మైక్రోవేవ్ ఓవెన్ కొంటున్నారా.. ఇవి తెలుసుకోండి

పెద్దగా శ్రమ లేకుండా వేగంగా వంట పూర్తికావడం, ఆరోగ్యకరమైన ఆహారం, కొన్ని ప్రత్యేకమైన వంటకాలను సులువుగా చేసుకునే వీలు కలిగించడం మైక్రోవేవ్ ఓవెన్ల ప్రత్యేకత. మనం బేకరీలకుగానీ, మరేదైనా రెస్టారెంట్లకు వెళ్లినపుడుగానీ మైక్రోవేవ్ ఓవెన్ లను చూస్తుంటాం. జస్ట్ రెండు మూడు నిమిషాలు అందులో ఉంచగానే ఆహారం వేడెక్కుతుంది. అది కూడా అంతటా సమానంగా వేడవుతుంది. 

మంట వంటివేమీ లేకుండా ఉండడం, శ్రమ తక్కువగా ఉండడం, కొన్ని రకాల వంటకాలను అత్యంత సులభంగా చేసుకోగలగడం వంటివి మైక్రోవేవ్ ఓవెన్లతో కలిగే లాభాలు. ప్రస్తుత కాలంలో కొన్ని ఇళ్లలోనూ మైక్రోవేవ్ ఓవెన్లను వినియోగిస్తున్నారు. వీటి ధరలు తక్కువగానే ఉన్నా, వినియోగించడం అత్యంత సులువే అయినా... సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది మైక్రోవేవ్ ఓవెన్లకు దూరంగా ఉంటున్నారు. తగిన అవగాహన ఉంటే మైక్రోవేవ్ ఓవెన్లతో ఎన్నో రకాల లాభాలున్నాయి. అసలు మైక్రోవేవ్ ఓవెన్ అంటే ఏమిటి, ఇదెలా పనిచేస్తుంది, వీటిలో ఎన్ని రకాలున్నాయి, ఏయే అవసరాలకు పనికొస్తుంది, ఎలాంటి ఓవెన్ తీసుకుంటే బెటర్, వాటి ధరలు ఎలా ఉంటాయి.. తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఆరోగ్యకరం కూడా..

మనం తినే ఆహార పదార్థాల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. కానీ మనం వండేటప్పుడు బాగా ఉడకబెట్టడంతో అందులో కొన్ని నశిస్తాయి. ఫ్రైలు, వేపుళ్ల వంటివి చేయడం, సరిగా వండకపోవడంతో మరికొన్ని పోషకాలు నశిస్తాయి. అంతేకాదు మన శరీరానికి హానికరమైన మరికొన్ని రసాయన సమ్మేళనాలూ ఆ ఆహరంలో ఉత్పత్తవుతాయి. కానీ మైక్రోవేవ్ ఓవెన్లతో ఈ సమస్య ఉండదు. ఆహారాన్ని నిర్ణీత ఉష్ణోగ్రత వద్దే వండడం, కూరగాయలు, ఆకుకూరల వంటివి పూర్తిగా.. సరిగ్గా ఉడకడం వల్ల అందులోని పోషకాలు నశించవు. ఎక్కువగా వేయించడం వంటివి ఉండకపోవడం వల్ల శరీరానికి హాని కూడా కలుగదు. ఆహారం మొత్తం ఒకే స్థాయిలో ఉడుకుతుంది కూడా. 

బ్యాక్టీరియా, వైరస్ నశిస్తుంది..

మైక్రోవేవ్ ఓవెన్ లో నేరుగా ఆహార పదార్థాల్లోకి వెళ్లిన తరంగాలు వాటిల్లోని నీరు, చక్కెర అణువులను కంపింపజేసి వేడి పుట్టిస్తాయి. తద్వారా ఆహారం ఉడుకుతుంది. ఈ ప్రక్రియలో ఎటువంటి పదార్థమైనా మైక్రోవేవ్ తరంగాలకు గురవుతుంది. ఈ ప్రక్రియలో ఓ నిర్ణీత స్థాయి ఉష్ణోగ్రతను మించితే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కూడా పూర్తిగా నశిస్తాయి. ముఖ్యంగా మాంసం, పాలు వంటి పదార్థాలలోని సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి. ఇది శాస్త్రీయంగా కూడా రుజువైంది. అంటే ఓవెన్ లో వండిన పదార్థాలు చాలా వరకూ భద్రమైనవిగా చెప్పవచ్చు. ఓవెన్ లో స్టెరిలైజ్ చేసిన కూరగాయలు, మాంసం, పాలను గాలి చొరబడని ప్యాకింగ్ లో ఉంచితే చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి కూడా.

