ఇలా ప్లాన్ చేసుకుంటే.. మీ లైఫ్ సక్సెస్ ఫుల్...!

విద్య పూర్తి చేసుకుని జీవన పోరాటం మొదలు పెట్టిన తర్వాత... ఎంత కాలం, ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. సంపాదన మొదలై, ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, వారి విద్య, వివాహాలతో తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవారు వృద్ధాప్యంలోకి చేరుకుంటారు. అప్పటి వరకు తన ప్రయాణం సంతృప్తికరంగా అనిపిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? కానీ ఆ సంతృప్తి అన్నది దానంతట అది రాదు. చేసే పని, ప్రణాళికల ప్రకారం నడుచుకోవడం వల్లే సాధ్యమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ పాటించతగిన సులభమైన ఆర్థిక ప్రణాళిక గురించి తెలుసుకుందాం.

తమ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని, రిటైర్మెంట్ జీవితం సాఫీగా సాగిపోవాలని, సొంతిల్లు కట్టుకోవాలని ఇలా ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆకాంక్షలు ఉంటాయి. అందుకు తగినంత సంపాదన, దాన్ని ఇన్వెస్ట్ చేయడం అన్నవి చాలా అవసరం. అసలు వస్తున్న వేతనంలో ఎంత పొదుపు చేయాలి? ఎంత మదుపు (పెట్టుబడి) చేయాలి? అన్న సందేహం చాలా మందిలో ఎదురవుతుంటుంది. సాధారణంగా నెలనెలా చేతికి అందుకుంటున్న వేతనంలో కనీసం 30 శాతం అయినా పొదుపు చేసి మదుపు వైపు మళ్లించాలన్నది ఆర్థిక నిపుణులు చెప్పే మాట. అంతకంటే ఎక్కువే చేయగలిగితే ఇంకా మంచిది. ఈ మొత్తాన్ని యుక్తవయసులో ఉన్న వారు అయితే డైవర్సిఫయిడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. పూర్తి అవగాహన, నాలెడ్జీ ఉంటే తప్ప నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేయరాదు.

ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్) అన్నది వేతన జీవులకు ఉండే సదుపాయం. పనిచేస్తున్న సంస్థ ఉద్యోగి తరఫున తన వాటాగా కొంత, ఉద్యోగి వాటా కొంత మొత్తాన్ని అతని వేతనం నుంచి మినహాయించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కు జమ చేస్తుంది. వార్షికంగా సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుందని తెలుసు కదా. అందుకని ఈపీఎఫ్ మొత్తాన్ని మినహాయించి వీలైనంత పన్ను ఆదాకు వీలు కల్పించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్లలో మదుపు చేయాలి.

బోనస్ అందుకుంటే...
వార్షికంగా బోనస్ అందుకుంటుంటే అందులో సగ భాగాన్ని బ్యాంకులో ఐదేళ్లకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయండి. అత్యవసర నిధి సమకూర్చుకుని ఉంటే ఫర్వాలేదు. లేకుంటే బోనస్ గా వచ్చిన మొత్తాన్ని అత్యవసర నిధికి మళ్లించుకోండి. అప్పటికే అత్యవసర నిధి సమకూర్చుకుని ఉంటే బోనస్ ను రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని రుణాలుంటే తీర్చివేసేందుకు వినియోగించుకోవాలి. మిగిలిన మొత్తాన్ని పర్యటనలు, వినోదం కోసం ఖర్చు పెట్టుకోవచ్చు.

అత్యవసర నిధి
అనుకోకుండా ఉద్యోగం కోల్పోతే కుటుంబం గడిచేందుకు, పెట్టుబడులు ఆగకుండా కొనసాగేందుకు, రుణ వాయిదాలు చెల్లించేందుకు వీలుగా మూడు నుంచి ఆరు నెలల వేతనానికి సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. దీన్ని బ్యాంకు ఎఫ్ డీ రూపంలో ఉంచుకోవడం మంచిది. లేదంటే లిక్విడ్ ఫండ్లలోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఇన్సూరెన్స్...
మీ ఆదాయంపై ఆధారపడిన వారుంటే, మీకు 65 ఏళ్ల వయసు వరకు రక్షణ కల్పించేలా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని వెంటనే తీసుకోవాలి. కనీసం మీ వార్షిక వేతనానికి పది రెట్లు, గరిష్టంగా 20 రెట్ల మొత్తానికి తీసుకోవడం నయం. ఏడాదికి రూ.3లక్షల వేతనం అందుకునేవారు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీపై ఆధారపడిన వారు ఎవరూ లేకుంటే జీవిత బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఆరోగ్య బీమా తప్పనిసరి
ఉద్యోగం చేస్తున్న సంస్థ మీకు వైద్య బీమా సదుపాయాన్ని కల్పించినా సరే విడిగా కుటుంబ సభ్యులందరికీ కవరేజీతో కూడిన పాలసీని తీసుకోండి. అలాగే, వాహనం ఉంటే దానికీ బీమా తప్పనిసరి. పైగా గడువుకు ముందే బీమా పాలసీల ప్రీమియం చెల్లించి పునరుద్ధరించుకోవడం మర్చిపోవద్దు.

