కేంద్రానికి షాకిచ్చిన వాట్సాప్.. ప్రభుత్వం చెప్పినట్టు చేయలేమని చేతులెత్తేసిన వైనం!
- ప్రభుత్వం కోరినట్టు సాఫ్ట్‌వేర్ రూపొందించలేమని స్పష్టీకరణ
- అలా చేస్తే వాట్సాప్ స్వభావానికి భంగం వాటిల్లుతుందన్న వాట్సాప్
- ఎన్‌క్రిప్షన్‌కు విఘాతం కలిగించలేమన్న వాట్సాప్ సీఈవో
వాట్సాప్‌పై పూర్తి విశ్వాసంతో సున్నితమైన, అత్యంత రహస్యమైన విషయాలను కూడా అందులో పంచుకుంటున్నారని, ప్రభుత్వ ఆదేశాలతో వారి నమ్మకాన్ని వమ్ము చేయలేని పేర్కొంది. వైద్యులు, బ్యాంకులు, కుటుంబ సభ్యులు అత్యంత రహస్యమైన సంభాషణలకు దానిని వినియోగించుకుంటున్నారని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. అయితే, ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం షేర్ కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన వివరించారు.
వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్న తప్పుడు సమాచారం మూక హత్యలకు దారితీస్తుండడంతో వాట్సాప్ చర్చనీయాంశమైంది. దీనికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వాట్సాప్‌ను కోరింది. మూడు రోజల క్రితం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫేక్‌న్యూస్ తొలుత పుట్టిస్తున్న వారిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాల్సిందిగా కోరారు. అలాగే, ఫిర్యాదుల స్వీకరణకు ఓ అధికారిని కూడా నియమించాలని సూచించారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.