ఎల్ఈడీ-ఓఎల్ఈడీ.. ఫుల్ హెచ్ డీ- 4కె.. ఇంటర్నెట్ టీవీ-స్మార్ట్ టీవీ.. ఏమిటీ తేడాలు.. ఏది కొంటే బెటర్?

ఈ రోజుల్లో టెలివిజన్ (టీవీ) లేని ఇల్లు ఉండదు. పాత బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పుడు అత్యాధునిక ఓఎల్ఈడీ, ప్లాస్మా టీవీల వరకు వచ్చాయి. ముఖ్యంగా ఎల్ఈడీ టీవీలు తక్కువ ధరలో, అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పరిమాణం, అందులోని సదుపాయాలను బట్టి.. ఏడెనిమిది వేల రూపాయల నుంచి రెండు మూడు లక్షల రూపాయల దాకా ఈ టీవీలు లభిస్తున్నాయి. ఇక వీటిలో సాధారణ టీవీలకు తోడు స్మార్ట్ టీవీలు, ఫుల్ స్మార్ట్ టీవీలు అని వేర్వేరు రకాలు అందుబాటులో ఉంటున్నాయి. 21 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు.. హెచ్ డీ రెడీ నుంచి 8 కె వరకు వివిధ రిజల్యూషన్లలో ఎల్ఈడీ టీవీలు లభిస్తున్నాయి. అయితే మార్కెట్ లో ఎల్ఈడీ టీవీలు విక్రయించే కంపెనీలు.. వివిధ పేర్లతో, వివిధ ధరలతో వినియోగదారుడికి గాలం వేస్తున్నాయి. మరి మన అవసరానికి తగినట్లుగా ఎలాంటి ఎల్ఈడీ టీవీని తీసుకోవాలి, ఏయే సౌకర్యాలు ఉంటే బెటర్, ఒకే తరహా టీవీలకు వేర్వేరు ధరలు ఎందుకుంటాయి.. వంటి అంశాలను వివరంగా తెలుసుకుందాం..

ఎల్ఈడీల్లో ఎన్ని రకాలు..

ఎల్ఈడీ అంటే ఏమిటి?

 ఇటీవలి కాలం వరకు వినియోగించిన ఎల్ సీడీ (లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే) టెక్నాలజీనే మరికొంత ఆధునికీకరించి అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఇది. ఒక రకంగా చెప్పాలంటే దీనిని ఎల్ఈడీ బ్యాక్ లిట్ ఎల్ సీడీగా పిలుస్తుంటారు. సాధారణంగా ఎల్ సీడీ డిస్ప్లేలలో కాంతిని ఉత్పత్తి చేయడానికి ఫ్లోరోసెంట్ లైట్లను వినియోగిస్తారు. ఇవి అన్ని రంగులను చూపగలిగినా పెద్దగా ప్రకాశవంతంగా ఉండవు. విద్యుత్ వినియోగం ఎక్కువ.

దీనికి పరిష్కారంగా ఎల్ సీడీ డిస్ప్లేలలో కాంతిని ఉత్పత్తి చేయడానికి ఎల్ఈడీ బల్బులను వినియోగించారు. మిగతా డిస్ప్లే అంతా కూడా పాత టెక్నాలజీయే. అందువల్లే ఈ టెక్నాలజీని ఎల్ఈడీ బ్యాక్ లిట్ ఎల్ సీడీ అంటారు. ఎల్ఈడీలు ప్రకాశవంతంగా వెలుగును వెదజల్లడంతోపాటు రంగులను కూడా బాగా చూపగలవు. విద్యుత్ వినియోగం కూడా తక్కువ. ఇక ఈ టీవీల డిస్ప్లే గట్టిగా ఉండి.. చదును (ఫ్లాట్)గా ఉంటుంది. వీటి ధర కూడా అందుబాటులో ఉంటుంది.  ఎక్కువ కాలం మన్నుతాయి.

ఓఎల్ఈడీ అంటే... 

