ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి

ఎండాకాలం వచ్చేస్తోంది. ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో ఇళ్లలో చల్లదనం కోసం ఏసీయో, కూలరో కొనేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. ఏసీల ధరలు చాలా ఎక్కువగా ఉండడం, అడ్డగోలుగా కరెంటు బిల్లులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో చాలా మంది ఎయిర్ కూలర్లనే కొనుగోలు చేస్తుంటారు. అయితే కూలర్లలో చాలా రకాలున్నాయి. చాలా పరిమాణాల్లో, వేర్వేరు సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయి. కొన్ని కూలర్ల ధరలు ఏకంగా ఏసీల ధరలకు సమీపంలో కూడా ఉన్నాయి. మరి ఇంతకీ కూలర్లలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, ఏ కూలర్ తీసుకుంటే బెటర్, కూలర్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నుంచి పూర్తి స్థాయి చల్లదనం పొందేందుకు ఏం చేయాలి.. వంటి అంశాలను తెలుసుకుందాం..

ఎయిర్ కూలర్లు ఎలా పనిచేస్తాయి?

నీరు గాలిలోని వేడిని సంగ్రహించడం ద్వారా చల్లదనాన్ని అందించడం ఎయిర్ కూలర్లలోని మూల సూత్రం. ఈ కూలర్లలో బయటిగాలి లోపలికి వచ్చేలా కూలింగ్ ప్యాడ్లు ఉంటాయి. వాటిలో నిరంతరం నీరు ప్రవహించేలా.. ఒక చిన్న మోటార్ నీటిని పంప్ చేస్తూ ఉంటుంది. ఇక కూలర్ లోని ఫ్యాన్ తిరిగినప్పుడు బయటిగాలి కూలింగ్ ప్యాడ్ల ద్వారా కూలర్లోకి ప్రవేశించి.. ఫ్యాన్ ద్వారా అవతలివైపునకు వస్తుంది. ఇలా బయటి వేడి గాలి కూలింగ్ ప్యాడ్ల ద్వారా ప్రవేశిస్తున్నప్పుడు.. కూలింగ్ ప్యాడ్ లలో ఉండే నీరు ఆ గాలిలోని వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఇలా నీరు వేడిని తీసేసుకోవడంతో గాలి చల్లబడి.. ఫ్యాన్ ద్వారా తిరిగి బయటికి వస్తుంది. ఈ క్రమంలో గదిలోని గాలి అంతా మెల్లమెల్లగా చల్లబడుతూ.. మొత్తంగా గదిలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.

ఏమేం ఉంటాయి?

ప్రస్తుతం మనకు తక్కువ ధరలో దొరికే సాధారణ కూలర్ల నుంచి.. పలు అదనపు సదుపాయాలతో కూడిన ఖరీదైన కూలర్ల వరకు చాలా రకాలు లభిస్తున్నాయి. సాధారణంగా కూలర్లలో ఒక బాక్స్ వంటి నిర్మాణంలో.. కాస్త ఎక్కువ సామర్థ్యం కలిగిన ఫ్యాన్ లేదా బ్లోయర్, కూలింగ్ ప్యాడ్లు, నీటిని నిల్వచేసుకోగలిగేలా టబ్, నీటిని కూలింగ్ ప్యాడ్లకు పంప్ చేసే మోటార్, బయటికి వచ్చే గాలిని కాస్తంత పక్కలకు, పైకి కిందకి వీచేలా చేయగలిగే ‘లోవర్లు’, లోవర్లను ఆటోమేటిగ్గా తిప్పేందుకు తోడ్పడే చిన్నమోటార్, మొత్తంగా కూలర్ ను నియంత్రించేందుకు బటన్లు, నాబ్ లతో కూడిన కంట్రోల్ ప్యానల్ ఉంటాయి.కొన్ని హై ఎండ్ కూలర్లలో దుర్వాసన రాకుండా ఫిల్టర్లు, హ్యుమిడిటీ కంట్రోలర్లు, డిజిటల్ డిస్ప్లేలు, కొంత సమయం కాగానే ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోయేలా కంట్రోలర్లు, రిమోట్ కంట్రోల్ తో నియంత్రించుకోగల సౌకర్యం వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.

