పోలీసులకు వింత అనుభవం.. ఒకేసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో మోగిన ప్రొఫెసర్ లక్ష్మి సెల్ఫోన్!
సాధారణంగా ఒక నంబరుపై ఒకే మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. కానీ ఒకేసారి ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల ఫోన్ మోగడంతో పోలీసులు అవాక్కయ్యారు. డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె కోసం గాలిస్తున్న పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఆమె వాడుతున్న ఫోన్ను ట్రాప్ చేసే పనిలో ఉన్న పోలీసులు శనివారం లక్ష్మి నంబరుకు ఫోన్ చేశారు.
అయితే ఆ సమయంలో ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల ఫోన్ పనిచేస్తున్నట్టు సిగ్నళ్ల ద్వారా గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లి పోలీసులు గాలించారు. కాగా పరారీలో ఉన్న లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ విజయసారథి, కుమారుడు, కుమార్తెల ఆచూకీ కూడా లభించలేదు. మరోవైపు లక్ష్మి ముందస్తు బెయిల్ పిటిషిన్పై నేడు గుంటూరు జిల్లా మూడో అదనపు సెషన్స్ కోర్టులో వాదనలు జరగనున్నాయి.