ఎలా పనిచేస్తుంది?

మైక్రోవేవ్ ఓవెన్లు ఎలక్ట్రో మ్యాగ్నటిక్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. ఓవెన్ లో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ మైక్రో (సూక్ష్మ) తరంగాలను వెలువరించే ‘మ్యాగ్నట్రాన్’ అనే పరికరం, ఆ తరంగాలను ఆహర పదార్థాలు పెట్టే చోటుకు మళ్లించే వేవ్ గైడ్, ఈ మొత్తం ప్రక్రియను నియంత్రించే ప్రాసెసింగ్ యూనిట్ ఉంటాయి. ఇక తరంగాలు బయటకు వెళ్లకుండా నిరోధించేలా చుట్టూ ప్రత్యేకమైన కోటింగ్ వేయబడిన లోహపు బాక్స్ ఉంటుంది. ఇందులోనే మనం వండాల్సిన ఆహార పదార్థాలను పెట్టాలి. ఓవెన్ లోపల మనం ఆహార పదార్థాలు పెట్టి, ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రో మ్యాగ్నటిక్ శక్తి గల మైక్రో తరంగాలు వెలువడతాయి. ఇవి ఆహార పదార్థాల్లోకి నేరుగా చొచ్చుకుపోయి.. అందులోని నీటి కణాలను ఉత్ప్రేరితం చేస్తాయి. దానివల్ల వాటిలో వేడి జన్మిస్తుంది. ఈ వేడి ఆహార పదార్థం మొత్తానికి విస్తరించి.. ఆహారం అంతటా సమాన స్థాయిలో ఉడికిపోతుంది. మైక్రో తరంగాలను గాజు, పింగాణీ, ప్లాస్టిక్, కాగితం వంటివి గ్రహించలేవు. వాటి గుండా తరంగాలు స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి.

లాభాలు ఎన్నో..

  • మామూలుగా వంట చేసే సమయంలో దాదాపు నాలుగో వంతు సమయంలోనే ఓవెన్ లో వంట పూర్తయిపోతుంది.
  • ఓవెన్ లో పుట్టే వేడి కేవలం ఆహారానికే పరిమితం అవుతుంది. కాబట్టి వంటగది చల్లగా ఉంటుంది. అంతేకాదు ఎటువంటి మంట, అగ్ని వంటి ఉండవు కాబట్టి ఫ్యాన్ వంటివి కూడా పెట్టుకోవచ్చు.
  • కావాల్సిన దినుసులన్నీ వేసేసి.. నిర్ధారిత సమయాన్ని సెట్ చేసేసి హాయిగా ఇతర పనులు చేసుకోవచ్చు. ఆ సమయం పూర్తి కాగానే ఓవెన్ దానంతట అదే ఆగిపోతుంది. వంట పూర్తయినట్లు మనకు ధ్వని ద్వారా సిగ్నల్ కూడా ఇస్తుంది.
  • అప్పటికే వండిన ఆహార పదార్థాలను చాలా సులభంగా వేడి చేసుకోవచ్చు. ఒకసారి తయారుచేశాక మళ్లీ స్టవ్ పై వేడి చేయడానికి వీలుకాని ఆహార పదార్థాలను (బజ్జీలు, బ్రెడ్, పఫ్ లు, సమోసాలు వంటివి) ఓవెన్ లో మాత్రమే వేడి చేసుకోగలం.
  • తక్కువ నూనెతో వంట చేసుకోగలం, టమాటా, బంగాళదుంపల వంటి వాటిని నూనె లేకుండానే ఫ్రై చేసుకోవచ్చు కూడా.
  • కేకులు, పఫ్ లు, పిజ్జాలు వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలను ఓవెన్ లలో మాత్రమే సరిగ్గా తయారు చేయగలం. ఇలాంటి వంటలు చేయడం నేర్చుకునేందుకు పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • ఇటీవల అన్ని రకాల వంటలనూ మైక్రోవేవ్ ఓవెన్ లో తయారు చేయగలిగిన విధానంపై పుస్తకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
  • సాధారణ వంట గ్యాస్ తో పోల్చితే మైక్రోవేవ్ ఓవెన్ల ద్వారా కొంత వరకూ వ్యయం ఆదా కూడా అవుతుంది.
  • ఓవెన్లు ఎలాంటి కాలుష్యాన్నీ వెదజల్లవు.

