మహిళలు ఎన్నటికీ పురుషులతో సమానం కాలేరంటున్న టర్కీ అధ్యక్షుడు!
మహిళల హక్కులపై ఏర్పాటు చేసిన సభలో టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఎన్నటికీ పురుషులతో సమానం కాలేరని ఆయన అభిప్రాయపడ్డారు. సహజంగానే స్త్రీలు సున్నితమైన వారని, దాంతో, వారిని పురుషులతో సమానులుగా భావించలేమని సెలవిచ్చారు. "పురుషుడు చేసే ప్రతి ఉద్యోగంలో మహిళలను నియమించలేం. స్త్రీవాదులు మాతృత్వం విలువను గుర్తించడం లేదు" అని పేర్కొన్నారు. పలుగు, పార ఇచ్చి వారితో పని చేయించలేమని తెలిపారు. అయితే, చట్టం పరిధిలో మాత్రం వారిని సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో సామాజికంగా స్త్రీపురుషుల పాత్రను గుర్తించాల్సి ఉందన్నాడు. శారీరకంగా సమానులు కారన్న సంగతి తెలిసిందేనని, అయితే, హక్కులు, స్థాయి, అవకాశాలు పొందడంలో వారు పురుషులతో సమంగా పరిగణించాలని సూచించారు.