కార్డుతో పెట్రోల్ పోయించుకుంటే బోలెడంత ఆదా! షాపింగ్ చేస్తే ఇంకాస్త ఆదా...!

నేడు దిగువ మధ్య తరగతి నుంచి సంపన్నుల వరకు ప్రతీ ఇంట్లో ఏదో ఒక మోటారు వాహనం ఉండడం సర్వ సాధారణమైపోయింది. పెట్రోల్, డీజిల్ లీటర్ల కొద్దీ పోయించుకుంటే గానీ వాహనం అడుగు ముందుకు పడదు, పనులు పూర్తి కావు. మరి ఇంధనం కోసం నెలకు వందల నుంచి వేల రూపాయల వరకు బడ్జెట్ కేటాయించుకోక తప్పదు. నిజమే, కొంచెం తెలివితో వ్యవహరిస్తే ఈ బడ్జెట్ ను కొంత పొదుపు చేసుకోవచ్చు. ఇందుకు వీలు కల్పించేవే క్రెడిట్ కార్డులు. కేవలం ఇంధనంపైనే కాదు, ఇతర కొనుగోళ్లపైనా ప్రయోజనాలు అందించే కార్డులు బోలెడు ఉన్నాయి.

representative imageక్రెడిట్ కార్డులతో పెట్రోల్ పోయించుకోవడం ద్వారా ఇంధన బడ్జెట్ ను కొంత తగ్గించుకోవచ్చన్న విషయమై అందరికీ అవగాహ లేదు. సుమారు 2.5 శాతం వరకు పొదుపు చేసుకోవచ్చు. పొదుపు సంపాదనతో సమానమన్న ఆర్థిక సూత్రం గుర్తుండే ఉంటుంది. బ్యాంకులు ఆయిల్ కంపెనీల భాగస్వామ్యంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఇవి పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు మాత్రమే పరిమితం కాదు. షాపింగ్ కు సైతం వినియోగించుకోవడం ద్వారా ఖర్చులో మరింత ఆదా చేసుకోవచ్చు.

సిటీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంకులు చమురు కంపెనీలతో కలసి క్రో బ్రాండెడ్ కార్డులను అందిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు సైతం ఇటువంటి కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. సిటీ బ్యాంకు, అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంకుల కార్డులకు అయితే, వార్షికంగా రూ.2,000 ఫీజును చెల్లించుకోవాలి. మొదటి ఏడాది మాత్రం ఉచితం. కానీ ఐసీఐసీఐ బ్యాంకు కార్డుకు వార్షిక రుసుములు లేవు. కానీ, ఇంధనంపై 1.44 శాతమే డిస్కౌంట్ లభిస్తుంది.

అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంకు హెచ్ పీసీఎల్ తో కలసి కో బ్రాండెడ్ కార్డును ఆఫర్ చేస్తోంది. హెచ్ పీసీఎల్ బంకుల్లో ఈ కార్డుతో ప్రతీ రూ.100 రూపాయిల ఇంధనంపై ఐదు పాయింట్లు లభిస్తాయి. ఇవి రూపాయితో సమానం. అంటే ఒక శాతం తగ్గింపు లభించినట్టు. ఇతర కొనుగోళ్లపై ప్రతీ రూ.40 రూపాయల వ్యయంపై 75 పైసలకు సమానమైన పాయింట్లు వెనక్కి వచ్చేస్తాయి. వార్షిక రుసుము రూ.2,000. ఒకవేళ ఆ ఏడాదిలో కార్డు ద్వారా కొనుగోళ్ల విలువ రూ.60,000 దాటితే వార్షిక రుసుములో సగం తగ్గింపు ఉంటుంది. వార్షికంగా కొనుగోళ్ల విలువ రూ.1,10,000 దాటితే వార్షిక రుసుములు మినహాయిస్తారు.

సిటీ బ్యాంకు ఐవోసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) సంయుక్తంగా అందించే కార్డు ద్వారా ఐవోసీ పెట్రోల్ పంపుల్లో ఇంధనం నింపుకుంటే ప్రతీ రూ.150 రూపాయల వ్యయంపై నాలుగు రివార్డు  పాయింట్లు లభిస్తాయి. ప్రతీ పాయింట్ ఒక రూపాయితో సమానం. అంటే నాలుగు రూపాయలు ఆదా అయినట్టు. నికరంగా 2.67 శాతం తగ్గింపు లభించినట్టు. గ్రోసరీ, సూపర్ మార్కెట్లలో ప్రతీ రూ.150 రూపాయిల కొనుగోలుపై రెండు టర్బో పాయింట్లు వెనక్కి వస్తాయి. ఇక ఐసీఐసీఐ, హెచ్ పీసీఎల్ కార్డు ద్వారా రూ.125 రూపాయిల ఇంధన కొనుగోలుపై 1.80 రూపాయల తగ్గింపు లభిస్తుంది. నిర్ణీత విలువ మేర కొనుగోళ్ల తర్వాత రివార్డు పాయింట్లను రెడీమ్ చేసుకోవచ్చు.