ఈ డిస్ప్లేల ప్యానల్ ఆర్గానిక్ (కార్బన్ ఆధారిత) ఎల్ఈడీలతో తయారు చేస్తారు. విద్యుత్ ను సరఫరా చేసినప్పుడు ఈ ఆర్గానిక్ ఎల్ఈడీలు ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులను వెదజల్లుతాయి. వీటికి ఎల్ సీడీకి సంబంధించిన ప్యానల్ కాకుండా నేరుగా లక్షల కొద్దీ ఓఎల్ఈడీలను పక్కపక్కన అమర్చుతారు. ఈ డిస్ప్లేలు ఎల్ఈడీల కంటే చాలా మెరుగైన చిత్ర నాణ్యతను, ప్రకాశవంతమైన వెలుగును ఇవ్వగలవు. విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. అయితే వీటి జీవితకాలం సాధారణ ఎల్ఈడీలతో పోలిస్తే కొంత తక్కువగా ఉండడంతోపాటు ధర చాలా ఎక్కువ కావడం వీటికి ఉన్న ప్రతికూలతలు.
  • ఓఎల్ఈడీ టీవీలలో వేగవంతమైన రీఫ్రెష్ రేటు ఉంటుంది. అంటే చాలా వేగంగా మారిపోయే స్పోర్ట్స్, గ్రాఫిక్స్ వంటి దృశ్యాలను కూడా వీటిలో చాలా స్పష్టంగా చూసేందుకు వీలుంటుంది.
  • ఇక వీటిలో వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంటుంది. అంటే డిస్ప్లేను ఏ వైపు నుంచి చూసినా కూడా దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది.
  • ఓఎల్ఈడీ డిస్ప్లేలు చాలా సన్నగా, వంచడానికి వీలుగా ఉంటాయి. అందువల్ల కర్వ్ డ్ టీవీలు, ఇతర డిస్ప్లేలకు వీలుగా ఉంటాయి. వీటిల్లో అత్యాధునికమైన రకాల డిస్ప్లేలను చుట్టచుట్టడానికి కూడా వీలుగా తయారు చేస్తున్నారు.

క్యూ ఎల్ఈడీ టీవీలు

ఇవి కూడా ఎల్ఈడీ బ్యాక్ లిట్ ఎల్ఈడీ డిస్ప్లేల రకానికి చెందినవే. ప్లాస్మా టీవీలు, ఓఎల్ఈడీ టీవీలతో సమానంగా దృశ్య నాణ్యత, ప్రకాశంతమైన డిస్ప్లేలు వీటిలో ఉంటాయి. సాధారణ ఎల్ఈడీ టీవీలు, ప్లాస్మా టీవీల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటాయి. డిస్ప్లే కూడా పలుచగా ఉంటుంది.  వీటి ధర సాధారణ ఎల్ఈడీల కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.

ఓఎల్ఈడీ-ఎల్ఈడీ టీవీల్లో ఏది బెటర్?

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎల్ఈడీ టీవీల్లో చాలా వరకు సాధారణ ఎల్ఈడీ టెక్నాలజీతో కూడి ఉన్నవే. కొన్ని కంపెనీలు మాత్రం ఓఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన టీవీలను విక్రయిస్తున్నాయి. అయితే కేవలం 55 అంగుళాలు, ఆపై పరిమాణమున్న టీవీల్లో మాత్రమే ఈ ఓఎల్ఈడీ డిస్ప్లేలను అమర్చుతున్నారు.
  • నాణ్యత పరంగా చూస్తే ఎల్ఈడీల కంటే ఓఎల్ఈడీ టీవీలు కొంటేనే బెటర్. అయితే ఓఎల్ఈడీల జీవితకాలం కొంత తక్కువగా ఉండడం దీనికి ప్రతికూలం
  • సైజు పరంగా చూసినా ఓఎల్ఈడీ డిస్ప్లేలు పెద్ద టీవీల్లోనే ఉంటుండడం వల్ల అధికంగా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది.

టీవీల పరిమాణాన్ని (సైజు)ను ఎలా లెక్కిస్తారో తెలుసా?

సాధారంగా 32 అంగుళాలు, 40 అంగుళాలు.. ఇలా టీవీల సైజును చెబుతుంటారు. మరి ఈ సైజును ఎలా లెక్కిస్తారో తెలుసా.. టీవీల ఎత్తునో, వెడల్పునో ఈ పరిణామం సూచించదు. టీవీల డిస్ప్లేను ఐ మూలగా (డయాగ్నల్)గా కొలిస్తే వచ్చే పరిమాణమే ఆ టీవీ సైజుగా లెక్కిస్తారు. 32 అంగుళాల టీవీల ఎత్తు, వెడల్పులలో ఏదీ కూడా వాస్తవంగా 32 అంగుళాలు ఉండదు.
  • ఐమూల (డయాగ్నల్)గా అంటే కొందరికి అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకు మీ టీవీలో ఎడమవైపు కింది మూల నుంచి కుడి వైపు పై మూల వరకు కొలిస్తే.. వచ్చే కొలతే మీ టీవీ పరిమాణంగా లెక్కించొచ్చు.

