హనీమూన్‌పై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఆ వాదనకు చెక్ పెడతానంటూ ధీమా!
- ప్రస్తుతానికైతే తన దృష్టి అంతా ‘సావిత్రి’ మీదేనన్న అక్కినేని వారి కోడలు
- సినిమాలు, వ్యక్తిగత జీవితం రెండూ ముఖ్యమేనని వ్యాఖ్య
- రాజుగారి గది 2 సినిమా చూసి తనవైపు చైతన్య అనుమానంగా చూశాడన్న సమంత
‘ రాజుగారి గది 2’ సినిమాలోని తన పాత్రకు లభిస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందన్న సమంత అక్టోబరు నెల తనకు చాలా లక్కీ నెలగా మారిందని పేర్కొంది. ప్రతీ పాత్ర తనకే రావాలని తనెప్పుడూ అనుకోలేదని చెప్పుకొచ్చింది. చైతన్యకు హారర్ సినిమాలు చూడడం అస్సలు ఇష్టం లేకున్నా తనతో కలిసి సినిమా చూశాడని చెప్పింది. సినిమా చూసిన తర్వాత తనను అనుమానంగా చూశాడని, తాను అమృతనా? సమంతనా? అన్న సందేహం వచ్చి ఉంటుందని నవ్వుతూ చెప్పింది.
‘ఏమాయ చేశావే’ సినిమాలోనూ చైతూ, తాను రెండుసార్లు, రెండు పద్ధతుల్లో వివాహం చేసుకున్నామని, ఇప్పుడు నిజ జీవితంలోనూ అదే జరిగిందని ఉద్వేగంగా చెప్పింది. గోవా తమకు సెంటిమెంట్ ప్లేస్ అనే అక్కడ పెళ్లి చేసుకున్నట్టు సమంత వివరించింది.