డీబీఎస్ ట్రెజర్స్ వీసా ఇన్ఫినైట్ డెబిట్representative image

ఈ కార్డుపై మొత్తంగా 7.5 శాతం మేర ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా పెట్రోల్ స్టేషన్లలో కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే సర్ చార్జీ 2.5 శాతం పడుతుంది. అది డీబీఎస్ కార్డు వినియోగంపై పడదు. పైగా 5 శాతం క్యాష్ బ్యాక్ రావడం ఈ కార్డులోని ప్రత్యేకత. ఒక నెలలో గరిష్టంగా రూ.1,000 పొందడం వరకే ఈ క్యాష్ బ్యాక్ పరిమితం అవుతుంది. అంటే నెలకు రూ.20,000 ఇంధనం కొనుగోలు వరకు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు.  

స్టాండర్డ్ చార్టర్డ్ సూపర్ వేల్యూ టైటానియం కార్డు

ఇంధనం, వినియోగ వస్తువులు, టెలికం చెల్లింపులపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే, ఈ క్యాష్ బ్యాక్ కనీసం రూ.750 రూపాయల కొనుగోళ్లపైనే. ఒక లావాదేవీపై గరిష్టంగా రూ.100 మాత్రమే క్యాష్ బ్యాక్ పరిమితి. నెలలో ఈ క్యాష్ బ్యాక్ రూ.500కే పరిమితం. ఇతర కొనుగోళ్లపై ప్రతీ రూ.100 వినియోగానికి గాను ఒక పాయింట్ లభిస్తుంది.

ఆర్ బీఎల్ టైటానియమ్ డిలైట్

ఈ కార్డుతో ఇంధనం కొనుగోలు చేస్తే 2.5 శాతం ఫ్యూయల్ సర్ చార్జీ ఉండదు. బిగ్ బజార్ లో ప్రతీ బుధవారం చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇతర కొనుగోళ్లపై ప్రతీ రూ.100 రూపాయలకు రెండున్నర రివార్డు పాయింట్లు లభిస్తాయి. అలాగే, ప్రతీ బుధవారం పిజ్జా హట్, డామినోస్ పిజ్జా కేంద్రాలకు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. నెలలో ఓ సారి ఏదైనా బుధవారం 1 ప్లస్ 1 మూవీ టికెట్ 'బుక్ మై షో' ద్వారా ఉచితం. ఒక ఏడాదిలో రూ.లక్ష ఖర్చు చేస్తే మరుసటి ఏడాది ఫీజు మినహాయింపు సదుపాయం ఉంది.

ఎస్ బీఐ సింప్లీ సేవ్

రూ.500 నుంచి రూ.3,000 మధ్య ఇంధన కొనుగోలుపై సర్ చార్జీ ఉండదు. సినిమాలు, షాపింగ్, డైనింగ్, గ్రోసరీ కొనుగోళ్లపై ప్రతీ రూ.100కు 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి. నాలుగు రివార్డు పాయింట్లు ఒక రూపాయితో సమానం. అంటే 2.5 శాతం పొదుపు చేసుకోవచ్చు. ఇతర కొనుగోళ్లపై రూ.100కి ఒక పాయింటు రివార్డుగా లభిస్తుంది.

హెచ్ డీఎఫ్ సీ మనీ బ్యాక్ కార్డు
representative imageప్రతీ రూ.150 ఇంధన కొనుగోలుపై రెండు రివార్డు పాయింట్లు అందుకోవచ్చు. ఆన్ లైన్లో రూ.150 కొనుగోలు చేస్తే 4 రివార్డు పాయింట్లు వస్తాయి. ప్రతీ బిల్లింగ్ సైకిల్ లో రూ.250 వరకు ఇంధన సర్ చార్జీ మినహాయింపు ఉంది. ఒక బిల్లింగ్ సైకిల్ లో (సుమారు నెల) రూ.50వేలకు మించి కొనుగోలు చేస్తే 50 శాతం అదనంగా రివార్డు పాయింట్లు వస్తాయి. ఈ కార్డుపై మరో మూడు కార్డులను ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా యాడాన్ కార్డులు తీసుకోవచ్చు. కార్డు పోతే ఎటువంటి చార్జీలు లేకుండానే కొత్తది లభిస్తుంది. కార్డు వచ్చిన మొదటి 90 రోజుల్లో రూ.10,000 మొత్తం కొనుగోలు చేస్తే మొదటి ఏడాది వార్షిక ఫీజు మినహాయింపు ఉంది. ఒక ఏడాదిలో రూ.50,000 కొనుగోళ్లు చేస్తే తర్వాతి సంవత్సరానికి ఎటువంటి రెన్యువల్ ఫీజు ఉండదు.