ఏ గదికి ఎంత సైజున్న టీవీ బెటర్

 పెద్ద పెద్ద టీవీలు కూడా ఇప్పుడు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అయితే మనం టీవీని పెట్టుకునే గది పరిమాణాన్ని బట్టి, మనం కూర్చుని చూసే దూరాన్ని బట్టి ఏ సైజు టీవీని తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చిన్న గదిలో పెద్ద పరిమాణమున్న టీవీని పెట్టుకోవడం వల్ల.. దృశ్యం పరిమాణం పెద్దగా కనబడడం, అందులోను తక్కువ రిజల్యూషన్ ఉన్న టీవీ అయితే దృశ్యం చుక్కలు చుక్కలుగా కనబడడం వంటి సమస్యలు ఉంటాయి. అంతేకాదు ఇలా చూడడం వల్ల కంటి చూపు కూడా దెబ్బతింటుంది.
  • అదే గది పరిమాణం పెద్దగా ఉండి, దూరంగా కూర్చుని చూసే చోట చిన్న టీవీని పెట్టుకోవడం వల్ల దృశ్యాలు సరిగా కనబడవు. టీవీ చూసిన అనుభూతి కూడా పూర్తిగా ఉండదు. అందువల్ల తగిన గది, తగిన దూరానికి సరిపడే పరిమాణమున్న టీవీని ఎంచుకోవాలి.
  • ముఖ్యంగా మనం కూర్చుని చూసే సగటు దూరం ఆధారంగా టీవీ సైజును ఎంచుకోవచ్చు. ఇందుకు ఒక సూత్రం ఉంది. ఏ టీవీ అయినా దాని పరిమాణానికి కనీసం రెండు నుంచి మూడు రెట్ల దూరంలో ఉండి చూడాల్సి ఉంటుంది.
  • ఉదాహరణకు 32 అంగుళాల టీవీని కనీసం 60 అంగుళాల నుంచి 90 అంగుళాల దూరం నుంచే చూడాలి. అంటే కనీసం ఐదు నుంచి ఎనిమిది అడుగుల దూరం ఉండాలి. ఇదే 40 అంగుళాల టీవీ అయితే కనీసం ఎనిమిది నుంచి పది అడుగుల దూరం ఉండాలి.

ఎన్ని అడుగుల దూరం నుంచి చూడాలి..?

టీవీ సైజు    కనీస దూరం
28           3.5
30           3.75
32           4.0
36           4.5
40           5.0
42           5.25
46           5.75
48           6.0
50           6.25
52           6.5
54           6.75
56           7.0
58           7.25
60           7.5
65           8.0
(అయితే దూరం లెక్కలు కేవలం అంచనాల ఆధారంగా వేసినవి. ఈ నిబంధనలేవీ కచ్చితం కాదు. రిజల్యూషన్ ఎక్కువగా ఉంటే కాస్త దగ్గర నుంచి కూడా చూడవచ్చు. అదే రిజల్యూషన్ తక్కువగా ఉంటే దూరం నుంచి చూడాల్సి ఉంటుంది. గదిలో ఉండే వెలుతురు వంటి అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి.)

మరి డిస్ప్లే రిజల్యూషన్లు ఏమిటి?

హెచ్ డీ రెడీ, హెచ్ డీ, ఫుల్ హెచ్ డీ, 4కె వంటి రిజల్యూషన్లతో టీవీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా 8కె టీవీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రిజల్యూషన్ పెరిగిన కొద్దీ టీవీల్లో దృశ్య నాణ్యత, వాటి ధర కూడా పెరుగుతూ పోతుంది. సాధారణంగా డిస్ప్లేపై ఏ దృశ్యమైనా చుక్కలు, చుక్కలుగా చూపబడుతుంది. అవన్నీ కలిసే మనకు దృశ్యం రూపం కనిపిస్తుంది. ఇలా చూపబడే చుక్కలనే రిజల్యూషన్ అని చెప్పవచ్చు. ఈ చుక్కలు ఎంత దగ్గరగా, ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రిజల్యూషన్ ఉన్నట్టు. ఎంత ఎక్కువ రిజల్యూషన్ ఉంటే.. దృశ్య నాణ్యత అంత ఎక్కువగా ఉంటుంది. మన బడ్జెట్ ను, అవసరాన్ని, టీవీని పెట్టుకునే గది పరిమాణాన్ని బట్టి ఏ రిజల్యూషన్ ఉన్న టీవీని ఎంచుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. అసలు రిజల్యూషన్ల సంగతేమిటో చూద్దాం..

