Union of India: సీబీఐ భారత ప్రభుత్వ నియంత్రణలో లేదు: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

  • పశ్చిమబెంగాల్‌లో సీబీఐ నమోదు చేసిన కేసులను సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  •  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్
  • సీబీఐ తమ నియంత్రణలో లేదన్న కేంద్ర ప్రభుత్వం
  • సీబీఐకి రాష్ట్రంలో సాధారణ సమ్మతిని ఉపసంహరిస్తూ 2018లో నిర్ణయం తీసుకున్న బెంగాల్ ప్రభుత్వం
Centre said to Supreme Court that CBI not under control of Union of India

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) భారత ప్రభుత్వ నియంత్రణలో లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అనేక కేసుల్లో సీబీఐ దర్యాప్తు జరపడాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐకి సాధారణ సమ్మతిని రద్దు చేసినప్పటికీ రాష్ట్ర పరిధిలో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో పాటు దర్యాప్తులు జరుపుతోందంటూ పేర్కొంది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం విషయంలో సుప్రీంకోర్టు అసలు అధికార పరిధికి కట్టుబడి ఉండాలని సూచించే ఆర్టికల్ 131 ప్రకారం పశ్చిమ బెంగాల్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 సుప్రీంకోర్టుకు అత్యంత పవిత్రమైన అధికార పరిధి అందించిందని, దీనిని అతిక్రమణ, దుర్వినియోగానికి అనుమతించబోమని తుషార్ మెహతా చెప్పారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొన్న కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని అన్నారు. దర్యాప్తు సంస్థ సీబీఐ.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని వాదించారు. కాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దర్యాప్తు లేదా దాడులు నిర్వహించేందుకు సీబీఐకి ఉన్న సాధారణ సమ్మతిని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నవంబర్ 2018లో ఉపసంహరించుకుంది.

More Telugu News