సిబిల్ స్కోర్ ఉచితంగా ఇలా తెలుసుకోవచ్చు...

సిబిల్ స్కోర్ అన్నది ప్రతి ఒక్కరి రుణ చరిత్రను సమగ్రంగా తెలియజేసేది. రుణం ఇవ్వడానికి బ్యాంకులు, అన్ని ఆర్థిక సంస్థలు ముందుగా చూసేది సిిబిల్ స్కోరునే. దీన్ని ఏడాదికోసారయినా తెలుసుకోవడం చాలా అవసరం. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) సంస్థ ఏడాదికోసారి తమ సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ అవకాశాన్ని పొందడం ఎలానో తెలుసుకుందాం.

representation imageఇటీవలి వరకు సిబిల్ స్కోర్ అన్నది చార్జీ చెల్లిస్తేనే లభించేది. కానీ, ఏడాదిలో ఒక్కసారి వ్యక్తుల రుణ చరిత్ర రిపోర్ట్ ను ఉచితంగా అందించడం తప్పనిసరి చేస్తూ ఆర్ బీఐ అన్ని క్రెడిట్ కంపెనీలను ఆదేశించింది. సిబిల్ స్కోర్ తెలుసుకునేందుకు ముందుగా https://www.cibil.com/freecibilscore సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఈ పేజీలోనే కింది భాగంలో ‘ఫ్రీ యాన్యుయల్ సిబిల్ స్కోర్ రిపోర్ట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.  దీన్ని క్లిక్ చేస్తే తర్వాతి పేజీ ఓపెన్ అవుతుంది.

ఇక్కడ ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పాన్ నంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చ ఎంటర్ చేసి, నియమ, నిబంధనలు అంగీకరిస్తున్నట్టు టిక్ చేసి సబ్ మిట్ బటన్ ఓకే చేయాలి.

representation image
అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో సిబిల్ రిపోర్టులు తరచుగా పొందేందుకు చందాల వివరాలు ఉంటాయి. పెయిడ్ మెంబర్ షిప్ స్కీములు కనిపిస్తాయి. దాన్ని కాకుండా నో థ్యాంక్స్ అన్న బటన్ ఓకే చేస్తే తర్వాత పేజీకి వెళతారు. ఆథెంటికేషన్ సక్సెస్ ఫుల్ అన్న సందేశంతో పేజీ ఓపెన్ అవుతుంది.representation image
క్రెడిట్ రిపోర్ట్, సిబిల్ సేవల కోసం మై సిబిల్ లో లాగిన్ అవ్వాలని కోరుతూ సందేశం కనిపిస్తుంది. లాగిన్ వివరాలు మెయిల్ ఐడీకి వచ్చి చేరతాయి. ఇందులో మై సిబిల్ పేజీ లింక్, వన్ టైమ్ పాస్ వర్డ్ ఉంటాయి. ఆ వివరాలతో మై సిబిల్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వెంటనే కొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకునే పేజీ కనిపిస్తుంది. కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేసుకున్న అనంతరం తిరిగి మై సిబిల్ పేజీలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

representation imageలాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. అందులో మీ స్కోరు ఎంతన్నది పై భాగంలో కనిపిస్తుంది. స్కోరు కింది భాగంగా వరుసగా పలు ఆప్షన్లు ఉంటాయి. వ్యూ రిపోర్ట్ భాగంలో వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ సమాచారం, ఖాతా సమాచారం (ప్రస్తుత, గత రుణ చరిత్ర), మీ క్రెడిట్ స్కోరు కావాలని అడిగిన సంస్థల వివరాలు వంటి వివరాలు కనిపిస్తాయి.

