ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదా... నిద్రిస్తే ఏమవుతుంది...?

ఉత్తరదిశగా తలపెట్టి నిద్రించకూడదని పెద్దలు చెబుతుండగా వినే ఉంటారు. కానీ, ఎందుకన్నది చాలా మందికి తెలియదు. అయినా సరే కొంత మంది దీన్నో అర్థం పర్థం లేని గుడ్డి నమ్మకంగా పేర్కొంటూ ఉత్తరంవైపే తలపెట్టి నిద్రిస్తుంటారు. కానీ, ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించవద్దని పెద్దలతో పాటు కొందరు శాస్త్రవేత్తలు కూడా సూచిస్తున్నారు. ఎందుకు, ఏమిటి అన్నది చూద్దాం...

మన శరీరం అంతా ఇంజనీరింగ్ మహిమే

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. మనిషి ఈ గురుత్వాకర్షణ శక్తిపైనే జీవిస్తాడు. గుండె మన దేహంలో పై భాగంలో ఉంటుంది. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా...? గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుని రక్తాన్ని పైకి పంపడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. గుండె మెదడు నుంచి కాలి వరకు అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి వల్ల గుండె నుంచి కింది భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడం తేలికే. కానీ, పైకి పంపడమే కష్టం. ఒకవేళ గుండె దేహంలో కింది భాగంలో ఉంటే రక్తాన్ని పంప్ చేయడం మరింత కష్టతరమవుతుంది. ఎక్కువ ప్రెషర్ తో పంప్ చేయాలి. అలా చేసినప్పుడు మెదడు రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మెదడులోకి వెళ్లే రక్తనాళాలు వెంట్రుక పరిమాణంలో ఉంటాయి. అదే గుండె నుంచి శరీరంలోని కింది భాగాలకు వెళ్లే రక్తనాళాలు మాత్రం పెద్ద సైజులో ఉంటాయి.

ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తే...?

భూమిపై అయస్కాంత క్షేత్రాలు ఉంటాయని వినే ఉంటారు. ఈ అయస్కాంత శక్తుల ప్రభావం వల్లే ఉత్తర దిశవైపు తలపెట్టి పడుకోవద్దని చెబుతారు. ఉత్తర దిశగా తలపెట్టి ఓ ఐదారు గంటలు నిద్రిస్తే అయస్కాంత శక్తి ఆకర్షించడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగిపోతుంది. అదే పెద్ద వయసు వారు అయితే వారిలో రక్తనాళాలు కొంత బలహీన పడి ఉంటాయి గనుక వారి మెదడులో రక్తస్రావం జరిగి పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ మంచి ఆరోగ్యవంతులైన వారు ఇలా చేస్తే వారిలో పెద్ద ప్రమాదం ఏమీ కనిపించదు. కానీ వారు సైతం నిద్ర లేస్తూనే ఆందోళనగా కనిపిస్తారు. ఎప్పుడో ఒక రోజు ఉత్తరదిశగా తలపెట్టి నిద్రించడం వల్ల ప్రమాదం బారిన పడతారని, ప్రాణం కోల్పోతారని కాదు. కానీ, నిత్యం ఇదే పనిచేస్తుంటే మాత్రం కొంత కాలానికి అయస్కాంత శక్తుల ప్రభావంతో మెదడుపై ఒత్తిడి పెరిగి పోయి సమస్యల బారిన పడడం ఖాయం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎటువంటి సమస్యలు అన్నది శరీర నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. తలనొప్పి, గందరగోళం, మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.  

మరి ఏ దిశలు మంచివి...?

representation imageతూర్పు దిశ మంచిది. ఈశాన్యం కూడా ఫర్వాలేదు. పడమర ఆమోదనీయం. దక్షిణ దిశగా తలపెట్టడం అన్నింటికంటే ఉత్తమం. మన దేశం ఉత్తరార్ధ గోళంలో ఉన్నందున ఉత్తరదిశగా తలపెట్టకుండా మిగిలిన మూడు దిక్కుల్లో తలపెట్టుకోవాలని చెబుతారు. ఇందులో మతపరమైన నమ్మకాలనే చూడకుండా సైన్స్ కూడా ఉందన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ దక్షిణార్ధగోళంలో ఉంటే గనుక దక్షిణ దిశవైపు తలపెట్టి పడుకోకూడదు. ఎందుకంటే ఆ వైపు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది గనుక.

