డియోడరెంట్, పెర్ ఫ్యూమ్ వాడడం ఎంత వరకు సేఫ్...?

నలుగురిలో చిన్నబోకూడదు. నలుగురి పక్కనుంచి వెళుతుంటే శరీరం నుంచి దుర్గంధం రాకూడదు. (దుర్వాసన) వస్తే ఆ పరిస్థితే భిన్నం. అందుకేనేమో ఒకప్పుడు మనకు అంతగా తెలియని బాడీ స్ప్రే / డియోడరెంట్లు నేడు బాగా వ్యాప్తిలోకి వచ్చేశాయి. బాడీ స్ప్రే లేదా పెర్ ఫ్యూమ్ ఏవైనా గానీ ప్రకృతిలో సహజంగా లభించే సుగంధ పరిమళాలతో తయారైనవి అయితే కనుక, వాటితో వచ్చే నష్టమేమీ లేదు. కానీ, కృత్రిమ రసాయనాలతో తయారైన వాటివల్ల కొన్ని అనర్థాలున్నాయంటున్నారు నిపుణులు.

చెమట పట్టడం అన్నది శరీర జీవక్రియల్లో ఒకానొక చర్య. వేడి, తేమ ఉన్న ప్రాంతాల్లో బ్యాక్టీరియా చేరుతుంది. ఉదాహరణకు చంకలు, పాదాలు, గజ్జలు. ఇక్కడ శరరీంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందులోనూ చేతుల కింద చంక భాగంలో వేడి ఎక్కువ. కనుక ఎక్కువ బ్యాక్టీరియాకు ఇది కేంద్రంగా మారుతుంది. చెమట బ్యాక్టీరియా చర్యకు గురికావడం (చెడిపోవడం, పులియడం) వల్ల ట్రాన్స్ 3 మెతిల్ 2 హెక్సోనాయిక్ యాసిడ్ విడుదల అవుతుంది. దీంతో దుర్గంధం వెలువడుతుంది.  నిజానికి చెమటకు ఎటువంటి వాసనా ఉండదు. దుర్గంధం బ్యాక్టీరియా చర్య కారణంగా వచ్చేదే.  

representative imageడియోడరెంట్లు, పెర్ఫ్యూమ్ డియోడరెంట్లు అన్నవి స్వేద గ్రంధులపై ప్రభావం చూపి, స్వేదం విడుదల కాకుండా అడ్డుకుంటాయి. బాడీ స్ప్రే, రూమ్ డియోడరైజర్/రూమ్ స్ప్రే లో ఉండే పరిమళాలు ముక్కును చేరిన ప్రతిసారీ కొందరికి తుమ్ములు వచ్చేస్తుంటాయి. అలాంటి వారు తమకు అవి సరిపడవని అర్థం చేసుకుని వాటిని పక్కన పెట్టేయాలి. ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా వంటి వ్యాధులున్న వారికి వీటితో సమస్యలు ఎదురవుతాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో వీటివల్ల 30 శాతం మందికి ఇరిటేషన్ వస్తున్నట్టు తెలిసింది.

నిజానికి పెర్ ఫ్యూమ్స్ అన్నవి అలెర్జెన్స్ కాదు. ఇరిటంట్స్.  అలర్జెన్స్ ను ఎదుర్కొనేందుకు శరీరంలోని వ్యాధినిరోధక శక్తి కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. దీంతో ఇన్ఫ్లమ్మేషన్ ఏర్పడుతుంది. కళ్లవెంట నీరు కారడం, ముక్కులు మూసుకుపోవడం వంటి కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. కానీ, ఇరిటంట్స్ అన్నవి రసాయనాలు. ఇవి నేరుగా పలు లక్షణాలకు కారణమవుతాయి. నిజానికి ఈ రెండింటి కారణంగా ఏర్పడే లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అయితే, అలెర్జీతో వచ్చే లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి.

ఫ్రాగ్రాన్స్ సెన్సిటివిటీ వల్ల శ్వాసకోశ, ముక్కు, కళ్లు సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. తలనొప్పి, శ్వాస తీసుకోవడం, శ్వాసలో గురక, ఛాతీలో పట్టేసినట్టు ఉండడం, ఉబ్బస లక్షణాలు, ముక్కు కారడం, తుమ్ములు, చర్మంపై దురద, మంట, ర్యాష్ కనిపిస్తాయి. కనుక ఈ సమస్యలు కనిపించే వారు ఫ్రాగ్రాన్స్ ఉత్పత్తులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. లోషన్లు, సబ్బులు, చర్మ సంబంధిత సౌందర్య ఉత్పత్తుల్లో ఫ్రాగ్రాన్స్ లేకుండా చూసుకోవాలి.