సిబిల్ గురించి...?
దేశ ప్రజల రుణ సమాచారాన్ని పొందుపరిచేందుకు 2000వ సంవత్సరంలో ఏర్పాటైనదే సిబిల్. సిబిల్ తరహాలోనే సేవలు అందించే ఈక్విఫాక్స్, ఎక్స్ పీరియన్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. రుణాలు, క్రెడిట్ కార్డులకు చేసే చెల్లింపుల వివరాలను సేకరించడం ద్వారా సంబంధిత వినియోగదారుల రుణ చరిత్రను నిర్వహిస్తుంటాయి ఇవి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ దగ్గర రుణాలు తీసుకున్న వారి వివరాలను, చెల్లింపులను, విఫలమైతే ఆ వివరాలను ప్రతీ నెలా సిబిల్ వంటి సంస్థలకు తెలిజేస్తుంటాయి. వాటి ప్రకారం ఒక్కొక్కరి రుణ స్కోరును ఖరారు చేయడం, రిపోర్ట్ లను సిద్ధం చేయడం జరుగుతుంది.

వీటితో క్రెడిట్ స్కోరుకు నష్టం...
రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోవడం, చెక్ బౌన్స్ అవడం, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో విఫలం కావడం, అన్ సెక్యూర్డ్ రుణాలైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ వంటి వాటిని అధికంగా తీసుకోవడం, వేరొకరికి రుణం విషయంలో హామీదారుడిగా ఉండి, వారు చెల్లించలేని పరిస్థితుల్లో తప్పించుకోవడం, క్రెడిట్ కార్డుపై ఉన్న అప్పు లిమిట్ ను పూర్తిగా వాడేయడం వంటి చర్యలన్నీ స్కోరుపై ప్రభావం చూపుతాయి.

representation imageస్కోరును ఇలా పెంచుకోవచ్చు...
క్రెడిడ్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో, లోన్ ఈఎంఐ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఫాల్ట్ లేకుండా చూసుకోవాలి. నిర్ణీత గడువు లేదా ఆలోపే గుర్తుంచుకుని మరీ క్రమం తప్పకుండా చెల్లించాలి. చెల్లింపులను చెక్ ద్వారా చేసేట్టు అయితే కనీసం గడువు తేదీకి పది రోజుల ముందే అది ప్రారంభించాలి. ఎందుకుంటే క్లియర్ అవడానికి సమయం తీసుకుంటుంది. ఒకవేళ బౌన్స్ అయినా గడువు దాటకుండా చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఒకేసారి అధిక సంఖ్యలో రుణాలు తీసుకోవద్దు. మంచి స్కోరున్న వారికి అధిక మొత్తంలో రుణం, ఒకటికి మించిన రుణాలు ఇచ్చేందుకు సంస్థలు రెడీ. కానీ, తీసుకునే ముందు జాగ్రత్త పాటించాలి. ఒకరిపేరుతోనే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ వంటి అన్ సెక్యూర్డ్ రుణాలు ఎక్కువగా తీసుకో్వద్దు. ఏక కాలంలో రెండు రుణాలను దాటకుండా చూసుకోవాలి. రుణం తీర్చివేయడం ముగిసిన ప్రతీసారీ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి నోడ్యు సర్టిఫికెట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒక రుణం తీర్చిన తర్వాత మరో రుణం పొందడానికి మధ్య కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల విరామం ఉండేలా చూసుకోవాలి.

బంధువులు, స్నేహితులు మరెవరైనా కానీయండి. మొహమాటానికి పోయి రుణం విషయంలో హామీదారుడిగా ఉండరాదు. క్రెడిట్ కార్డుల లిమిట్ ను పూర్తిగా కాకుండా కొంత మొత్తం వరకే వాడుకోవాలి. దీన్ని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటారు. అంటే అవకాశం ఉన్న మొత్తంలో వాడుకునే మొత్తం అని అర్థం. రుణం చెల్లింపుల విషయంలో ఏదైనా సమస్య ఏర్పడితే సత్వరమే సానుకూలంగా పరిష్కరించుకోవాలి.

