డైజస్టివ్ బిస్కట్లు తింటున్నారా?.. జాగ్రత్త మరి!

మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్ బిస్కట్ల (తేలికగా జీర్ణమయ్యే బిస్కట్లు) గురించి వినే ఉంటారు. తింటూ కూడా ఉంటారు. జీర్ణశక్తి సరిగా లేని రోగుల కోసం ఈ బిస్కట్లు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుత 21వ శతాబ్దంలో ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండిగా మారిపోయాయి.

కానీ, వచ్చిన చిక్కంతా ఏంటంటే, ఈ డైజస్టివ్ బిస్కట్లలో ఉన్న చక్కెరలు, కొవ్వు పదార్థాలు, సోడియం, శుద్ధి చేయబడిన పిండిని కూడా మనం తినేస్తున్నాం. అందువల్ల ఇవి ఎంతమాత్రం ఆరోగ్యకరం కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు మూడు ముఖ్య కారణాలను కూడా వారు విశ్లేషించారు. డైజస్టివ్ బిస్కట్లు మన ఆకలిని తీర్చవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నామన్న తృప్తినీ ఇవి మనకు కల్గించవచ్చు. కానీ, వీటిని అత్యధికంగా ప్రాసెస్ చేయడం వల్ల ఇవి మనకు మంచివి కావని వారు చెబుతున్నారు.

మొదటి కారణం... వీటిలో శుద్ధి చేయబడిన పిండి, చక్కెర, కొవ్వు పదార్థాలు, సోడియం ఉంటాయి. వీటిలో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయంటూ సదరు ప్యాకెట్స్ పై రాసి ఉంటుంది. కానీ, అక్కడ రాసిన గ్రీకు పదాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ బిస్కట్లకు బానిసలయ్యేలా వీటిలో రుచిని ఎక్కువగా కల్గించే పదార్థాలను కలిపి ఉన్న విషయం అర్థమవుతుంది.

రెండోది..ఈ బిస్కట్లు వందలాది పరిమాణాల్లో మనకు లభిస్తుంటాయి. అందువల్ల కంపెనీలు వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటాయి. మీరెప్పుడైనా బిస్కట్లు బూజు పట్టి చెడిపోవడం లాంటివి గమనించారా? లేదు కదా..అందుకు కారణం...ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా ప్రాసెస్ చేయడం, ఇందుకు అవసరమైన కొన్ని పదార్థాలను కలపడం చేస్తుంటారు.

ఇక మూడో కారణం... బిస్కట్లలోని అనారోగ్యకర కేలరీలు. సాధారణంగా డైజస్టివ్ బిస్కట్ కనీసం 50 కేలరీలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైనవి కావు. ఇవి నాజూకుతనం కోసం మనం చేసే ప్రయత్నాలను దెబ్బతీయవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో మనకు అర్థంకాకపోవచ్చు కూడా. చక్కెరలు, పిండి, సోడియంలలో ఉండే అనారోగ్యకర కేలరీలు మన శరీరానికి అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


More Articles