కూలర్లో సాధారణ ఫ్యాన్.. బ్లోయర్.. ఏది బెటర్?

ప్రస్తుతం కూలర్లలో సాధారణ తరహా ఫ్యాన్, బ్లోయర్ తరహా ఫ్యాన్ ఉండే ఎయిర్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటికీ కూడా కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. బ్లోయర్ తరహా కూలర్లే కొంత బెటర్ అని చెప్పవచ్చు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల సాధారణ ఫ్యాన్ తరహా కూలర్లతో ప్రయోజనం ఉంటుంది. ఈ రెండింటితో లాభాలు, ప్రతికూలతలు చూద్దాం..
  • ఫ్యాన్ గాలిని ముందు అన్ని వైపులా వెదజల్లినట్లుగా వదులుతుంది. అయితే గాలి కొద్దిదూరం వరకే వీస్తుంది. పెద్దగా ఉండే హాల్ లు, గదులకు.. కూలర్ పెట్టిన చోట విశాలంగా గాలి రావడానికి ఈ తరహా కూలర్లు బెటర్. అదే బ్లోయర్ అయితే కూలర్ కు సరిగ్గా ఎదురువైపు వేగంగా చాలా దూరం వరకు వెళ్లేలా గాలిని వదులుతుంది. చిన్న గదులకు, నేరుగా గాలి తగలాల్సిన అవసరమున్న చోట బ్లోయర్ తరహా కూలర్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
  • ఫ్యాన్ తరహా కూలర్ల పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. వాటిల్లో చిన్న సైజు కూలర్లు ఉన్నా కూడా వాటి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అదే బ్లోయర్ తరహా కూలర్ల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. గదులు చిన్నగా ఉన్న చోట, తక్కువ స్థలంలో పెట్టడానికి వీలుగా బ్లోయర్ కూలర్లు ఉంటాయి.
  • సాధారణ ఫ్యాన్ ఉన్న ఎయిర్ కూలర్లతో పోలిస్తే.. బ్లోయర్లు ఉన్న కూలర్లు తక్కువగా విద్యుత్ ను ఉపయోగించుకుంటాయి. అదే సమయంలో సమర్థవంతంగా చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి.
  • బ్లోయర్ తరహా కూలర్లు గాలిని వేగంగా విసురుతాయి. బ్లోయర్లు వేగంగా తిరుగుతున్నప్పుడు.. ఫ్యాన్ తరహా కూలర్లతో పోలిస్తే కొంత ఎక్కువ ధ్వని విడుదలవుతుంది.

సాధారణ ఆస్పెన్ (గడ్డి) లేదా హనీకోంబ్ ప్యాడ్ ఏది ఉంటే మంచిది?

సాధారణంగా ఎయిర్ కూలర్లలో గడ్డి తరహాలో కనిపించే ప్యాడ్ లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటినే ఆస్పెన్ లేదా వుడ్ వూల్ ప్యాడ్లుగా పిలుస్తారు. ప్రస్తుతం వాటికన్నా సమర్థవంతంగా పనిచేసే హనీకోంబ్ ప్యాడ్ లు అందుబాటులోకి వచ్చాయి. సెల్యులోజ్ పదార్థంతో తేనెతుట్టె ఆకారంలో తయారుచేయడం వల్ల వీటిని హనీకోంబ్ ప్యాడ్ లుగా పిలుస్తారు. కాస్త ఎక్కువ ధర ఉండే, కాంపాక్ట్ కూలర్లలో హనీకోంబ్ ప్యాడ్ లు ఉంటున్నాయి.
  • సాధారణ గడ్డి ప్యాడ్ లు 75 శాతం సమర్థతతో పనిచేస్తే.. హనీకోంబ్ ప్యాడ్ లు 85 శాతం సమర్థతతో పనిచేస్తాయి. అంటే హనీకోంబ్ ప్యాడ్ లు ఉన్న కూలర్లతో కొంత త్వరగా చల్లదనం సమకూరుతుంది.
  • గడ్డి ప్యాడ్ లను తరచూ మార్చాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా వాటి వల్ల దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంది. అదే హనీకోంబ్ ప్యాడ్ లు కొన్నేళ్ల పాటు మన్నుతాయి. దుర్వాసన వంటిది కూడా తక్కువగా ఉంటుంది.
  • మొత్తంగా గడ్డి ప్యాడ్ లతో పోలిస్తే హనీకోంబ్ ప్యాడ్ లు ఉన్న ఎయిర్ కూలర్లు త్వరగా, ఎక్కువ చల్లదనాన్ని ఇవ్వగలుగతాయి. కానీ వీటి ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి.