దాదాపు చాలా డియోడరెంట్లలో అలూమినమ్ క్లోరోహైడ్రేట్ అనేది ఉంటుంది. దీనివల్ల పెద్దగా హాని ఉండదు కానీ, అలూమినమ్ క్లోరైడ్ ఉంటే మాత్రం ఎంతో హాని కలుగుతుంది. అందుకే కిడ్నీ వ్యాధులున్న వారు అలూమినమ్ ఉన్న డియోడరెంట్లను వాడరాదని అమెరికా అహార, ఔషధ నియంత్రణ మండలి (ఎఫ్ డీఏ) సూచించింది. వీటిని వాడితే చర్మం ద్వారా కొద్ది మొత్తాల్లో అలూమినమ్ శరీరంలోకి చేరి మూత్రపిండాలకు ముప్పుగా మారుతుందుని ఎఫ్ డీఏ ఈ సూచన చేసింది. అలూమినమ్ అనే కెమికల్ ఉండే డియోడరెంట్ ఉపయోగించినట్టయితే జ్ఞాపకశక్తి క్షీణతకు కారణమయ్యే అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధులు ముందుగానే వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. సాధారణంగా ఇవి వృద్ధుల్లో కనిపిస్తుంటాయి. దీనివల్ల  ఆలోచనా శక్తి మందగించడం, మాట్లాడడంలో తడబడడం వంటివి వస్తాయి. డియోడరెంట్లను అమెరికా ఆహార ఔషధ నియంత్రణ మండలి (యూఎస్ఎఫ్ డీఏ) సౌందర్య ఉత్పత్తిగా పరిగణిస్తోంది. డియోడరెంట్లలో సోడియం స్టెరేట్, సోడియం క్లోరైడ్, స్టెరిల్ అల్కహాల్, ట్రైక్లోసాన్ ఇలా ఎన్నో కెమికల్స్ ఉంటాయి.  

గర్భిణులు డియోడరెంట్లు, పెర్ ఫ్యూమ్ లలో ఉండే రసాయనాల ప్రభావానికి లోనయితే పుట్టే పిల్లలలో లోపాలు వచ్చే ప్రమాదం ఉందట. చిన్న పిల్లలు వీటి ప్రభావానికి లోనయితే యుక్తవయసు లక్షణాలు ముందే మొదలవుతాయట. కణాల్లో పరివర్తనకు, హార్మోన్ల బ్యాలన్స్ పై ఫ్రబావం చూపుతాయి. దాంతో ముందే యుక్తవయసు వచ్చేస్తుందట.

representative imageపెర్ ఫ్యూమ్ లేదా డియోడరెంట్లు లేదా స్వేద నిరోధక లేపనాలు ఏవైనా గానీ చంకల్లో రాసుకోవడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని కొందరి ఆందోళన. కానీ, ఇది ఇంత వరకూ నిర్ధారణ కాలేదు.

డియోడరెంట్లలోని రసాయనాలు, ఆల్కహాల్ వల్ల చర్మం అలెర్జీలు రావచ్చు. అలాగే చర్మం పొడిబారవచ్చు. ర్యాషెస్ కనిపించవచ్చు. ఇక డియోడరెంట్లలో ఉండే ట్రైక్లోసాన్ అనే కీటక నివారణ మందు కారణంగా చర్మం నల్లబడుతుంది. వీటిలో ఉండే హానికారక కెమికల్స్ తలనొప్పి, తీవ్రమైన తలనొప్పికి కారణమయ్యే మైగ్రేయిన్, సైనస్ తలనొప్పికి కారణమవుతాయి. సరిపడని వారికి తరచూ తలనొప్పి వస్తుంటుంది.

పెర్ ఫ్యూమ్ ఉత్పదనల్లో ఉండే కెమికల్స్

అసెటోన్: పాత్రలను శుభ్రం చేసేందుకు వాడే సోప్, ద్రవం, బట్టల సబ్బులు, గోళ్ల రంగును తొలగించే వాటిలో ఉంటుంది. ఈ రసాయానాన్ని పీల్చడం వల్ల నోరు, గొంతు ఎండిపోవడం, తలతిరగడం, వికారం, మగత వంటి ఇబ్బుందులు ఎదురవుతాయి. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ డిప్రసెంట్ గా ఇది పనిచేస్తుంది.

representative imageబెంజల్ డిహైడ్: పెర్ ఫ్యూమ్, డియోడరెంట్లు, హెయిర్ స్ర్పే, లాండ్రీ బ్లీచ్, డిటర్జెంట్, వాజిలైన్, షేవింగ్ క్రీమ్, షాంపూ, బార్ సోప్, డిష్ వాష్ డిటర్జెంట్ లో ఈ కెమికల్ ఉంటుంది. నోరు, గొంతు, కళ్లు, చర్మం, ఊపిరితిత్తులు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. వికారం, కడుపులో నొప్పి, కిడ్నీల వైఫల్యానికి దారితీయవచ్చు.