హెచ్ డీ (High Defination) టీవీ

నిలువుగా 720 పిక్సెళ్లు, అడ్డంగా 1,280 పిక్సెళ్లు ఉంటే హెచ్ డీ రిజల్యూషన్ అంటారు. దీనినే 720p గా కూడా వ్యవహరిస్తారు. 32 అంగుళాలు లేదా అంతకన్నా తక్కువ పరిమాణమున్న టీవీల్లో ఈ తరహా రిజల్యూషన్ ఉంటుంది. తక్కువ ధరలో విక్రయించే చిన్న టీవీలను హెచ్ డీ రిజల్యూషన్ లో తయారు చేస్తారు. వీటి దృశ్య నాణ్యత సాధారణంగా ఉంటుంది. అయితే 21 అంగుళాల టీవీల్లో అయితే ఈ స్థాయి రిజల్యూషన్ సరిపోతుంది.

ఫుల్ హెచ్ డీ (Full HD) టీవీ

నిలువుగా 1,080 పిక్సెళ్లు, అడ్డంగా 1,920 పిక్సెళ్లు ఉంటే ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ అంటారు. దీనినే 1,080pగా కూడా వ్యవహరిస్తారు. హెచ్ డీ ఫార్మాట్ కు రెండింతలు అన్న మాట. 32 అంగుళాలు లేదా ఆపై టీవీల్లో ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ అందజేస్తారు. సాధారణ హెచ్ డీతో పోలిస్తే.. ఫుల్ హెచ్ డీలో దృశ్య నాణ్యత బాగుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టీవీల్లో ఎక్కువ శాతం ఫుల్ హెచ్ డీ టీవీలే కూడా.

క్వాడ్ హెచ్ డీ (Quad HD - QHD) టీవీలు

నిలువుగా 1,440 పిక్సెళ్లు, అడ్డంగా 2,560 పిక్సెళ్ల రిజల్యూషన్ ను క్వాడ్ హెచ్ డీగా పేర్కొంటారు. ఇది సాధారణ సాధారణ హెచ్ డీకి నాలుగంతలు, ఫుల్ హెచ్ డీకి రెండింతలు రిజల్యూషన్ గా చెప్పవచ్చు. వీటినే 2కె రిజల్యూషన్ గా కూడా పేర్కొంటారు. అయితే ఈ రిజల్యూషన్ లో కొన్ని కంపెనీలు మాత్రమే టీవీలు తయారు చేస్తున్నాయి. ఎందుకంటే ఫుల్ హెచ్ డీ తర్వాత.. చాలా పెద్ద డిస్ప్లేతో టీవీలు తయారు చేస్తుండడంతో మరింత రిజల్యూషన్ అందేలా చేస్తున్నారు.

అల్ట్రా హెచ్ డీ (UHD) లేదా  4కె (4K) ఎల్ఈడీ టీవీలు..

 నిలువుగా 2,160 పిక్సెళ్లు, అడ్డంగా 4,096 పిక్సెళ్లు ఉంటే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ గా చెప్పవచ్చు. దీనినే 4కె గా.. 2,160pగా కూడా పేర్కొంటారు. ఇది సాధారణ హెచ్ డీకి ఎనిమిది రెట్లు, ఫుల్ హెచ్ డీకి నాలుగు రెట్లు ఎక్కువ రిజల్యూషన్. 40 అంగుళాలు లేదా ఆపై పరిమాణాల్లోని టీవీల్లో 4కె రిజల్యూషన్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువగా అందుబాటులో ఉన్న టీవీల్లో మంచి దృశ్య నాణ్యతను ఇచ్చేవి ఇవే.

8కె (8K) టీవీలు..