representation imageభూ అయస్కాంత శక్తి ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపునకు వెళుతుంది. ఈ క్రమంలో ఉత్తరం వైపున తలపెట్టి పడుకుంటే అయస్కాంత శక్తి దక్షిణం వైపునకు లాగేయడం వల్ల ఉత్తరం వైపున ఉన్న తలలోని మెదడుకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. దీంతో మెదడులోని కణాల పనితీరుపై ప్రభావం పడడం వల్ల నిద్రా భంగం ఎదురవుతుంది. ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేసేవారు రాత్రి వేళల్లో దక్షిణం దిశవైపు తలపెట్టి నిద్రించడం వల్ల వారు తొందరగా రిలాక్స్ అవుతారు. దక్షిణం వైపున తలపెట్టి పడుకోవడం వల్ల మన శరీరం, అయస్కాంత శక్తి పరస్పర ఆకర్షణ వల్ల ప్రశాంతతో కూడిన నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

representation imageవైద్య శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం... భూమికి అయస్కాంత ధ్రువం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ఉంటుంది. సానుకూల ధ్రువం ఉత్తరాన, ప్రతికూల ధ్రువం దక్షిణాన ఉంటాయి. మన శరీరంలో తలవైపు సానుకూల ధ్రువం, పాదాల వైపు ప్రతికూల ధ్రువం ఉంటాయి. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించడం వల్ల రెండూ సానుకూల ధ్రువాలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయని, దాంతో మెదడుపై ప్రభావం పడుతుందన్నది వారి వివరణ.

representation imageభూమి  పశ్చిమం వైపు నుంచి తూర్పు వైపునకు తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి అయస్కాంత శక్తి భూమిపైకి తూర్పు దిశ నుంచి వస్తుంది. దీంతో తూర్పు దిశలో తల పెట్టడం వల్ల తలలోంచి ఆ అయస్కాంత శక్తి ప్రారంభమై పాదాల నుంచి బయటకు వెళుతుంది. దీంతో తల భాగం చల్లగా, పాదాల భాగం వేడిగా ఉంటుంది. అదే తల భాగాన్ని పడమర వైపు ఉంచితే దీనికి విరుద్ధంగా ఉంటుంది.  

విరుద్ధ అభిప్రాయాలు

తూర్పు వైపు తల ఉంచి నిద్రించే వారిలో ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ (ఆర్ఈఎం/కనుపాపల కదలికలు ఎక్కువగా ఉండే) ఉత్తర-దక్షిణ దిశ కంటే తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్ఈఎం దశలోనే కలలు వచ్చేది. జ్ఞాపక శక్తికి ఆర్ఈఎం కీలకమన్నది పలు అధ్యయనాల విశ్లేషణ. అదే సమయంలో ఏ దిక్కున నిద్రించినా ఏమీ కాదని, ఉత్తరం దిశగా పడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని పరిశోధనల్లో తేలలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. 

వాస్తు శాస్త్రం ఏమంటోంది...?

ఉత్తర దిశ మినహా మిగిలిన ఏ దిశవైపు అయినా తలపెట్టి నింద్రించవచ్చని వాస్తు శాస్త్రం కూడా చెబుతోంది. అన్నింటికంటే దక్షిణ దిశ నిద్ర పరంగా అనుకూలమైనది. ఆరోగ్యానికి, నిద్ర నాణ్యతకు ఈ దిశ అనుకూలిస్తుంది. తూర్పు దిశవైపు తలపెట్టి నింద్రించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి, ఆరోగ్యం బాగుంటుంది. అందుకే విద్యార్థులకు ఈ దిశ అనుకూలం. పడమర దిశ నిద్రించడం వల్ల మంచి పేరు, ప్రఖ్యాతులు వస్తాయంటోంది వాస్తు శాస్త్రం.

ఆయుర్వేదం ఏం చెబుతోంది...?

ఆయుర్వేదం కూడా ఏ దిశలో నిద్రించారన్న దాన్ని బట్టే శక్తి ఆధారపడి ఉంటుందని చెబుతోంది. దక్షిణం, తూర్పు దిశలు మంచివని సూచిస్తోంది.