కనీస నగదు నిల్వలు అవసరం లేని ఓ బ్యాంకు ఖాతాను ప్రత్యేకంగా తెరవండి. అలాగే ఓ క్రెడిట్ కార్డు కూడా తీసుకోండి. విద్యుత్తు, ఫోన్ బిల్లు చెల్లింపులకు క్రెడిట్ కార్డు నుంచి ఆటోమేటిక్ గా నగదు వెళ్లిపోయేలా సెట్ చేసుకోండి. ఏ చెల్లింపులైనా క్రెడిట్ కార్డు నుంచి వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులకు బ్యాంకు ఖాతా నుంచి నెలనెలా ఆటో డెబిట్ సదుపాయాన్ని నమోదు చేసుకోవాలి.

వినోదం - ఆరోగ్యం - దాతృత్వం
సంపాదిస్తున్న మొత్తంలో ఎంతో కొంత... వీలయితే కనీసం ఓ ఐదు శాతం సేవా కార్యక్రమాలకు కేటాయించడం వల్ల సంతృప్తిని సొంతం చేసుకోవచ్చు. మనిషన్నవాడికి ఆనందం కూడా అవసరం కనుక సంతోషం కోసం వినోద కార్యక్రమాలకు పరిమితిలో కేటాయింపులు చేసుకోవచ్చు. ఇక ఆధ్యాత్మికం లేదంటే యోగా, లేదంటే మెడిటేషన్.. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్నిచ్చేవే!

రుణంపై ఇల్లు
సంపాదిస్తున్న వయసులోనే సొంతింటిని సమకూర్చుకోవడం నూటికి నూరుపాళ్లు సరైన నిర్ణయం. రుణంపై కొనుగోలు చేయడం వల్ల ఆదాయపన్ను ప్రయోజనాలు అందుకోవచ్చు. అసలుకు చేసే చెల్లింపులు, దానిపై చెల్లించే వడ్డీకి కూడా మినహాయింపులు ఉన్నాయి. ఇక, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొదటి ఇల్లు కొనుగోలుపై వడ్డీ రాయితీల రూపంలో రూ.2.50 లక్షల ప్రయోజనాన్ని అందుకోవచ్చు.

పెన్షన్
అలాగే, విశ్రాంత జీవనం కోసం కూడా నిధి ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం సంపాదిస్తున్న దశలోనే ఎన్ పీఎస్ వంటి పెన్షన్ పథకాలను పరిశీలించవచ్చు. లేదంటే నెల వేతనంలో 10 శాతాన్ని పింఛను కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఇక విశ్రాంత జీవనంలో పెన్షన్ ఆదాయం సరిపోకుంటే, అవసరాలు పెరిగిపోతే సొంతింటిపై రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని పొందే వెసులుబాటూ ఉంది. బ్యాంకులు మీ ఇంటిని తనఖాగా ఉంచుకుని నిధులను విడుదల చేస్తాయి. తర్వాత దాన్ని వీలుంటే తీర్చివేసి తనఖాలో ఉన్న ఇంటిని మీపరం  చేసుకోవచ్చు. లేదంటే మీ వారసులు ఆ పని చేస్తారు.

పిల్లల కోసం ప్రణాళికలు
పిల్లల్నిగొప్పవారిగా చూడాలని ప్రతీ తల్లిదండ్రులకి ఉంటుంది. అందుకోసం వారు కోరిందల్లా కాదనకుండా ఇస్తూ మంచి చదువు చెప్పించేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అయితే, ఈ కలల సాకారం కోసం ప్రణాళికలు కూడా అవసరమే. సంతానం కలిగిన వెంటనే వారి 20 ఏళ్ల విద్యావసరాలకు అయ్యే వ్యయాన్ని సుమారుగా అంచనా వేయాలి. ఎంత మంది పిల్లలు ఉంటే ఖర్చు ఆ మేర ఉంటుంది. ఆ ఖర్చుల్ని తట్టుకునేందుకు వీలుగా పెట్టుబడి పెడుతూ వెళ్లాలి.