ఎంత పెద్ద గదికి ఏ స్థాయి కూలర్ అవసరం?

ఎయిర్ కూలర్ కొనాలని అనుకుంటున్నాం. మరి ఎంత పెద్ద గదికి ఏ స్థాయి కూలర్ అవసరమనేది చూద్దాం. మనకు అవసరమైనదానికన్నా చిన్న కూలర్ కొంటే.. తగినంత చల్లదనం లభించదు. అదే పెద్ద కూలర్ ను కొంటే అనవసరంగా డబ్బు ఖర్చుకావడంతోపాటు ఎక్కువ స్థలం ఆక్రమించడం, విద్యుత్ ఖర్చు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కూలర్లు విడుదల చేసే గాలి పరిమాణాన్ని సీఎఫ్ఎం (క్యూబిక్ ఫీట్ ఫర్ మినిట్)లలో కొలుస్తారు. అంటే ఒక్క నిమిషంలో ఎన్ని ఘనపుటడుగుల గాలిని విడుదల చేస్తుంది అని అర్థం. మరి ఎంత గదికి ఎంత స్థాయి కూలర్ అవసరమనే దానికి చిన్న సూత్రం కూడా ఉంది..
సీఎఫ్ఎం  =  గది పరిమాణం (చదరపు అడుగుల్లో) X గది ఎత్తు (అడుగుల్లో) / 2
ఉదాహరణకు 100 చదరపు అడుగుల వైశాల్యం (10 X 10 అడుగులు), ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే గదిని పరిశీలిస్తే..
సీఎఫ్ఎం = 100  X 8 / 2; అంటే 400 సీఎఫ్ఎం సామర్థ్యమున్న ఎయిర్ కూలర్ కావాలి.
అయితే కొన్ని కంపెనీలు సీఎఫ్ఎంలలో కాకుండా సీఎంహెచ్ (క్యూబిక్ మీటర్స్ ఫర్ అవర్)లలో సామర్థ్యాన్ని పేర్కొంటూ ఉంటాయి. అలాంటి వాటి కోసం సీఎఫ్ఎంను సీఎంహెచ్ గా మార్చుకోవచ్చు. ఇందుకు సీఎఫ్ఎం ను 1.699 తో గుణిస్తే సరిపోతుంది. ఈ లెక్కన 400 సీఎఫ్ఎం అంటే.. సుమారు 680 సీఎంహెచ్ అవుతుంది. గది పరిమాణాన్ని లెక్కించి.. దానికి తగిన సీఎఫ్ఎం లేదా సీఎంహెచ్ సామర్థ్యమున్న ఎయిర్ కూలర్ ను ఎంచుకుంటే సరిపోతుంది.