మేల్కొన్న తర్వాత ఎటువైపు నుంచి లేవాలి...?

మన శరీరం నిద్రావస్థలో ఉన్నప్పుడు జీవక్రియలు చాలా నిదానిస్తాయి. నిద్ర లేచిన తర్వాత ఒక్కసారిగా ఇవి వేగం పుంజుకుంటాయి. అందుకే మెలుకువ వచ్చాక బెడ్ పై నుంచి కుడి చేతివైపునకు తిరిగి పైకి లేవాలి. ఇలా కాకుండా ఎడమచేతివైపునకు తిరిగి నిద్ర లేవడం వల్ల గుండెపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది.

శరీరం, మెదడు చురుగ్గా ఉండాలంటే..?

మంచంపై నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ముందుగా చేయాల్సిన పని... రెండు చేతులను గట్టిగా రాపిడి చేయాలి. వేడి పుట్టిన తర్వాత అర చేతులను రెండు కళ్లపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ల చివర్లలో ఉండే రక్తనాళాలు చురుగ్గా మారతాయి. దీంతో శరీర వ్యవస్థ సాధారణంగా మారుతుంది. బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకోవాలని కోరుకునేవారు ఎందరో. రాత్రి 8గంటల పాటు పూర్తి నిద్రపోయిన వారు సైతం మంచం మీద నుంచి దిగిరావడానికి ఎంతో సమయం తీసుకుంటారు. మగతగా, ఇంకా నిద్ర చాలదన్నట్టు, ఇంకా గుర్రు పెట్టాలన్నట్టు ఉంటుంది. అలాంటి వారు రెండు చేతులను ఒకదానితో మరొకటి రాపిడి చేసి కళ్లపై ఉంచి చూడండి. నిద్ర మత్తు జారి పోవాల్సిందే. కళ్లపై ఎందుకు పెట్టడం అంటారా... కళ్లలో ఉండే సున్నిత రక్తనాళాలు కూడా చురుగ్గా మారతాయి. దాంతో నిద్ర జారిపోతుంది. అంటే, ఈ చర్య ద్వారా శరీరం, కళ్లు... రెండూ నిద్రావస్థ నుంచి బయటకు వస్తాయన్నమాట. ఆ తర్వాత కుడివైపునకు తిరిగి మంచం మీద నుంచి కిందకు దిగడం ఆరోగ్యానికి అన్ని వేళలా క్షేమదాయకం.

మంచంపై ఏ వైపు తిరిగి పడుకోవాలి...?

మంచపై ఏ దిశవైపు పడుకుంటే మంచిదన్న విషయం దాదాపుగా చాలా మందికి తెలియదు. కుడి, ఎడమల్లో ఏ వైపు పడుకుంటే ఏ మవుతుందో వైద్యులు స్పష్టంగా వెల్లడించారు. ఎడమచేతి వైపునకు తిరిగి పడుకుంటే కుడివైపు ముక్కు నాసికా రంధ్రం పూర్తిగా తెరచుకుంటుంది. దీంతో మెదడులోని ఎడమవైపు భాగం చురుగ్గా మారుతుంది. దీన్నే తార్కిక భాగం అని కూడా అంటారు. ఇది చురుగ్గా మారడంతో నిద్ర సరిగా పట్టదు. పైగా ఎడమవైపున గుండె ఉంటుంది కనుక శరీర బరువు గుండె కండరాలపై పడుతుంది.

అదే కుడివైపునకు తిరిగి పడుకుంటే నిద్రకు, గుండెకు మంచిది. ఎందుకంటే కుడివైపునకు తిరిగి పడుకోవడం వల్ల గుండె కండరాలపై శరీర బరువు పడదు. ముక్కులోని ఎడమ నాసికా రంధ్రం తెరచుకోవడం వల్ల మెదడులోని కుడివైపు భాగం చురుగ్గా మారుతుంది. అదే సమయంలో మెదడులోని ఎడమవైపు భాగంలో చర్యలు తగ్గుముఖం పట్టడం వల్ల గాఢనిద్ర పోయేందుకు అనుకూలత ఉంటుంది. అలాగే, తిన్న వెంటనే పడుకుంటే కడుపు కండరాలపై ఒత్తిడి పడుతుంది.