representation imageముఖ్యంగా క్రెడిట్ కార్డుల హిస్టరీ సిబిల్ స్కోరుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.50వేల లిమిట్ ఉందనుకుంటే ప్రతీ నెలా పూర్తి మొత్తాన్ని వాడుకోవడం సరికాదు. అదే సమయంలో 80 శాతం దాటకుండానే వినియోగించుకోవడం మంచిది. ఒకవేళ అంతకుమించి అవసరం అనుకుంటే కార్డు లిమిట్ ను పెంచుకుని తక్కువ వాడుకోవడం తెలివైన పని. 30 నుంచి 40 శాతం క్రెడిట్ లిమిట్ వినియోగం అన్నది సానుకూలమైనది.  రెండు కార్డులున్నప్పుడు ఒక కార్డు వాడుతూ మరో కార్డు అసలు వాడకపోవడం కూడా స్కోరును దెబ్బతీస్తుంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డనేది లేకపోతే వెంటనే తీసుకుని దాని ద్వారా చెల్లింపులు చేయడం వల్ల మీకంటూ మంచి రుణ చరిత్ర ఏర్పడుతుంది.

బకాయి పడి ఉంటే దాన్ని సెటిల్ చేసుకోకుండా పూర్తిగా, ఆలస్యపు రుసుములు, వడ్డీలు ఉంటే చెల్లించడమే మంచిది. గృహ రుణం వంటి సెక్యూర్డ్ రుణాలతో సిబిల్ స్కోరు మెరుగవుతుంది. అదే అరక్షితమైన కారు రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు రుణాలు సిబిల్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపడానికి అవకాశాలు ఉంటాయి.

క్రెడిట్ స్కోరు అంటే..?
వ్యక్తుల రుణ సామర్థ్యాన్ని తెలియజేసేది. ఒక వ్యక్తికి రుణం ఇస్తే తిరిగి చెల్లించగలరా? లేదా? అన్నది స్కోరు తెలియజేస్తుంది. ఒక వ్యక్తి సిబిల్ రిపోర్ట్ ఆ వ్యక్తి అప్పటి వరకు ఏవైనా రుణాలు ఎగ్గొట్టడం లేదా ఆలస్యంగా చెల్లించడం వంటి సమగ్ర వివరాలను తెలియజేసే సాధనం.

సాధారణంగా 750 నుంచి 900 మధ్య ఉంటే దాన్ని అద్భుతమైన స్కోర్ కింద పరిగణిస్తారు. గతంలో రుణ చెల్లింపుల పరంగా మంచి చరిత్రను సూచిస్తుంది. రుణాలను బ్యాంకుల నుంచి సరసమైన వడ్డీ రేట్లకు పొందే అవకాశం కూడా ఉంటుంది. క్రెడిట్ స్కోరును బట్టి ఏ రుణాలకు అర్హులన్నది ఉంటుంది. మై సిబిల్ అకౌంట్ లో ఏ రుణాలకు రెడీగా ఆఫర్లున్నాయో కూడా తెలుస్తుంది.

700 - 750 మధ్యన ఉన్నా మంచి స్కోరుగానే పరిగణిస్తారు. 550-700 మధ్యన ఉంటే తక్కువ స్కోరుగా పరిగణిస్తారు. లోగడ చెల్లింపులను సకాలంలో  చేయకపోవడం వల్ల ఏర్పడే సమస్య ఇది. ఈ స్కోరున్న వారి విషయంలో ఆర్థిక సంస్థలు కూడా ఆచితూచి వ్యవహరిస్తాయి. అధిక వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఇంతకంటే తక్కువ స్కోరుంటే రుణాలు లభించడం కష్టమే!

రుణం చిటికెలో కావాలా.. అయితే సిబిల్ స్కోర్ చూడండి!

రుణం కావాలంటే సిబిల్‌ రిపోర్ట్‌లో తప్పులుండకూడదు... ఉంటే సరిచేసుకోండి ఇలా...!



More Articles