నిలువుగా 4,320 పిక్సెళ్లు, అడ్డంగా 7,680 పిక్సెళ్లు ఉంటే 8కె రిజల్యూషన్ గా చెప్పవచ్చు. ఇది ఫుల్ హెచ్ డీకి ఏకంగా ఎనిమిది రెట్లు అత్యధిక రిజల్యూషన్. ప్రస్తుతం కొన్ని ప్రముఖ కంపెనీలు కేవలం మాత్రమే ఈ రిజల్యూషన్ తో తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిల్లో ఇదే అత్యధిక రిజల్యూషన్. అయితే ఈ టీవీల ఖరీదు చాలా ఎక్కువ. కనీసం 50 అంగుళాలపైన పరిమాణమున్న టీవీల్లోనే 8కె రిజల్యూషన్ వస్తుంది.

ఎంత పెద్ద టీవీ అయినా అదే రిజల్యూషన్

ఏదైనా రిజల్యూషన్ ను పేర్కొన్నప్పుడు ఎంత పెద్ద టీవీ అయినా.. అదే రిజల్యూషన్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు 32 అంగుళాల ఫుల్ హెచ్ డీ టీవీ, 40 అంగుళాల ఫుల్ హెచ్ డీ టీవీ అంటే... రెండింటిలోనూ రిజల్యూషన్ ఒకటే. కానీ దృశ్య నాణ్యత 32 అంగుళాల టీవీలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఈ తేడా ఎందుకో తెలుసుకుందాం.
  • ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ అంటే నిలువుగా 1,080 పిక్సెళ్లు, అడ్డుగా 1,920 పిక్సెళ్లు ఉంటాయి. 32 అంగుళాల టీవీ అయినా, 40 అంగుళాల టీవీ అయినా ఇదే సంఖ్యలో పిక్సెళ్లు ఉంటాయి. అంటే 32 అంగుళాల టీవీలో స్థలం తక్కువగా ఉండడం వల్ల పిక్సెళ్లన్నీ దగ్గర దగ్గరగా అమర్చబడి ఉంటాయి. అదే 40 అంగుళాల టీవీలో స్థలం ఎక్కువగా ఉండడం వల్ల పిక్సెళ్లు కొంత దూరం దూరంగా ఉంటాయి. పిక్సెళ్లు ఎంత దగ్గర దగ్గరగా ఉంటే దృశ్య నాణ్యత అంత బాగుంటుందని ముందుగానే చెప్పుకొన్నాం.
  • ఈ లెక్కన ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ ఉన్న టీవీల్లో 40 అంగుళాల టీవీ కంటే..  32 అంగుళాల టీవీలో దృశ్య నాణ్యత బాగుంటుంది. అదే 32 అంగుళాల కంటే చిన్న ఫుల్ హెచ్ డీ టీవీల్లో దృశ్య నాణ్యత ఇంకా బాగుంటుంది. 
  • అయితే టీవీని చూసే దూరాన్ని బట్టి కూడా దృశ్య నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రిజల్యూషన్ ఉన్న టీవీలనైనా దగ్గరి నుంచి చూస్తే చుక్కలుగా కనిపిస్తుంది. అదే తక్కువ రిజల్యూషన్ ఉన్న టీవీలైనా సరే దూరం నుంచి చూస్తే దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది.
  • తక్కువ దూరం నుంచి చూడడం, చిన్న గది అయిన సందర్భాల్లో వీలైనంత ఎక్కువ రిజల్యూషన్ ఉన్న టీవీని తీసుకుంటే మేలు. అప్పుడు పెద్ద టీవీ తీసుకున్నా చుక్కలుగా కనిపించదు.
  • ఎక్కువ దూరం నుంచి చూడడం, పెద్ద హాలు వంటివి అయితే తక్కువ రిజల్యూషన్ ఉన్నాసరే.. పెద్ద టీవీని తీసుకోవడం బెటర్.

సాధారణ టీవీ, ఇంటర్నెట్ టీవీ, ఫుల్ స్మార్ట్ టీవీ.. తేడాలేమిటి?

మార్కెట్లో ఎన్నో కంపెనీల టీవీలు లభిస్తాయి. ఒక్కో కంపెనీ ఒక్కో పేరుతో టీవీలను విక్రయిస్తుంటుంది. టీవీల్లో సదుపాయాలను బట్టి వాటి ధరలు ఆధారపడి ఉంటాయి. అయితే ప్రధానంగా సాధారణ ఎల్ఈడీ టీవీలు, స్మార్ట్ టీవీలుగా చెబుతుంటారు.

