Revanth Reddy: మోదీగారూ.. నన్ను తిడితే ఏం వస్తుంది? ఢిల్లీ నుంచి వచ్చి భయపెడితే భయపడతానా?: రేవంత్ రెడ్డి

Revanth Reddy questions PM Narendra Modi
  • తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఓటేద్దామా? అని ప్రశ్న
  • ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ ఇచ్చిన వారికి ఓటేయాలని పిలుపు
  • మోదీ తన కంటే పెద్దవారు, అనుభవం ఉన్నవారు సూచనలివ్వాలన్న రేవంత్ రెడ్డి
  • తనను కేసీఆర్ జైల్లో పెడితే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
నరేంద్ర మోదీ గారూ... నన్ను తిడితే మీకు ఏం వస్తుంది? ఢిల్లీ నుంచి వచ్చి భయపెడితే భయపడతానని అనుకున్నావా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాపూర్‌లో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణకు మోదీ ఏమీ ఇవ్వలేదని చెప్పేందుకు ప్రతి చౌరస్తాలో గాడిద గుడ్డు ఫ్లెక్సీలు పెడదామని పిలుపునిచ్చారు. గాడిద గుడ్డు ఇచ్చిన వారికి ఓటేద్దామా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ ఇచ్చిన వారికి ఓటేయాలన్నారు. నిన్న తన వద్దకు ఢిల్లీ పోలీసులను పంపించి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.

తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ హైదరాబాద్-విజయవాడ బుల్లెట్ రైలు ప్రకటిస్తారని భావించానని, కానీ తనపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ శ్రేణులు విశ్రమించరన్నారు. కేసీఆర్ గతంలో చెప్పిన దానినే మోదీ ఈరోజు నకలు కొడుతూ తనను తిట్టారన్నారు. తాను ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని.. తాము బీసీ గణన చేస్తామంటే ఎందుకు మెచ్చుకోవడం లేదని ప్రశ్నించారు. వయస్సులో, అనుభవంలో మోదీ తన కంటే చాలా పెద్దవారని... తనకు సూచనలు చేయాలి, సలహాలు ఇవ్వాలి కానీ విమర్శలు ఎందుకన్నారు. కానీ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏమిటన్నారు. ఇది గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధమన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. తప్పుడు కేసులతో కేసీఆర్ తనను జైల్లో పెడితే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణలో కారు లేదు కాబట్టే కేసీఆర్ బస్సు వేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాము విద్యార్థుల బలిదానాలతో అధికారంలోకి రాలేదని చురక అంటించారు. కేసీఆర్ మళ్లీ జీవితంలో ముఖ్యమంత్రి కాలేరన్నారు.
Revanth Reddy
Congress
Narendra Modi
BJP
Lok Sabha Polls

More Telugu News