ఏపీ బీజేపీ నేతలకూ ధైర్యం వచ్చింది... సాయంత్రం ఢిల్లీ వెళ్లి, నిధుల కోసం మోదీని కలుస్తారట
రాష్ట్ర విభజన అనంతరం, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం పాలుపంచుకుంటుందని అందరూ భావించారు. భారీగా కాకపోయినా, అవసరమైనంత మేరకు నిధులను మంజూరు చేస్తుందని అనుకున్నారు. అయితే, మొన్నటి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపడంతో... రాష్ట్రంలోని అన్ని పార్టీలూ భగ్గుమన్నాయి. సాక్షాత్తూ బీజేపీ మిత్రపక్షం, కేంద్రంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆవేదనను వ్యక్తీకరించారు. ఇక టీడీపీ నేతలైతే బీజేపీపై ఏకంగా విమర్శలే గుప్పించారు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఏపీకి చెందిన బీజేపీ నేతలకు (వీరిలో ఏపీ రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు) ఎలా స్పందించాలో అర్థంకాలేదు. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా వీరి పరిస్థితి తయారయింది.
ఏదైతేనేం, చివరకు ఏపీ బీజేపీ నేతలు ధైర్యం తెచ్చుకున్నారు. ఈ సాయంత్రం రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీని కలసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేయనున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజధానికి నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం, రాయలసీమ కరవు, రెవెన్యూ లోటు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళతామని తెలిపారు. దీంతోపాటు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడులను కలుస్తామని చెప్పారు.