో సినిమా టైటిల్‌లో మార్పులు చేస్తూ ‘లవ్‌యాత్రి’ అనే కొత్త టైటిల్‌తో పోస్టర్‌ను సల్మాన్ నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘ఇందులో ఎలాంటి అక్షర దోషం లేదు. సినిమా టైటిల్‌ను లవ్‌యాత్రిగా మార్చాం’ అంటూ సల్మాన్ ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
Salman khan
ayush sharma
arina hussain
abhiraj meenawala
love yatri

More Telugu News