హ్యుమిడిటీ (గాలిలో నీటి ఆవిరి) శాతంతో ప్రభావం

గాలిలోని వేడిని నీరు గ్రహించి ఆవిరిగా మారడమే ఎయిర్ కూలర్లు పనిచేసే ప్రాథమిక సూత్రం. దీనినే ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు. ఈ ప్రక్రియలో ఎయిర్ కూలర్ లోని నీరు ఆవిరి అవుతూ, గాలిలో కలుస్తుంది. దీంతో మన ఇంట్లోని గాలిలో నీటి ఆవిరి శాతం లేదా తేమ శాతం పెరిగిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే.. మన శరీరంలో నిత్యం చెమట ఉత్పత్తవుతుంది. అది గాలి తగిలి ఆవిరవుతుంటుంది. మరోలా చెప్పాలంటే ఆరిపోతుంది. అదే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే.. మన చర్మంపై ఉత్పత్తయ్యే చెమట ఆరిపోకుండా ఉంటుంది. దానివల్ల ఉక్కపోత, చర్మం జిగట జిగటగా మారి.. ఇబ్బందికరంగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టే.. అక్కడ చెమట తొందరగా ఆరిపోకుండా విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. ఇంట్లో ఎయిర్ కూలర్ల వినియోగంతో దానిలోని నీరు ఆవిరవుతూ.. గాలిలో తేమ శాతం పెరిగిపోతుంది.
  • ఎయిర్ కూలర్ ను వినియోగించినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంటే ఇంట్లో తేమ శాతం పెరిగిపోతుంది. దాంతో చల్లదనం కాదుకదా.. తీవ్రంగా ఉక్కపోత, ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. దీనికి పరిష్కారం మంచి వెంటిలేషన్ ఉండడమే.
  • ఇంట్లోని గాలి బయటికి, బయటిగాలి ఇంట్లోకి వచ్చేలా వెంటిలేషన్ ఉంటే.. ఎయిర్ కూలర్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
  • కొందరు ఎయిర్ కూలర్లను.. కిటికీలోంచి గాలి లోపలికి వచ్చేలా ఇంటి బయట అమర్చుకుంటుంటారు. దానివల్ల బయటిగాలి కూలర్లో చల్లబడి లోపలికి వస్తుంది. దానివల్ల మంచి చల్లదనం వచ్చినా.. వెంటిలేషన్ లేకపోతే ఉక్కపోత తలెత్తుతుంది.
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైఎండ్ ఎయిర్ కూలర్లలో హ్యుమిడిటీ కంట్రోలింగ్ ఆప్షన్లు ఉంటున్నాయి. గాలిలోని తేమ శాతాన్ని తగ్గించేలా వాటిలో ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి కూలర్లు అయితే వెంటిలేషన్ లేకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయినా కూడా వెంటిలేషన్ ఉంటేనే ఉత్తమం. తేమకోసం కాకపోయినా స్వచ్ఛమైన గాలి వీయడం అవసరం.
  • సముద్ర తీర ప్రాంతాలు, తీవ్ర ఉక్కపోత ఉండే చోట్ల ఎయిర్ కూలర్ల కంటే ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) కొనుగోలు చేయడం ఉత్తమం. వాటివల్ల హ్యుమిడిటీ సమస్యలు ఉండవు.

ఐరన్ కూలర్లతో అదనపు ఉపయోగం

సాధారణంగా ఎయిర్ కూలర్లన్నీ ఫైబర్ ప్లాస్టిక్ తోనే తయారవుతుంటాయి. అయితే కొన్ని రకాల అసెంబుల్డ్ ఎయిర్ కూలర్లు ఇనుము, స్టీల్ వంటి వాటితో తయారైనవి దొరుకుతున్నాయి. అలాంటి వాటితో ఒక అదనపు ప్రయోజనం ఉండడం గమనార్హం. ఫైబర్ ప్లాస్టిక్ కూలర్ల కంటే.. ఇనుముతో తయారైన కూలర్లు ఎక్కువ చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి.
  • ఐరన్ కూలర్లలో నీటిని పంప్ చేసే విధానం కొంత భిన్నంగా ఉంటుంది. కూలర్ కింది భాగంలో ట్యాంక్ విడిగా, ఓపెన్ గా ఉంటుంది. కూలర్ పైభాగంలోనూ ట్యాంక్ వంటి నిర్మాణం ఉండి.. అది కూడా ఓపెన్ గా ఉంటుంది. కింద ట్యాంక్ నుంచి పైన ట్యాంక్ కు చేరే నీరు.. కొద్దికొద్దిగా కూలింగ్ ప్యాడ్ల నుంచి కిందికి జాలువారుతుంది. ఇలా ట్యాంకులు, నీరు ఓపెన్ గా ఉండడం వల్ల నీరు ఎక్కువగా చల్లబడి.. చల్లటిగాలిని అందించగలుగుతాయి.
  • పెద్ద పెద్ద హాళ్ల వంటి చోట ఇలాంటి ఐరన్ కూలర్లతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. పెద్ద ప్రదేశాలకు కూడా ఇవి చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. అందువల్లే ఫంక్షన్ హాళ్లు, ఆరుబయట కూలింగ్ అవసరమైన చోట ఇలాంటి కూలర్లను వినియోగిస్తారు.
  • కింద విడిగా ట్యాంక్ ఉండడం, పైన ట్యాంక్ లో నీరు ఉండడం వల్ల ఈ కూలర్లను తరచూ అటూ ఇటూ జరపడం వీలుకాదు. చిన్న పిల్లలు ఉన్న చోట ఈ తరహా కూలర్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ తరహా కూలర్లు నిర్వహణ సరిగా లేకుంటా కొద్దికాలంలోనే తుప్పుపట్టి పాడైపోతాయి.
  • అయితే హాల్ పెద్దగా ఉన్నప్పుడు ఐరన్ కూలర్ ను కిటికీకి బయట ఇంట్లోకి గాలి వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.

