ఆక్రమణల కేసులో హీరో మాధవన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు
రాజవైక్కల్ నీటి కాలువను ఆక్రమించుకున్న కేసులో ప్రముఖ సినీ నటుడు మాధవన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మాధవన్ తన భూమి పక్కన ఉన్న ఒక నీటి కాలువను ఆక్రమించుకున్నాడంటూ ఎన్.గణేశన్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాడు. జస్టిస్ కెకె శశిధరన్, జస్టిస్ బి.గోకుల్ దాస్ తో కూడిన బెంచ్ ఈ పిటిషన్ ను పరిశీలించింది. మాధవన్ కు, జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, అయ్యంపౌలీ, బాలసముద్రం గ్రామాలకు ప్రధాన నీటి వనరుగా రాజవైక్కల్ నీటి కాలువ ఉంది. హీరో మాధవన్ నీటి కాలువనే కాకుండా ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.