ఇక కాళ్లు మడచి ఒకవైపునకు తిరిగి పడుకోవడం మంచిది కాదన్న వాదన కూడా ఉంది. దీని వల్ల శారీరక కదలికలు ఎక్కువగా ఉండి నిద్రా భంగం కలుగుతుందని, ఫలితంగా తగినంత విశ్రాంతి ఉండదని, అందుకే శరీరం నిటారుగా ఉంచి నిద్రించాలని కొందరు సూచిస్తుంటారు.

ఆరోగ్యకరమైన నిద్రకు

representation imageఆరోగ్యం విషయంలో నిద్ర అత్యంత కీలకమైనదని ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం సైతం చెబుతున్నాయి. అయితే, నేటి రోజుల్లో మంచి నిద్ర పోయే వారు నూటికి పది మంది కూడా ఉండని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంచి గాఢ నిద్రకు ఏం చేయాలో తెలుసుకుందాం..

- రోజూ మంచం మీదకు వెళ్లే సమయం మారకుండా చూసుకోవాలి. నిర్ణీత వేళకు నిద్రించడం, తిరిగి అలారమ్ పెట్టుకుని మరీ నిర్ణీత వేళకు మేల్కొనడం వల్ల బాడీ క్లాక్ ఆ వేళలకు బాగా అలవాటు పడిపోతుంది. పలితంగా నిద్ర సమస్య ఉండదు.

- ప్రతీ రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయాలి. కానీ, ఈ వ్యాయామం సాయంత్రం వేళల్లో కంటే ఉదయం వేళల్లో చేయడం నిద్రకు మంచిది. 

representation image- ప్రతీ రోజూ కనీసం అరగంటపాటు అయినా సూర్యరశ్మి ఒంటిపై పడేలా చూసుకోవడం కూడా మంచి నిద్రకు, ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

- మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కునుకు తీయరాదు. దీనివల్ల రాత్రుళ్లు నిద్రకోసం కష్టపడాల్సి వస్తుంది.

- రాత్రి వేళల్లో ఘనాహారం వద్దు, కడుపు నిండా సుష్టుగా లాగించేస్తే ఆ తర్వాత అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. కడుపు వెలితిగా ఆహారం తీసుకోవడం నిద్రకు మంచిది. అలాగే రాత్రి సమయంలో నిద్రకు ముందు ఎక్కువ నీరు తీసుకోవద్దు. దాని వల్ల నిద్ర మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది. 

representation image- కెఫైన్, కోకొవా వంటివి రక్తంలో ఎనిమిది గంటల పాటు తమ ప్రభావాన్ని చూపించగలవు. నికోటిన్ కూడా శరీరాన్ని ఉత్తేజపరిచేదే. అందుకే కాఫీ, టీ, చాక్లెట్లను నిద్రకు ఎనిమిది గంటల్లోపు తీసుకోవద్దు. మద్యం సేవిస్తే వెంటనే నిద్ర పట్టొచ్చు. కానీ నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. అర్ధరాత్రి మెలకువ వచ్చేస్తుంది. అలాగే సాయంత్రం తర్వాత శీతల పానీయాలు కూడా సేవించకూడదు.

- గుండె, రక్తపోటు, ఆస్తమా ఇతర సమస్యలకు వాడే మందులను వైద్యులు సూచించిన నిర్ణీత సమయానికి వేసుకోవాలి.

- వేడి నీటితో స్నానం కూడా మంచిది. దీనివల్ల స్నానానంతరం శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గుతుంది. దీంతో నిద్ర వస్తుంది. representation image

- పడకగదిలో టీవీ, ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్లు, ఐపాడ్స్, బ్లూ లైట్లు వంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి.

- నిద్రించడానికి ముందు మెడిటేషన్, పుస్తక పఠనం, సంగీతం వినడం వంటి మనసును తేలికపరిచే పనులు చేయాలి. దీనివల్ల మంచి నిద్ర పడుతుంది.

- మంచంపై పడుకున్న అరగంటకు కూడా నిద్ర రాకపోతే లేచిపోయి మెదడుకు విశ్రాంతినిచ్చే పని చేయాలి. నిద్ర వచ్చే వరకు అలా చేసి ఆపై నిద్రించాలి. ఇన్ని చేసినా నిద్ర రాకపోతే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. 


More Articles