ఈ సదుపాయాలు ఉన్నాయో లేదో చూడండి

  • ఆటోమేటిక్ లోవర్ మూమెంట్: కూలర్ కు ముందు భాగంలో ఉండి గాలిని పక్కలకు, కిందికి పైకి మళ్లించడానికి ఉండే వాటినో లోవర్లు అంటారు. ఇవి ఆటోమేటిగ్గా వాటంతట అవే రెండు పక్కలకూ కదులుతూ గాలిని మళ్లించేలా ఉండే ఏర్పాటునే ఆటోమేటిక్ లోవర్ మూమెంట్ అంటారు. ప్రస్తుతమున్న కూలర్లలో చాలా వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇనుముతో తయారు చేయబడిన, అటూ ఇటూ కదిలించడానికి వీల్లేకుండా ఉండే ఎయిర్ కూలర్లలో ఈ లోవర్లు ఉండవు. 
  • రిమోట్ కంట్రోల్: ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండెడ్ కూలర్లలో రిమోట్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటోంది. దూరంగా కూర్చున్నప్పుడు, నిద్రపోయినప్పుడు తరచూ లేచి కూలర్ ను ఆఫ్ చేయడం, లేదా వేగం తగ్గించడం, నీటి సప్లైని ఆపేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎయిర్ కూలర్ కు రిమోట్ కంట్రోల్ ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రిమోట్ సహాయంతో కూలర్ ను ఆన్, ఆఫ్ చేయడమే కాదు.. ఆటోమేటిక్ లోవర్ మూమెంట్ ను, నీటి సప్లైని నియంత్రించవచ్చు. కూలర్ స్పీడ్ ను తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు కూడా.
  • ఆటో ఆఫ్ టైమర్: రాత్రి నిద్రపోయినప్పుడు కూలర్ నడుస్తూనే ఉంటే.. చల్లదనం విపరీతంగా పెరిగిపోతుంటుంది. దాంతో నిద్ర మధ్యలో లేచి కూలర్ ను ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి అవసరం లేకుండా ఏదైనా నిర్ణీత సమయం తర్వాత కూలర్ దానంతట అదే ఆఫ్ అయిపోయేలా చేసేదే ‘ఆటో ఆఫ్ టైమర్’. దీనిలో గంట, రెండు గంటలు.. ఇలా మనకు అవసరమైన సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఆ సమయం కాగానే కూలర్ ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోతుంది. 
  • ఎల్ఈడీ డిజిటల్ డిస్ప్లే: బ్రాండెడ్ కూలర్లలోని హైఎండ్ మోడళ్లలో ఎల్ఈడీ డిజిటల్ డిస్ప్లే అందుబాటులో ఉంటోంది. దీనివల్ల కూలర్ ఫ్యాన్ ఏ స్పీడ్ లో ఉంది, వాటర్ సప్లై ఆన్ లో ఉందా లేదా వంటివి దూరం నుంచే చూసుకోవచ్చు. ఆటో ఆఫ్ టైమర్ పెట్టుకుంటే.. ఎంత సేపట్లో ఆఫ్ అవుతుంది కూడా డిస్ప్లేపై చూసుకోవచ్చు.
  • ఎంప్టీ ట్యాంక్ అలారం: సాధారణంగా ఎయిర్ కూలర్లలో కూలింగ్ ప్యాడ్ లకు నీటిని సరఫరా చేయడానికి చిన్న మోటార్ ఉంటుంది. కూలర్ లో నీరంతా అయిపోయినా ఆ మోటార్ తిరుగుతూనే ఉంటుంది. దాంతో మోటార్ పాడవుతుంది. ఇక నీళ్లు అయిపోయిన విషయం చల్లదనం తగ్గిపోయే వరకు మనం గుర్తించలేం. కొంతసేపు నీటితో నడిచిన కూలర్.. తర్వాత నీళ్లు లేకుండా నడిస్తే కూలింగ్ ప్యాడ్ లు ఆరిపోయి వాటిలోంచి దుర్వాసన వెలువడుతుంది. ఇలాంటి సమస్య లేకుండా ఉండేందుకు ఎయిర్ కూలర్లలో ఎంప్టీ ట్యాంక్ అలారం తోడ్పడుతుంది. ఈ ఆప్షన్ ఉన్న కూలర్లలో నీళ్లు అయిపోగానే... వెంటనే నీటి మోటార్ ఆగిపోతుంది. ఇదే సమయంలో కూలర్లో నీళ్లు అయిపోయినట్లుగా హెచ్చరిస్తూ అలారం మోగుతుంది. దాంతో మనం వెంటనే కూలర్ లో నీళ్లు నింపుకోవడానికి వీలవుతుంది.
