నేడు విండీస్‌తో తొలి వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులివే.. అన్నీ అరుదైనవే!

నేడు విండీస్‌తో తొలి వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులివే.. అన్నీ అరుదైనవే!

Virat Kohli eyes massive records in first ODI against West Indies
  • 15వేల‌ వన్డే పరుగుల మైలురాయికి కేవలం 59 ర‌న్స్‌ దూరంలో కోహ్లీ
  • అలాగే సచిన్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం
  • ఈ ఏడాది అద్భుతమైన‌ ఫామ్‌లో ఉన్న విరాట్‌
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి రికార్డుల వేటకు సిద్ధమయ్యాడు. తిరువనంతపురం వేదికగా నేడు వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో అతను పలు అరుదైన మైలురాళ్లపై కన్నేశాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో 15,000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి కోహ్లీ కేవలం 59 పరుగుల దూరంలో ఉన్నాడు. 

ప్రస్తుతం 314 మ్యాచ్‌లలో 14,941 పరుగులు చేసిన విరాట్, ఈ ఘనత సాధిస్తే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (18,426) తర్వాత ఈ రికార్డు అందుకున్న రెండో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

కోహ్లీకి బాగా కలిసొచ్చిన తిరువనంతపురం స్టేడియం 
ఈ మ్యాచ్‌కు వేదికైన తిరువనంతపురం స్టేడియం కోహ్లీకి బాగా కలిసొచ్చిన మైదానం. ఇక్కడ ఆడిన రెండు వన్డే మ్యాచ్‌లలోనూ విరాట్ ఒక్కసారి కూడా ఔట్ కాకపోవడం విశేషం. మొత్తం 199 పరుగులు చేశాడు. గత ఏడాది జనవరిలో శ్రీలంకపై ఇదే మైదానంలో 110 బంతుల్లో 8 సిక్సర్లు, 13 ఫోర్లతో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, ఆ తర్వాత మెరుపువేగంతో ఆడి 166 పరుగులకు చేరడం అతని అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అదే మైదానంలో మరోసారి చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

సచిన్‌కు చెందిన మరికొన్ని రికార్డులనూ బ్రేక్ చేసే ఛాన్స్‌
ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌కు చెందిన మరికొన్ని రికార్డులనూ బద్దలు కొట్టే అవకాశం కోహ్లీ ముందుంది. స్వదేశంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన సచిన్ (6,976) రికార్డును అధిగమించడానికి కోహ్లీకి మరో 110 పరుగులు అవసరం. ప్రస్తుతం కోహ్లీ స్వదేశంలో 6,867 పరుగులు చేశాడు. 

అలాగే, స్వదేశంలో సచిన్ (42) పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డును బద్దలు కొట్టాలంటే విరాట్ మరో రెండు శతకాలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 41 స్వదేశీ సెంచరీలు ఉన్నాయి.

విండీస్‌పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు 
వెస్టిండీస్‌పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఆ జట్టుపై 41 ఇన్నింగ్స్‌లలో 9 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో 66.50 సగటుతో 2,261 పరుగులు చేశాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 64.00 సగటుతో 384 పరుగులు సాధించాడు. ఈ ఫామ్‌తో నేటి మ్యాచ్‌లో కనీసం ఒక్క రికార్డునైనా అందుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Virat Kohli
India vs West Indies ODI
Thiruvananthapuram Stadium
Sachin Tendulkar
ODI Cricket Records
15000 ODI Runs

More Telugu News