ఇవి గుర్తుంచుకోవాలి

కార్డులపై వార్షిక రుసుములు ఉంటాయి. ఒకవేళ కార్డు జారీ సంస్థ నిర్దేశించిన పరిమితి (ఏడాదిలో ఇంత మేర కొనుగోళ్లు జరపాలని) మేరకు ఆ సంవత్సరంలో కొనుగోళ్లు జరిపితేనే చార్జీల భారం తప్పుతుంది. పైగా రివార్డు పాయింట్లకు, సర్ చార్జీ మినహాయింపునకు కనీస విలువ మేరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కార్డును బట్టి రూ.100 నుంచి రూ.800 వరకు ఉంటుంది. సాధ్యమైనన్ని బంకుల్లో ఆమోదించే కార్డును తీసుకోవాలి. కొన్ని కార్డులు ఎంపిక చేసిన పెట్రోల్ స్టేషన్లలో ఇంధనం నింపుకుంటేనే ప్రయోజనాలను అందిస్తుంటాయి. కొన్ని కార్డులను తీసుకుని వాడకపోతే భారం మోత మోగిపోతుంది. వాడని కార్డులపై భారీ వార్షిక రుసుములను విధిస్తున్నాయి. ఉదాహరణకు ఐవోసీ సిటీ బ్యాంకు ప్లాటినం కార్డు వాడకపోతే ఒక ఏడాదికి గాను రూ1,000 నుంచి రూ.30,000 వరకు ఫీజును వసూలు చేస్తోంది. ఇంధనంతోపాటు, సూపర్ మార్కెట్లు, గ్రోసరీ స్టోర్లు, ఆన్ లైన్ లో కొనుగోళ్లు ఇలా చేసే వారికి ఈ కార్డులు అనువుగా ఉంటాయి.

రివార్డు పాయింట్లు ఎలా సాధ్యం..?

representative imageక్రెడిట్/డెబిట్ కార్డుతో చేసే ప్రతీ లావాదేవీ ద్వారా వ్యాపారి నుంచి కార్డు కంపెనీకి ఇంటర్ చేంజ్ ఫీజు లభిస్తుంది. ఇది 1 శాతం నుంచి 2.5 శాతంగా ఉంటుంది. దీనికితోడు, కార్డు దారులకు వార్షిక నిర్వహణ చార్జీలు ఉండనే ఉన్నాయి. అలాగే, బిల్లింగ్ సైకిల్ పూర్తయ్యే లోపు చెల్లించని బకాయిలపై భారీ వడ్డీలను రాబడుతుంటాయి. ఇలా రాబట్టుకున్న ఆదాయంలోంచి కొంత మేర రివార్డు పాయింట్ల రూపంలో కస్టమర్లకు వెనక్కి అందిస్తుంటాయి. దాని ద్వారా కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించి మరింత ఆదాయం రాబట్టుకోవడమే వాటి లక్ష్యం.  

సాధారణంగా ఈ కార్డుల్లోనూ అనేక రకాలు ఉంటాయి. బేసిక్ కార్డులపై తక్కువ రివార్డు  పాయింట్లు... ప్రీమియం, సూపర్ ప్రీమియం తరహా కార్డులపై ఎక్కువగానూ లభిస్తాయి. వీటి వార్షిక ఫీజుల్లోనూ తేడా ఉంటుంది. ప్రీమియం కార్డులపై ఎక్కువ ఫీజు ఉంటుంది. రివార్డు పాయింట్లకు గడువు ఉంటుంది. ఏడాది నుంచి మూడేళ్ల వరకు సాధారణంగా ఉండే గడువు. ఆ లోపు వినియోగించుకోకపోతే బ్యాంకులు వాటిని రద్దు చేసేస్తాయి. ఎందుకంటే ఈ పాయింట్లు అన్నవి కేవలం ప్రోత్సాహకాలే!


More Articles