అలాగే, పిల్లల వివాహ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయ్? అందుకే వివాహ ఖర్చులకు కూడా నెలనెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. పిల్లల కోసం చేసే ఇన్వెస్ట్ మెంట్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి అవసరం అయ్యేవి గనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, బ్యాంకు రికరింగ్ డిపాజిట్ ఖాతాలు అనువుగా ఉంటాయి.

నెలవారీ బడ్జెట్ షీటు ఇలా...
మొత్తం శాలరీ (గ్రాస్): ఇది చేతికి వచ్చే వేతనం కాదు. ఇందులో కొన్ని కటింగ్ లు ఉంటాయి. వృత్తి పన్ను, ఈపీఎఫ్ మొదలైనవి. వీటిని తీసి వేయగా నికరంగా చేతికి అందుకునే వేతనం ఎంతన్నది తెలుస్తుంది. దీనికి మీకు ఇతరత్రా ఆదాయం ఏదైనా వస్తుంటే దానినీ కలపాలి.
ఇల్లు: అద్దెంట్లో ఉంటే దానికి నెలనెలా చెల్లించే మొత్తం. సొంతిల్లు అయితే ప్రాపర్టీ పన్ను, రిపెయిర్లు, మెయింటెనెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇవన్నీ కాలమ్ వారీగా రాసుకోవాలి.
యుటిలిటీలు: విద్యుత్తు బిల్లు, నీటి బిల్లు, గ్యాస్, టెలిఫోన్, ఇంటర్నెట్ ఖర్చులు, కేబుల్ టీవీ లేదా డిష్ టీవీ చార్జీలు.
ఆహారం: ఇంట్లో ఆహార అవసరాలకు వీలుగా కిరాణా సరుకుల కోసం చేసే వ్యయం. మధ్య మధ్యలో బయటకు వెళ్లి రెస్టారెంట్లలో చేసే ఖర్చులు, బయట టీ, కాఫీల కోసం చేసే వ్యయాలు.
ఆరోగ్యం, వైద్యం: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సాధారణ వైద్య అవసరాల కోసం డాక్టర్ల కన్సల్టేషన్, టెస్టులు, మందులకు అయ్యే వ్యయాలు, ఆరోగ్యం కోసం జిమ్ కు చెల్లించే చార్జీలు వంటివన్నీ ఇందులోకి వస్తాయి.
రవాణా: ద్విచక్ర వాహనం లేదా కారు కోసం చేసే వ్యయాలు. అంటే ఇన్సూరెన్స్, ఇంధనం, రిపెయిర్లు, టోల్  ఫీజులు వంటి ఖర్చులు.
రుణాల చెల్లింపులు: క్రెడిట్ కార్డులు, గృహ రుణం, వ్యక్తిగత రుణం, వాహన రుణం వీటి కోసం చేసే చెల్లింపులు.
విద్య: పిల్లల విద్యా ఖర్చులు. ట్యూషన్ ఫీజులు, టెక్స్ట్ పుస్తకాలు, వస్త్రాలు, రవాణా వ్యయాలు.
వినోదం: సినిమాలు, షికార్లు, విహార పర్యటనల కోసం అయ్యే వ్యయాలు.
వ్యక్తిగత రక్షణ: వస్త్రాలు, కాస్ట్యూమ్ లు, ఇతర సౌందర్య ఉత్పత్తుల కోసం చేసే వ్యయాలు.
పొదుపు, పెట్టుబడులు: పెన్షన్ కోసం, అత్యవసర నిధి కోసం, పిల్లల విద్య, వివాహం, సొంతింటి కోసం పెట్టుబడులన్నీ ఇందులోకి వస్తాయి.
ఇతరాలు: ఇతరులకు ఇచ్చే బహుమతులకు అయ్యే వ్యయం, చిన్న చిన్న ఖర్చులన్నీ ఈ విభాగంలో రాసుకోవచ్చు.
ఇలా ప్రతీ విభాగంలోని అవసరాలకు కావాల్సిన మొత్తాన్ని మీకొస్తున్న ఆదాయాన్ని బట్టి కేటాయింపులు చేసుకోవాలి. దాన్ని దాటకుండా నియంత్రించుకోవాలి. అవుతున్న వ్యయాలను పరిశీలిస్తూ ఏదేనీ విభాగంలో మిగులు ఉంటే, అదనంగా ఖర్చులున్న మరో విభాగానికి కేటాయింపులు చేసుకోవడం ద్వారా స్వీయ నియంత్రణ, క్రమశిక్షణతో నడుచుకోవాలి. దీని వల్ల విజయం వైపు అడుగులు వేయాలి.


More Articles