ఇది ప్రమాదకరమేమీ కాదు..

మైక్రోవేవ్ ఓవెన్లలో 2.45 గిగాహెర్జ్ ల పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) ఉన్న తరంగాలను వినియోగిస్తారు. అంతేగాకుండా ఈ తరంగాలు ఎటువంటి ప్రమాదకర రేడియేషన్ ను కలిగి ఉండవు. అందువల్ల మైక్రోవేవ్ ఓవెన్ లను వినియోగించడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలుగదు. అయితే పేస్ మేకర్లు వంటి ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్లు ఉన్నవారు మైక్రోవేవ్ ఓవెన్ ను వినియోగించకపోవడం మంచిది.

ఓవెన్ కావిటీ (బాక్స్) దేనితో తయారైందో చూడాలి

  • ఓవెన్ లో ఆహార పదార్థాలు పెట్టే బాక్స్ దేనితో తయారైందనేది కూడా ముఖ్యమే. ఆ బాక్స్ కేవలం ఆహార పదార్థాలను పెట్టడం కోసం మాత్రమే కాదు.. లోపల విడుదలయ్యే మైక్రోవేవ్ తరంగాలను తిరిగి ప్రభావవంతంగా పరావర్తనం చెందించడం, తరంగాలు బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం దాని ముఖ్యమైన పని. ఈ బాక్స్ నే కావిటీగా చెబుతారు. 
  • రెండు రకాలైన కావిటీలను ఓవెన్లలో ఉపయోగిస్తారు. ఒకటి స్టెయిన్ లెస్ స్టీల్, రెండోది సిరామిక్ ఎనామిల్ కావిటీ.
  • స్టెయిన్ లెస్ స్టీల్ కావిటీలు ఉన్న ఓవెన్లలో సిరామిక్ కావిటీలున్న వాటితో పోలిస్తే మరికొంత వేగంగా అవుతుంది. లీకేజీల వంటి వాటిని నిరోధించడంలో స్టెయిన్ లెస్ స్టీల్ మెరుగ్గా పనిచేస్తుంది. అయితే ఈ తరహా ఓవెన్ల ధర ఎక్కువగా ఉంటుంది. 
  • స్టీల్ కావిటీలు కూడా ఆహార పదార్థాలతో పాటు వేడెక్కుతాయి. అందువల్ల ఆహార పదార్థాలు బయటికి తీసేటప్పుడు చేతులకు వేడి తగిలే అవకాశం ఉంటుంది.
  • ఇక స్టీల్ కావిటీలో పడిన పదార్థాలు అంటుకుంటాయి. శుభ్రం చేయడం కొంచెం కష్టం. గీతలు పడే అవకాశం ఉంటుంది. 
  • సిరామిక్ ఎనామెల్ కావిటీ ఉన్న ఓవెన్ల ధర తక్కువగా ఉంటుంది. వీటిలో స్టీల్ కావిటీలున్న వాటితో పోలిస్తే వంట కొంచెం తక్కువ వేగంతో అవుతుంది. ఓవెన్ వినియోగించినప్పుడు ఇవి స్వల్పంగా వేడెక్కుతాయి. కాబట్టి ఆహార పదార్థాలు తీసేటప్పుడు వేడి తగిలే అవకాశం తక్కువ.
  • సిరామిక్ కావిటీలను కేవలం తడి బట్టతో తుడిస్తే చాలు శుభ్రమైపోతాయి. గీతలు పడే అవకాశం ఉండదు, అందంగా కనిపిస్తాయి.
  • కొన్ని మైక్రోవేవ్ ఓవెన్ల తయారీ సంస్థలు సిరామిక్ కావిటీల లోపలి భాగంలో యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్ ను అందిస్తున్నట్లు చెబుతున్నాయి. వాటి వల్ల ఓవెన్ లో బ్యాక్టీరియా వృద్ధి చెందదు.

మైక్రోవేవ్ ఓవెన్లలో రెండు రకాలు..