బెంజిల్ అసిటేట్: పెర్ ఫ్యూమ్, షాంపూ, వస్త్రాలను సాఫ్ట్ గా మార్చేవి, ఎయిర్ ఫ్రెష్ నర్, డిష్ వాషింగ్ లిక్విడ్ (పాత్రలను శుభ్రం చేసే ద్రావకం), డిటర్జెంట్ సోప్ (బట్టల సబ్బు) లో ఈ కెమికల్ ఉంటుంది. వీటి కారణంగా దగ్గు, శ్వాసకోస వ్యాధులు, కళ్ల మంట తదితర సమస్యలు ఎదురవుతాయి.

బెంజిల్ అల్కహాల్: పెర్ ఫ్యూమ్, షాంపూ, గోళ్ల రంగును తొలగించేవి, ఎయిర్ ఫ్రెష్ నర్, లాండ్రీ బ్లీచ్, డిజర్జెంట్, వాజిలైన్, డియోడరెంట్లు, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్ లో ఈ కెమికల్ కనిపిస్తుంది. శ్వాసకోస సమస్యలు, తలనొప్పి, వికారం, వాంతులు, తలతిరగడం, బీపీ తగ్గడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.

కేంఫర్: పెర్ ఫ్యూమ్, షేవింగ్ క్రీమ్, గోళ్ల రంగును తొలగించేవి, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్, డిష్ వాష్ డిటర్జెంట్, గోళ్ల రంగు, ఎయిర్ ఫ్రెష్ నర్ లో ఉండే ఈ కెమికల్  కారణంగా కళ్లలో, ముక్కు, గొంతులో ఇరిటేషన్, తల తిరగడం, గంగరగోళం, వికారం వంటివి కనిపిస్తాయి.

ఎథనాల్: పెర్ ఫ్యూమ్, షాంపూ, షేవింగ్ క్రీమ్, గోళ్ల రంగు, గోళ్ల రంగును తొలగించేవి, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్, డిష్ వాష్ డిటర్జెంట్, లాండ్రీ డిటర్జెంట్, సబ్బులు, వాజిలైన్ లోషన్, ఎయిర్ ఫ్రెష్ నర్,  పెయింట్లు, వార్నిష్ లో ఇది ఉంటుంది.  వీటివల్ల అలసట, కళ్లలో మంట, నీరు కారడం, ఉదర శ్వాసకోస సమస్యలు, మగత, చూపు మందగించడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

ఎథిల్ అసిటేట్: షేవింగ్ తర్వాత రాసుకునే లోషన్, పెర్ ఫ్యూమ్, షాంపూ, గోళ్ల రంగు, గోళ్ల రంగును తొలగించేవి, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్, డిష్ వాషింగ్ లిక్విడ్ లో ఈ కెమికల్ ఉంటుంది. కళ్లు, శ్వాసకోస సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.

representative imageలిమోనీన్: పెర్ ఫ్యూమ్, బార్ సోప్, షేవింగ్ క్రీమ్, డియోడరెంట్లు, గోళ్ల రంగు, గోళ్ల రంగు తొలగించేవి, ఫ్యాబ్రిక్ సాప్ట్ నర్, డిష్ వాషింగ్ లిక్విడ్, ఎయిర్ ఫ్రెష్ నర్లు, షేవింగ్ అనంతరం రాసుకునే లోషన్, పెయింట్, వార్నీషులలో ఇది ఉంటుంది. ఇది సెన్సిటైజర్. ఈ కెమికల్ ఉన్న వాటిని పట్టుకున్న తర్వాత చేతులను ఎక్కువ నీటితో శుభ్రం చేసుకోవాలి.

మెథిలీన్ క్లోరేడ్: షాంపూ, పెయింట్, వార్నీషులలో ఉంటుంది. 1988లో అమెరికా ఎఫ్ డీఏ దీన్ని నిషేధించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. శరీరంలోని కొవ్వులోకి చేరిపోయి రక్తంలో ఆక్సీజన్ సరఫరా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

పినేన్: ద్రవ సబ్బు, పెర్ ఫ్యూమ్, షేవింగ్ క్రీమ్, డియోడరెంట్లు, డిష్ వాషింగ్ లిక్విడ్, ఎయిర్ ఫ్రెష్ నర్ లో ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది.

