మిస్త్రీ (జియో హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • హిందీలో రూపొందిన ఇంట్రెస్టింగ్ సిరీస్
  • సీజన్ 1గా వచ్చిన 8 ఎపిసోడ్స్  
  • 7 భాషలలో అందుబాటులోకి
  • ఒక్కో కేసును పరిష్కరిస్తూ వెళ్లే హీరో  
  • సస్పెన్స్ .. కామెడీ టచ్ తో సాగే కంటెంట్
             

'మిస్త్రీ' .. ఓ క్రైమ్ డ్రామా. హిందీలో రూపొందిన ఈ వెబ్ సిరీస్, నిన్నటి నుంచి 'జియో హాట్ స్టార్' లో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. బెంగాలీ ..  మరాఠీ భాషలలో అందుబాటులోకి వచ్చింది. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివిని కలిగి ఉంటుంది. ఈ సిరీస్ కథ ఏమిటి? ఎంతవరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది? అనేది చూద్దాం. 

కథ: అర్మాన్ మిస్త్రీ ( రామ్ కుమార్)కి ముంబై పోలీస్ డిపార్టుమెంటులో మంచి పేరు ఉంటుంది. ఎలాంటి క్లిష్టమైన కేసునైనా ఛేదించగల నైపుణ్యం ఆయనకి ఉంటుంది. అయితే ఒక బాంబ్ బ్లాస్ట్ లో కళ్లముందే తన భార్య సుస్మిత చనిపోతుంది. అప్పటి నుంచి మానసికంగా ఆయన దెబ్బతింటాడు. ఆ కారణంగా ఆయన డిపార్టుమెంటుకి దూరమవుతాడు. అయితే ఒక కన్సల్టెంట్ గా ఆయన సేవలను డిపార్టుమెంట్ వాడుకుంటూ ఉంటుంది. 

పోలీస్ డిపార్టుమెంటువారు అప్పగించే కేసులను పూర్తి చేస్తూనే, తన భార్యను హత్య చేసింది ఎవరు? అనే మిస్టరీని ఛేదించడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయనకి అసిస్టెంట్ గా 'శరణ్య' అన్ని పనులను చక్కబెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే,   రాజకీయ నాయకుడైన రమాకాంత్ పై హత్యా ప్రయత్నం జరుగుతుంది. రమాకాంత్ భార్య మాధవితో పాటు, ఆయన పార్ట్నర్ పారస్ గుప్తాను మిస్త్రీ అనుమానిస్తాడు.

ఈ కేసు విషయంలో మిస్త్రీ ఆలోచనా విధానం పోలీస్ వారిని ఆశ్చర్యపరుస్తుంది. దాంతో ఆయన టేబుల్ మీదికి మరో అరడజను కేసులు వస్తాయి. వాటిని ఆయన ఎలా పరిష్కరిస్తాడు? అందుకోసం ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు? తన భార్య హత్య కేసు మిస్టరీని ఆయన ఛేదించగలుగుతాడా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సాధారణగా క్రైమ్ డ్రామా జోనర్ కి చెందిన సిరీస్ లోని కథలు రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. మొదటి నుంచి చివరివరకూ ఒకే కథ మలుపులు తీసుకుంటూ వెళ్లడం ఒక పద్ధతిగా కనిపిస్తే, ఏ కేసుకు ఆ కేసుగా కథ కొనసాగడం మరో పద్ధతిగా కనిపిస్తుంది. ఈ రెండో కోవకి చెందినదిగా ఈ సిరీస్ ను చెప్పుకోవచ్చు. పోలీస్ పాత్రలు అలాగే ఉండి, మిగతా పాత్రలు మారుతూ ఉంటాయి. 

సాధారణంగా ధైర్యసాహసాలు కలిగిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు తమ తెలివితేటలతో నేరస్థులను పట్టేస్తూ ఉంటారు. అయితే మానసిక స్థితి సరిగ్గా లేదనిపించుకుని .. డిపార్టుమెంటుకి దూరమైన ఓ పోలీస్ ఆఫీసర్ కేసుల చిక్కుముడులు విప్పే తీరు కొత్తగా అనిపిస్తుంది. ఓసీడీతోను బాధపడే పోలీస్ ఆఫీసర్ తీరు కారణంగా కామెడీ కూడా వర్కౌట్ చేశారు. ఎలాంటి యాక్షన్ సీన్స్ లేకుండా ఈ కంటెంట్ ను డిజైన్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. 

ఎనిమిది ఎపిసోడ్స్ లో కొన్ని కేసులు కాస్త ఇంట్రస్టింగ్ గా అనిపిస్తే, మరికొన్ని కేసులు కాస్త సాధారణంగా కనిపిస్తాయి. అలాగే కొన్ని ఎపిసోడ్స్ చకచకా పూర్తయినట్టు అనిపిస్తే, మరికొన్ని ఎపిసోడ్స్ సాగదీసిన భావన కలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే యావరేజ్ గా అనిపించే సిరీస్ ఇది. 

పనితీరు: రామ్ కుమార్ నటన ఈ సిరీస్ కి హైలైట్ అని చెప్పాలి. అలాగే ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించినవారు కూడా తమ నటనతో మెప్పించారు. కాస్త సస్పెన్స్  .. మరికాస్త కామెడీని టచ్ చేస్తూ సాగే కథాకథనాలు ఫరవాలేదు అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. పరంగా కూడా ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ వైపు నుంచి మాత్రం, ట్రిమ్ చేయవలసిన సీన్స్ కొన్ని కనిపిస్తాయి. 

ముగింపు: భార్యను కోల్పోయిన ఒక పోలీస్ ఆఫీసర్, మానసికంగా దెబ్బతింటాడు. అయినా ఆ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ, చిక్కుముడులతో కూడిన కేసులను ఎలా పరిష్కరిస్తాడు? అనే కథతో ఈ సిరీస్ కొనసాగుతుంది. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేని ఈ సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 

Movie Details

Movie Name: Mistry

Release Date: 2025-06-27

Cast: Ram Kumar, Mona Singh, Shika Talsania, Kshitish

Director: Rishab Seth

Producer: Deepak Dhar - Rajesh Chadda

Music: -

Banner: Banijay Aisa Production

Review By: Peddinti

Mistry Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews