బ్యాంకు చెక్కు ఎన్నో రూపాలు... ఎన్నో విషయాలు

ఒకప్పటితో పోలిస్తే నేడు బ్యాంకు చెక్కుల వినియోగం చాలా వరకు తగ్గింది. అయినప్పటికీ వాటి ప్రాధాన్యం ఇప్పటికీ తగ్గలేదు. వ్యాపార కార్యకలాపాల్లో, రుణం తీసుకునే సమయంలో, ఇతరత్రా కొన్ని అవసరాలకు చెక్కుల అవసరం తప్పనిసరిగా ఉంది. చాలా మందికి తెలియని విషయం చెక్కులలోనూ చాలా రకాలు ఉంటాయని. వీటితోపాటు చెక్కులపై ఉండే ఎంఐసీఆర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ సమాచారం కూడా తెలుసుకుందాం.

చెక్కులను ప్రాంతాలను బట్టి లోకల్ చెక్, అవుట్ స్టేషన్ చెక్, యెట్ పర్ చెక్ అని పేర్కొంటారు. అదే పట్టణంలో డ్రా కోసం బ్యాంకు జారీ చేసిన చెక్ లోకల్ చెక్ అవుతుంది. ఇదే చెక్కును జారీ చేసిన చోట కాకుండా బయటి ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో జమ చేస్తే అది అవుట్ స్టేషన్ చెక్ అవుతుంది. దీనిపై చార్జీలు ఉంటాయి. అదే యెట్ పర్ చెక్ అయితే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖల్లోనూ జమ చేసుకోవచ్చు. ఎలాంటీ చార్జీలు ఉండవు. 

విలువను బట్టి కూడా చెక్కులను పలు రకాలుగా పేర్కొంటారు. నార్మల్ వేల్యూ చెక్, హై వేల్యూ చెక్, గిఫ్ట్ చెక్ లు. లక్ష రూపాయల విలువలోపు ఉన్న చెక్కులు నార్మల్ వేల్యూ చెక్ లుగా భావిస్తారు. అంతకుమించిన విలువ అయితే హై వేల్యూగా పరిగణిస్తారు. ఇక ఒకరికి బహుమానంగా రూ.100 నుంచి రూ.10వేల లోపు విలువతో జారీ చేసే చెక్కులు గిఫ్ట్ చెక్కులు అవుతాయి. 

ఓపెన్ చెక్: బ్యాంకు కౌంటర్ లో చెక్ ఇచ్చి నగదు తీసుకునేందుకు వీలు కల్పించేదాన్ని ఓపెన్ చెక్ అంటారు. అదే చెక్కును తన సొంత ఖాతాలో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. 

బేరర్ చెక్: చెక్కు సాయంతో బ్యాంకు శాఖకు వెళ్లి నగదు పొందవచ్చు. పేయీ కాలమ్ లో తీసుకునే వ్యక్తి పేరు ఉండాలి. 

ఆర్డర్ చెక్: బేరర్ స్థానంలో ఆర్డర్ అని రాసి ఎవరికైనా చెక్ జారీ చేయవచ్చు. అప్పుడు ఈ చెక్ ను సదరు వ్యక్తి వేరొకరికి కూడా బదిలీ చేయవచ్చు. చెక్ వెనుక సదరు వ్యక్తి పేరు రాయాల్సి ఉంటుంది.

సెల్ఫ్ చెక్: ఖాతాదారుడే స్వయంగా చెక్ ఇచ్చి నగదు తీసుకోవాలంటే పేయీ కాలమ్ లో సెల్ఫ్ అని రాయాల్సి ఉంటుంది. 

పోస్ట్ డేటెడ్ చెక్: ప్రస్తుత తేదీ కాకుండా భవిష్యత్తులో ఒక తేదీని చెక్ పై వేసి ఇచ్చేది. ఆ తేదీ నుంచే సదరు చెక్ ను నగదు డ్రా కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. జారీ చేసిన తేదీ (చెక్కుపై తేదీ) నుంచి మూడు నెలలు మనుగడలో ఉంటుంది.

బ్యాంకర్స్ చెక్: బ్యాంకు తన సొంత నిధుల్లోంచి డ్రా చేసుకునేందుకు వీలుగా జారీ చేసే చెక్కును బ్యాంకర్స్ చెక్ అంటారు. చెక్ పై విలువకు సరిపడా నగదును జారీ చేసే సమయంలోనే బ్యాంకు ఉపసంహరించుకుని తన పూల్ ఖాతాలో ఉంచుతుంది. సాధారణ చెక్కు అయితే సంబంధిత ఖాతాలో నగదు ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. బ్యాంకర్స్ చెక్ జారీ సమయంలోనే బ్యాంకు నగదును ఉపసంహరించుకుంటుంది కనుక రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. 

ట్రావెలర్స్ చెక్: ప్రింట్ చేసి ఉన్న ఈ చెక్కులను నగదుకు బదులు విదేశీ పర్యటనల్లో రెస్టారెంట్లు, షాపుల వద్ద వాడుకోవచ్చు. 

