ప్రేమించిన అమ్మాయిని అమ్మ ముందు నిలబెట్టా... అమ్మ మాట వినబట్టే మంచిదైంది: జగపతిబాబు

  • ప్రేమ వివాహం వద్దని అమ్మ వారించింది
  • ఆ క్షణం సర్వస్వం కోల్పోయినట్టుగా భావించా
  • ఆ తరువాత ఎంత మంచి జరిగిందో అర్థమైందన్న జగపతిబాబు
తాను యుక్త వయసులో ఉన్న వేళ, ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పిన జగపతిబాబు, ఆపై జరిగిన ఆసక్తికర ఘటనను ఓ పత్రిక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లి అమ్మ ముందు నిలబెట్టి పరిచయం చేశానని, తన మనసులోని మాటను చెప్పానని, అప్పుడు అమ్మ ప్రేమ వివాహం వద్దని గట్టిగా చెబుతూ వారించిందని గుర్తు చేసుకున్నారు. ఆ క్షణంలో తన కలలన్నీ కూలిపోయినట్టు అనిపించిందని, తన సర్వస్వాన్నీ కోల్పోయినట్టుగా బాధపడ్డానని, అయితే, ఆ తరువాతే తాను ఆ అమ్మాయిని చేసుకోకపోవడం ఎంత మంచిదైందో తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు.

 ప్రేమికులు తమ పెద్దల మాట గౌరవించాలని, పిల్లల మేలును తల్లిదండ్రులకన్నా మరెవరూ కోరుకోరని చెప్పారు. ప్రేమ విఫలమైందని చంపడమో, చావడమో చేయవద్దని, తాను ఆనాడు ఆపని చేయలేదు కాబట్టే, నేడు ఇలా ఉండగలిగానని అన్నారు. తన కూతురికి ఓ విదేశీయుడితో వివాహం జరిపించడాన్ని గుర్తు చేసుకుంటూ, తన తల్లి వద్దని వారించినా, తానే నచ్చజెప్పానని, ఇప్పుడు వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. తాను ఎంతో మంది స్నేహితులకు ప్రేమ పెళ్లిళ్లు చేశానని, అన్నీ చిన్న చిన్న పంచాయితీలతోనే సెటిల్ అయ్యాయని అన్నారు.

తనకు హస్తరేఖలను చూసి జ్యోతిష్యం చెప్పడం తెలుసునని, అయితే, ఎవరి చేతులనూ చూసి జాతకాలు మాత్రం చెప్పడం లేదని అన్నారు. తాను ప్రత్యేకించి బాడీ బిల్డింగ్ చేయడం వంటివి చేయలేదని, నిత్యమూ యోగా చేయడం, తన శరీరానికి సరిపడే ఆహారం తీసుకోవడం అలవాటని అన్నారు.
Go Back to Shorts
Tollywood
Love Marriage
Jagapati Babu

More Telugu News