  • ఐస్ క్యూబ్స్ ట్రే: ఒక్కోసారి బాగా వేడిగా ఉన్న పరిస్థితుల్లో వేగంగా చల్లదనం కావాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూలర్లో ఐస్ క్యూబ్ లు పెట్టడం ద్వారా వెంటనే చల్లని గాలి వస్తుంది. ప్రస్తుతం ఇలా ఐస్ క్యూబ్ లు పెట్టడం కోసం ప్రత్యేకమైన ట్రేలు ఉండే కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆప్షన్ ఉంటే మరింత చల్లదనం పొందవచ్చు.
  • ఓడర్ (దుర్వాసన రాకుండా) ఫిల్టర్లు: సాధారణంగా ఎయిర్ కూలర్ల కూలింగ్ ప్యాడ్ లు తడిసి ఆరినప్పుడల్లా దుర్వాసన వెలువడుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా కొన్ని రకాల బ్రాండెడ్ కూలర్లలో దుర్వాసన (ఓడర్) ఫిల్టర్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వీటివల్ల ప్రయోజనం ఉన్నా.. కూలర్ లో ఎప్పటికప్పుడు తాజా నీటిని పోయకపోతే.. దుర్వాసన వెలువడుతూనే ఉంటుంది. అందువల్ల కూలర్ నీటిలో కలిపే పరిమళ ద్రవ్యాలను కొనుగోలు చేసి వినియోగించుకోవచ్చు.
  • మస్కిటో, ఇన్ సెక్ట్ నెట్: సాధారణంగా కూలర్లలో నీరు నిల్వ ఉంటుంది కాబట్టి దానిలో దోమలు పెరుగుతాయి. దాంతోపాటు ఇతర కీటకాలూ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కూలర్ లోకి దోమలు, ఇతర కీటకాలు ప్రవేశించకుండా కూలింగ్ ప్యాడ్ కు పైన నెట్ ఏర్పాటు ఉంటుంది. అలాంటి ఏర్పాటు మీరు తీసుకునే ఎయిర్ కూలర్లో ఉందో లేదో చూడాలి.
  • డస్ట్ ఫిల్టర్: ఎయిర్ కూలర్ గాలిని బలంగా పంప్ చేస్తుంది కాబట్టి ఇంట్లో ఉండే దుమ్ము, ధూళి పైకి లేచే అవకాశం ఉంటుంది. అది కూలింగ్ ప్యాడ్ల ద్వారా తిరిగి వీస్తుంది. డస్ట్ ఎలర్జీ ఉన్న వారికి దానివల్ల మరింత ఇబ్బంది ఉంటుంది. దీనిని నివారించేందుకు వీలుగా పలు రకాల కూలర్లలో డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. అంటే కూలింగ్ ప్యాడ్ల వద్ద దుమ్మును గ్రహించేలా సన్నని తెర ఏర్పాటు చేస్తారు.
  • ఇన్వర్టర్ సపోర్ట్: సాధారణంగా ఎయిర్ కూలర్లు ఎక్కువ వోల్టేజీని వినియోగించుకుంటాయి. అందువల్ల ఇన్వర్టర్లపై వినియోగించుకోలేం. కానీ కొన్ని బ్రాండెడ్ కూలర్లు, బ్లోయర్ తరహా కూలర్లు ఇన్వర్టర్ పైనా పనిచేసేలా తక్కువ వోల్టేజీని వినియోగించుకుంటాయి. ఇలాంటి వాటిని కరెంటు సరఫరా లేనప్పుడు కూడా ఇన్వర్టర్లపై వినియోగించుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మంచి చల్లదనం

