కన్నీరు పెట్టిన పీతల సుజాత
ఏపీ మంత్రి పీతల సుజాత మీడియా సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బదులిచ్చే క్రమంలో ఆమె ఒక్కసారిగా భావోద్వేగాలకు లోనయ్యారు. కాసేపు ఏమీ మాట్లాడలేకపోయిన మంత్రి, ఆపై కళ్లు తుడుచుకుని గద్గద స్వరంతో మాట్లాడారు. పేద కుటుంబంలో పుట్టిన తాను కష్టపడి ఎదిగానని, క్రమశిక్షణ, సంస్కారంతో పెరిగానని చెప్పారు. అవినీతి మకిలి అంటని చంద్రబాబు సర్కారులో పనిచేస్తున్నానని తెలిపారు. రోజా మాటలు వింటుంటే సమాజ భవితపై ఆందోళన కలుగుతోందని అన్నారు. తాను ఆమెలా మాట్లాడలేనని అన్నారు. తనపై వైసీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సుజాత స్పష్టం చేశారు.