సాధారణ ఎల్ఈడీ టీవీలు

ఇవి బేసిక్ సదుపాయాలు ఉండే ఎల్ఈడీ టీవీలు. ఇవి అందరికీ తెలిసినవే. కేవలం కేబుల్ లేదా డీటీహెచ్ కనెక్షన్ ద్వారా వివిధ చానళ్లను చూసుకోవచ్చు. అయితే పెన్ డ్రైవ్, హార్డ్ డ్రైవ్, మెమరీ కార్డులను అనుసంధానించుకునేందుకు యూఎస్ బీ పోర్టులు ఉంటాయి. తద్వారా వాటిల్లోని ఆడియో, వీడియోలను టీవీలో నేరుగా ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంటర్నెట్, వైఫై వంటి సదుపాయాలేమీ వీటిలో ఉండవు. కానీ క్రోమ్ క్యాస్ట్, అమెజాన్ ఫైర్ స్టిక్ వంటి పరికరాల ద్వారా సాధారణ ఎల్ఈడీ టీవీల్లోనూ ‘స్మార్ట్’ టీవీల్లో ఉండే సదుపాయాలను పొందవచ్చు. వీటిని విడిగా కొనుగోలు చేసుకుని, తగిన సూచనల మేరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్ టీవీలు లేదా సాధారణ స్మార్ట్ టీవీలు

చాలా మంది స్మార్ట్ టీవీ అనగానే పూర్తి సౌకర్యాలు ఉంటాయని భావిస్తుంటారు. కానీ స్మార్ట్ టీవీల్లో కొన్ని ప్రాథమిక సదుపాయాలు మాత్రమే ఉన్న సెమీ స్మార్ట్ టీవీలను ఇంటర్నెట్ టీవీలుగా పిలుచుకోవచ్చు.
  • ఇంటర్నెట్ టీవీల్లో పేరుకు తగినట్లు ఇంటర్నెట్ వినియోగానికి వీలుగా ఉంటాయి. వీటిల్లో వైఫై, బ్లూటూత్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇన్ బిల్ట్ గా ఇంటర్నెట్ బ్రౌజర్, యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వంటి కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ అయి వస్తాయి.
  • ఇలా ముందుగా లోడ్ చేసిన యాప్స్ ను వినియోగించుకోవడం మినహా అదనంగా యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడానికి గానీ.. పూర్తి స్థాయి స్మార్ట్ సౌకర్యాలను పొందడానికి గానీ వీలుండదు.
  • మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను నేరుగా టీవీపై పొందగలిగేలా స్క్రీన్ మిర్రరింగ్, మీరా కాస్ట్ సదుపాయాలు కూడా ఉంటాయి. దీని ద్వారా ఫోన్ లోని వీడియోలు, ఫొటోలు, ఇతర డేటాను నేరుగా టీవీ తెరపై వీక్షించేందుకు వీలవుతుంది.

ఫుల్ స్మార్ట్ టీవీలు

 వీటిని పూర్తిస్థాయి స్మార్ట్ టీవీలుగా చెప్పవచ్చు. చాలా వరకు ఈ టీవీలు గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తాయి. వీటిల్లో బ్లూటూత్, వైఫై వంటి సదుపాయాలు ఉండడంతోపాటు స్మార్ట్ ఫోన్ తరహాలో అన్ని రకాల యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. - అంటే వాట్సప్, ఫేస్ బుక్ వంటివీ స్మార్ట్ టీవీల్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి షాపింగ్ సైట్ల యాప్స్ వేసుకుని షాపింగ్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్, జియో సినిమా, జియో టీవీ వంటివి ఇన్ స్టాల్ చేసుకుని సినిమాలు, వీడియోలు, చానళ్లు కూడా వీక్షించవచ్చు. అయితే దేనికైనా ఇంటర్నెట్ కనెక్షన్, డేటా అందుబాటులో ఉండాలి.
  • కొన్ని రకాల స్మార్ట్ టీవీలను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయడానికి వీలు ఉంటుంది. 
  • మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను నేరుగా టీవీపై చూడగలిగేలా స్క్రీన్ మిర్రరింగ్, మీరా కాస్ట్ సదుపాయాలు కూడా ఉంటాయి.


More Articles