జపాన్ లో టెక్కీ అవతారమెత్తిన చంద్రబాబు
జపాన్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సరికొత్త అవతారం ఎత్తారు. అచ్చం టెక్కీ తరహాలో వేదికనెక్కిన చంద్రబాబు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొదలెట్టి, జపాన్ ప్రతినిధులను ఇట్టే ఆకట్టుకున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పానసానిక్ సహా మరికొన్ని కంపెనీల నుంచి వచ్చిన దిగ్గజాలతో సంయుక్త భేటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ నయా టెక్కీలా డయాస్ ఎక్కిన ఆయన నేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొదలుపెట్టారు. జపాన్ పారిశ్రామిక దిగ్గజాలతో పాటు చంద్రబాబు వెంట జపాన్ వెళ్లిన మంత్రులు, అధికారులు కూడా బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఆసక్తిగా విన్నారు. సూటు బూటు లేదనేగాని, చంద్రబాబు వ్యవహార సరళి సాంతం టెక్కీ తరహాలోనే సాగింది. తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో భాగంగా ఏపీలో వ్యాపార అవకాశాలు, ప్రభుత్వం నుంచి లభించనున్న ప్రోత్సాహకాలు, అనుమతుల మంజూరులో వేగం తదితరాలను చంద్రబాబు ప్రస్తావించారు.