ఎయిర్ కూలర్లలో నీటిని పోసేసి.. వాడేసుకుంటూ పోతే చాలని భావించొద్దు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎయిర్ కూలర్ల నుంచి ఎక్కువ చల్లదనాన్ని పొందవచ్చు. అదే సమయంలో కూలర్ ఎక్కువ కాలం మన్నేలా చూసుకోవచ్చు.
  • ఎయిర్ కూలర్లను రెగ్యులర్ గా వినియోగిస్తున్నప్పుడు.. కనీసం ఐదారు రోజులకోసారి ట్యాంక్ లోని నీటిని పూర్తిగా తీసేసి, డిటర్జెంట్ తో కడిగి శుభ్రం చేసుకోవాలి. తద్వారా నీటిలో ప్రమాదకర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండకుండా చూసుకోవచ్చు.
  • ఎప్పటికప్పుడు తాజా నీటిని నింపుతుండడం వల్ల కూలర్ల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అవసరమైతే కూలర్ సెంట్లు వినియోగించుకోవచ్చు.
  • కూలింగ్ ప్యాడ్ లు పూర్తిగా తడుస్తున్నాయా, లేదా చూసుకోవాలి. కూలింగ్ ప్యాడ్లు పూర్తిగా తడవకపోయినా, వాటి మధ్య ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్నా గాలి చల్లగా రాదు.
  • కూలింగ్ ప్యాడ్లకు నీటిని సరఫరా చేసే మోటార్ సరిగా పనిచేస్తుందో లేదో పరిశీలించాలి. పైపుల్లో ఏవైనా అడ్డుగా ఉంటే తొలగించాలి. కూలింగ్ ప్యాడ్లకుపైన నీటిని సన్నని ధారలుగా జారవిడిచే భాగం సరిగా ఉందో లేదో చూడాలి. దానిలో ఉండే రంధ్రాల్లో చెత్త వంటిది చేరితే తొలగించాలి. మొత్తంగా కూలింగ్ ప్యాడ్లకు నీరు సరిగా సరఫరా అయి, అవి మొత్తంగా తడుస్తూ ఉండేలా చూడాలి.
  • కూలర్ కు ముందు వైపు ఉండే లోవర్లు సరిగా ఉన్నాయో లేదో చూడాలి. అవి అడ్డంగా మూసి వేసినట్లుగా ఉంటే గాలి సరిగా రాదు.
  • కూలర్ ఆన్ లో ఉన్న సమయంలో నీరు నింపడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల నీరు ఫ్యాన్ మోటార్, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలపై చిమ్మి.. పాడైపోయే అవకాశం ఉంటుంది.
  • ఎయిర్ కూలర్ లో నీళ్లు తగ్గిపోతే వెంటనే వాటర్ మోటార్ ను ఆఫ్ చేయాలి. లేకుంటే మోటార్ పాడైపోతుంది.
  • సముద్ర తీర ప్రాంతాల్లో, ఉక్కపోత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారు తప్పనిసరిగా హ్యుమిడిటీ కంట్రోల్ ఉన్న కూలర్ నే తీసుకోవాలి. లేదా ఏసీ తీసుకోవడం బెటర్.


More Articles