'లింగా' చిత్రంపై మరో కథా చౌర్యం కేసు!
ఈనెల 12న విడుదలకు సిద్ధమైన రజనీకాంత్ నటించిన 'లింగా' చిత్రానికి మరోసారి సమస్యల్లో చిక్కుకుంది. చెన్నైలోని సిటీ సివిల్ కోర్టులో కథా చౌర్యానికి పాల్పడ్డారంటూ ఈ సినిమాపై పిటిషన్ దాఖలైంది. కేరళలో ముళ్లపెరియార్ డ్యామ్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన బ్రిటీష్ ఇంజినీర్ జాన్ పెన్నీక్విక్ జీవితం ఆధారంగా 'ఉయిర్ అనాయ్' అనే చిత్రం కోసం తానొక కథ రాశానని, దాన్ని చాలా మంది దర్శకులకు వినిపించినప్పటికీ సినిమా రూపొందించడానికి భారీ బడ్జెట్ అవుతుందన్న కారణంగా వెనుకాడారని శక్తివేల్ అనే రచయిత తన పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే, తాజాగా నిర్మించిన 'లింగా' పెన్నీక్విక్ ఆధారంగానే తీశారని మీడియా వార్తల ద్వారా తెలిసి పిటిషన్ వేశానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇది ముందుగానే తన కథ కాబట్టి చిత్రం విడుదలపై స్టే విధించాలని రచయిత కోరారు. వెంటనే పిటిషన్ ను పరిశీలించిన అడిషనల్ సిటీ సివిల్ కోర్టు జడ్జి, చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్, నిర్మాత వెంకటేష్, కథా రచయిత పొంకుమార్ లకు నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేశారు. ఇటీవలే ఈ చిత్రంపై దాఖలైన ఇలాంటి రిట్ పిటిషన్ ను మధురై బెంచ్ కొట్టివేసిన సంగతి తెలిసిందే.