ఎంఐసీఆర్ అంటే...?

మేగ్నటిక్ ఇంక్ క్యారక్టర్ రికగ్నిషన్ (ఎంఐసీఆర్)... వేలాది చెక్కులను వేగంగా గుర్తించి తక్కువ సమయంలోనే ప్రాసెస్ చేసేందుకు ఈ కోడ్ బ్యాంకులకు వీలు కల్పిస్తుంది. తొమ్మిది అంకెలతో ఇది ఉంటుంది. మొదటి మూడు అంకెలు ఆ బ్యాంకు శాఖ ఉన్న ప్రాంతం కోడ్. ఎక్కువ శాతం పోస్టల్ పిన్ తోపోలి ఉంటుంది. తర్వాత మూడు అంకెలు బ్యాంకు కోడ్ ను సూచిస్తుంది. చివరి మూడు అంకెలు ఆ బ్యాంకు శాఖ కోడ్ ను సూచిస్తుంది. 

representation image

ఐఎఫ్ఎస్సీ కోడ్ (ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్)

ఇది 11 అంకెలతో ఉంటుంది. బ్యాంకుల మధ్య లావాదేవీలకు ఈ కోడ్ అవసరం. ఈ కోడ్ ఆధారంగా సోర్స్ బ్యాంకు (నగదు పంపే) నుంచి డెస్టినేషన్ బ్యాంకు (నగదు జమ అయ్యే)లను గుర్తించడం ద్వారా లావాదేవీలను పూర్తి చేయడానికి ఉపకరిస్తుంది. మొదటి నాలుగు అక్షరాలు బ్యాంకు పేరును తెలియజేస్తాయి. ఉదాహరణకు సిటీ బ్యాంకు అనుకోండి. CITI0234567 మొదటి నాలుగు అక్షరాలు సిటీ బ్యాంకు పేరును సూచిస్తాయి. చివరి ఆరు నంబర్లు ఆ బ్యాంకు శాఖను సూచిస్తాయి. మధ్యలో ఉండే సున్నా కంట్రోల్ క్యారక్టర్. 

బ్యాంకు లావాదేవీల సమయంలో ఐఎఫ్ఎస్సీ కోడ్ పేర్కొనకపోయినా బ్రాంచ్ ను తప్పకుండా తెలియజేయాలి. అప్పుడు బ్యాంకు సాఫ్ట్ వేరే ఆటోమేటిగ్గా బ్రాంచ్ పేరు ఆధారంగా ఐఎఫ్ఎస్సీ కోడ్ ను క్యాప్చర్ చేసి లావాదేవీలు పూర్తి చేస్తుంది. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లావాదేవీలు వేగంగా పూర్తయ్యేందుకు దీని అవసరం  ఎంతో ఉంటుంది. చెక్కులపై కూడా ఈ కోడ్ ఉండాలని ఆర్ బీఐ బ్యాంకులను ఆదేశించింది. 

చెక్కుల విషయంలో ఇవి మర్చిపోవద్దు...?

చెక్కుపై కచ్చితంగా తేదీ, నెల, సంవత్సరం, పేయీ కాలంలో పేరు, నగదు అంకెల్లో, అక్షరాల్లోనూ తప్పకుండా రాయాలి. ఏ ఒక్కటి లేకుండా జారీ చేయడం క్షేమం కాదు. చెక్కుపై పేయీ కాలంలో ఎవరికి ఇస్తున్నామో వారి పేరు రాసిన తర్వాత అదే లైన్ చివరిలో ‘ఆర్ బేరర్’ అని రాయవచ్చు. ఇలా చేస్తే అక్కడ ఎవరి పేరు అయితే రాశామో వారే నగదు చేసుకోగలరు. వేరెవరూ దాన్ని నగదుగా మార్చుకోవడం సాధ్యం కాదు. అలాగే చెక్ పై భాగంలో ఎడమవైపున క్రాస్ చేస్తూ అకౌంట్ పేయీ అని రాస్తే సంబంధిత వ్యక్తి ఖాతా ద్వారానే అది నగదుగా మారుతుంది. 

చెక్కుపై ఏ కాలమ్ లోనూ ఒకసారి రాసిన అక్షరాలను దిద్దకూడదు. అలా చేస్తే చెల్లుబాటు కాదు. దానికి బదులు మరొక చెక్ రాయడమే నయం. చెక్ బుక్ మధ్యలో వివరాలు నమోదు చేసుకునే పేజీ ఒకటి ఉంటుంది. జారీ చేసే ప్రతి చెక్కు నంబర్, నగదు, పేయీ పేరు, డేట్ అన్నీ అందులో నమోదు చేసుకుంటే... జారీ చేసిన చెక్కు నగదుగా మార్చుకోకుండా ఆపివేయాలనుకున్న సందర్భాల్లో వివరాలు సిద్ధంగా ఉంటాయి. చెక్కు దుర్వినియోగం జరిగినా అ వివరాలు ఉపయోగపడతాయి. 


More Articles