మైక్రోవేవ్ ఓవెన్లలో రెండు రకాలున్నాయి. ఒకటి సాధారణ మైక్రోవేవ్ ఓవెన్ కాగా.. రెండోది కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్. సాధారణ మైక్రోవేవ్ ఓవెన్ కేవలం మైక్రో తరంగాలను ఉపయోగించి మాత్రమే ఆహార పదార్థాలను వేడి చేస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు వండేందుకు మాత్రమే ఇది పనికివస్తుంది. అందువల్ల సాధారణ మైక్రోవేవ్ ఓవెన్ కు సాంప్రదాయ విధానాన్ని కూడా జత చేసి రూపొందించినదే కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్. అంటే ఇందులో సాంప్రదాయ ఓవెన్ విధానమైన హీటింగ్ కాయిల్ (విద్యుత్ ప్రసరించడం ద్వారా ఫిలమెంట్ వేడెక్కి అధిక ఉష్ణోగ్రతను విడుదల చేసే భాగం) కూడా ఉంటుంది. ఈ హీటింగ్ కాయిల్ ను వివిధ రూపాల్లో అంటే.. ఓ ప్లేట్ తరహాలో లేదా గ్రిల్ (జాలీ) తరహాలో అందిస్తుంటారు. మన అవసరాన్ని బట్టి ఏ తరహాది కావాలో ఎంచుకోవచ్చు. ఇంకా ఈ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ లోపలి ఉష్ణోగ్రత అంతటా సమానంగా ఉండేలా చిన్న పాటి ఫ్యాన్ ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా వీచే గాలి లోపల కదులుతూ ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది.

కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ - మైక్రోవేవ్ మాత్రమే ఉన్న ఓవెన్ల మధ్య తేడాలు

  • మైక్రోవేవ్ కు సాంప్రదాయ విధానాన్ని జోడించడం వల్ల ఓవెన్ లోపలి ఉష్ణగ్రత చాలా త్వరగా పెరుగుతుంది.
  • కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్లలో పెట్టిన ఆహార పదార్థాల్లో నీటి శాతం తక్కువగా ఉన్నా కూడా బాగా ఉడుకుతాయి. మైక్రోవేవ్ మాత్రమే ఉన్న వాటిలో నీటి శాతం తక్కువగా ఉంటే ఉడకవు.
  • ఫ్రైలు, వేపుళ్లు, రోస్ట్ లు, తందూరీ వంటి ఆహార పదార్థాలను కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ లో తయారు చేసుకోవచ్చు. సాధారణ మైక్రోవేవ్ లో ఇవి తయారు చేయడం సాధ్యం కాదు.
  • కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్లలో ఏదైనా పదార్థాన్ని కేవలం వేడి చేయాలనుకున్నప్పుడు సింపుల్ గా మైక్రోవేవ్ ఆప్షన్ ను మాత్రమే వాడుకోవచ్చు. పూర్తిగా వంట చేయాలంటే కన్వెక్షన్ ను కూడా వినియోగించుకోవచ్చు. వేపుళ్లు, రోస్ట్ ల వంటి వాటి కోసం కన్వెక్షన్ స్థాయిని మరింతగా పెంచుకునే వెసులుబాటు ఉంటుంది.
  • కేవలం మైక్రోవేవ్ మాత్రమే ఉన్న ఓవెన్ల ధరలు తక్కువగా ఉంటాయి. కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు ఎక్కువగా ఉంటాయి.
  • మైక్రోవేవ్ మాత్రమే ఉన్న ఓవెన్ల ధరలు వాటి సామర్థ్యాన్ని బట్టి రూ.3,500 నుంచి రూ.6,500 వరకు ఉంటాయి.
  • కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు సామర్థ్యాన్ని బట్టి రూ. 7,000 నుంచి రూ.25,000 వరకు ఉంటాయి.
  • మన అవసరాన్ని బట్టి మైక్రోవేవ్ ఓవెనా, కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెనా అనేది ఎంచుకోవాలి. అయితే ధర ఎక్కువైనా కూడా వీలైనంత వరకూ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ ను తీసుకోవడం బెటర్.

తొలి నాటి ఓవెన్లు వేరే..

