కోహ్లీతో పోల్చడం పట్ల అసహనం వ్యక్తం చేసిన పాక్ క్రికెటర్
పాకిస్థాన్ జట్టు ఓపెనర్ అహ్మద్ షేజాద్ మీడియా తనను భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీతో పోల్చడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తమ మధ్య పోలికలు లేవని స్పష్టం చేశాడు. "అతను భారత్ కు ఆడుతున్నాడు, నేను పాకిస్థాన్ కు ఆడుతున్నాను. అతని ఆశయాలు అతనికున్నాయి, నా లక్ష్యాలు నాకున్నాయి. నేను ఆడిన మ్యాచ్ లకు రెట్టింపు సంఖ్యలో అతను ఆడాడు. మీడియా ఇలాంటి ధోరణికి స్వస్తి పలకాలి" అని పేర్కొన్నాడు. ఇక, తనపై వస్తున్న ఆరోపణలపైనా ఈ స్టయిలిష్ బ్యాట్స్ మన్ స్పందించాడు. క్రమశిక్షణ రాహిత్యానికి తాను కేరాఫ్ అడ్రెస్ అంటూ వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశాడు. "స్వేచ్ఛగా, సంతోషంగా క్రికెట్ ఆడడాన్ని ఆస్వాదిస్తాను. అదే నా అభిమతం. మంచి దుస్తులు ధరిస్తాను, బాగా తింటాను, తిరుగుతాను. అంతమాత్రాన జట్టుకు సహకరించనివాణ్నని కాదు, సహచరులను గౌరవించనివాణ్నని కాదు. చాలా వరకు అపోహలు పెంచుకున్నారు" అని ఆవేదన వెలిబుచ్చాడు.