టెర్పైనిన్: పెర్ ఫ్యూమ్, లాండ్రీ డిటర్జెంట్, బ్లీచ్ పౌడర్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్, ఎయిర్ ఫ్రెష్ నర్, వాజిలైన్ లోషన్, సబ్బులు, హెయిర్ స్ప్రే, షేవింగ్ తర్వాత రాసుకునే లోషన్, డియోడరెంట్ లలో ఈ కెమికల్ కనిపిస్తుంది. దీనివల్ల ఉపిరితిత్తుల్లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్లు ఇరిటేషన్ కు గురవుతాయి.

కొన్ని వాస్తవాలు

  • ఫ్రాగ్రాన్స్ లలో వాడే 95 శాతం కెమికల్స్ పెట్రోలియం నుంచి వెలికితీసే సింథటిక్ కాంపౌండ్లే. వాటిలో ఉండే బెంజీన్ డెరివేటివ్స్, అల్డీహైడ్స్ ఇతర విష పదార్థాలు కేన్సర్ కు, పుట్టుక లోపాలకు, కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలకు, అలెర్జీ రియాక్షన్లకు కారణమవుతాయి. ఈ విషయాన్ని యూఎస్ ప్రతినిధుల సభ 1986, సెప్టెంబర్ నాటి నివేదిక వెల్లడించింది.
  • సౌందర్య సాధనాల్లో సాధారణంగా 138 రకాల కాంపౌండ్లను వాడుతుంటే వాటిలో ఎక్కువ హానికరమైనవిగా అల్ఫా టెర్ఫినాల్, బెంజిల్ అసెటేట్, బెంజిల్ ఆల్కహాల్, లిమోనీన్, లినలూల్ అని ఎఫ్ డీఏ అధ్యయనం పేర్కొంది.
డియోడరెంట్ ఎప్పుడు మొదలైంది...
మొదటగా వాణిజ్య డియోడరెంట్ ఉత్పత్తి మమ్ 19వ శతాబ్దం చివర్లో వచ్చింది. ఆధునిక తరహా డియోడరెంట్ ను జూలెస్ మాంటెనర్ 1941 జనవరి 28న తీసుకొచ్చారు. దానికి పేటెంట్ కూడా తీసుకున్నారు. ఈ పేటెంట్ గడువు తీరిన తర్వాత లెక్కుకు మించి డియోడరెంట్ ఉత్పత్తులు మార్కెట్ ను ముంచెత్తాయి.  

సహజ ప్రత్యామ్నాయాలు
  • సుగంధ మొక్కల నుంచి తీసిన ఆయిల్ తో సహజ బాడీ స్ర్ర్పేలను కొన్ని కంపెనీలు మార్కెట్ చేస్తున్నాయి. వాటిని ఉయోగించుకోవడం అన్ని విధాలా మంచిది. నిమ్మగడ్డి, థైమ్, లావెండర్, రోజ్ మెరీ ఆయిల్స్ ను మీకు మీరే స్వయంగా చేతుల మడత భాగాల్లో అప్లయ్ చేసుకోవచ్చు.
  • representative imageకొబ్బరినూనెలో బాక్టీరియాను నివారించే గుణాలున్నాయి. అందుకని స్వల్పంగా రాసుకోవడం వల్ల చాలా వరకు దుర్గంధం ఆగిపోతుంది. కాకపోతే ఎక్కువ రాసుకుంటే మాత్రం అసౌకర్యంగా అనిపించవచ్చు.
  • బేకింగ్ సోడా, కొబ్బరినూనెకు కొంచె కలుపుకుని రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
  • చేతి మడతల భాగంలో అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. ఇవి బాక్టీరియాకు నిలయాలుగా మారతాయి. అందుకే ఎప్పటికప్పుడు షేవ్ చేసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
  • యాపిల్ సిడార్ వెనిగర్ ను కొంచెం రాసుకున్నా ఫలితం కనిపిస్తుంది.
  • నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ దుర్గంధానికి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది. అందుకే కొంచెం నిమ్మరసం రాసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. 
  • ఆల్కహాల్ కు బ్యాక్టీరియా  చనిపోతుంది. కనుక కొంత అప్లయ్ చేసుకోవచ్చు.
  • అలోవెరాలోనూ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల అలోవెరా జెల్ ను అప్లయ్ చేసుకుంటే ఫలితం ఉంటుంది.
  • అలూమినమ్, పారాబీన్, పీహెచ్ తాలేట్స్, ఆల్కహాల్ కంటెంట్ లేని సహజ దుర్గంధ నివారిణులను వాడుకోవచ్చు.


More Articles