తొలినాళ్లలో ఎలక్ట్రిక్ స్టవ్ లు, ఇస్త్రీపెట్టెల తరహాలో.. ఫిలమెంట్ తీగ వేడెక్కి, దాని ద్వారా వచ్చే ఉష్ణోగ్రతతో ఆహార పదార్థాలను ఉడికించే ఓవెన్లను తయారుచేశారు. అంతేగాకుండా వంటగ్యాస్ ను అనుసంధానం చేసి లోపలివైపు మంట వచ్చేలా చేసే గ్యాస్ ఓవెన్లూ వచ్చాయి. వీటిల్లో రెండు పక్కలా.. లేదా పైభాగం, కింది భాగంలో వేడిని ఉత్పత్తి చేసే ఏర్పాట్లు ఉంటాయి. వీటిని ఇప్పటికీ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాలను రోస్ట్ చేయడానికి వినియోగిస్తున్నారు. ముఖ్యంగా తందూరీ చికెన్ వంటివి తయారు చేస్తుంటారు. వీటినే సాంప్రదాయ ఓవెన్లు లేదా కన్వెన్షనల్ ఓవెన్లు అంటారు. వీటిల్లో ఆహార పదార్థాలను గ్యాస్ స్టవ్, కట్టెల పొయ్యిలపై వండే తరహాలో మనకు కావాల్సిన తీరులో వండుకోవచ్చు. కానీ ఈ సాంప్రదాయ ఓవెన్ల విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ.

ఇవి గుర్తుంచుకోండి

  • ఓవెన్లలో గ్లాస్, సిరామిక్, అల్యూమినియం, కాస్ట్ ఐరన్ (మెత్తటి ఇనుము), స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను ఉపయోగించవచ్చు.
  • లోహ పదార్థాలు మైక్రో తరంగాలను పరావర్తనం చెందిస్తాయి. అంటే అద్దాలు తమపై పడిన కాంతిని ఎలా మరోవైపునకు పంపుతాయో.. అలా లోహాలు మైక్రో తరంగాలను పక్కకు పంపేస్తాయి. ఆ తరంగాలు లోపల తిరుగుతూ ఆహారంలోకి చొచ్చుకుపోవాల్సి వస్తుంది. దీనివల్ల కొంత ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.
  • ఓవెన్లలో వంట కోసం కొన్ని ప్రత్యేకమైన పాత్రలు లభిస్తాయి. అయితే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండే వంటలు చేస్తున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా లోహపు పాత్రలనే వినియోగించాల్సి ఉంటుంది.
  • ఓవెన్లలో ప్లాస్టిక్ పాత్రలను వినియోగించవచ్చు. కానీ ఆహారం వేడెక్కాక ఆ వేడికి ప్లాస్టిక్ కరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఓవెన్లలో వినియోగించేందుకు హైగ్రేడ్ ఫైబర్ ప్లాస్టిక్ పాత్రలు లభిస్తాయి. వాటిపై యూజబుల్ విత్ ఓవెన్ లేదా ఓవెన్ సేఫ్, ఓవెన్ కాంపిటబుల్ వంటి పేర్లను పేర్కొంటుంటారు.
  • టెఫ్లాన్ కోటింగ్ వేసిన ప్యాన్ లు, ప్లాస్టిక్ హ్యాండిల్స్ వంటి ఉన్న పాత్రలను ఓవెన్ లో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వినియోగించకూడదు.
  • మూత గట్టిగా బిగించిన పాత్రల్లో వంట చేయొద్దు. వండిన వాటిపై ఉన్న మూతను తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఒక్కసారిగా వంటకం బయటకు చిమ్మి, మనపై పడే ప్రమాదం ఉంటుంది.
  • మైక్రోవేవ్ ఓవెన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవ పదార్థాలను ఎక్కువ సేపు, ఎక్కువ స్థాయికి వేడి చేయవద్దు. అలా చేస్తే అవి ఒక్కసారిగా వేడెక్కి.. గట్టిగా బయటకు చిమ్ముతాయి. ద్రవ పదార్థాలను వేడి చేసినప్పుడు కనీసం ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచి.. తర్వాతే బయటకు తీయాలి.
  • ఓవెన్ లో పెట్టే ఆహార పదార్థాలు లోతైన పాత్రలలో నిండుగా నింపి పెట్టకూడదు. దానివల్ల మైక్రో తరంగాలు పూర్తిగా లోపలికి చొచ్చుకెళ్లలేవు.
  • పూర్తిగా ఎండిపోయిన ఆహార పదార్థాలను ఓవెన్ లో పెట్టకూడదు.
  • ఖాళీగా మైక్రోవేవ్ ఓవెన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ చేసి పెట్టకూడదు. అలా చేస్తే ఒక్కోసారి ఓవెన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.


More Articles