జీవితంలో ఏదైనా సాధించాలనే తపన చాలామందిలో ఉంటుంది. అయితే ఆ 'కల'ను నిజం చేసుకోవడానికి వారు పడే కష్టమే విజయానికి చేరువగా తీసుకుని వెళుతుంది. అలాంటి స్ఫూర్తివంతమైన ప్రయాణం చేసినవారిలో ' ఫిజిక్స్ వాలా'గా పాప్యులర్ అయిన అలఖ్ పాండే ఒకరు. 'ఫిజిక్స్ వాలా' ఫౌండర్ గా ఆయన పోరాటంలోని అనుభవాలే కథగా 'హలో బచ్చో' సిరీస్ రూపొందింది. 5 ఎపిసోడ్స్ గా 'ప్రతీశ్ మెహతా ' రూపొందించిన ఈ సిరీస్ లో, వినీత్ కుమార్ సింగ్ ప్రధానమైన పాత్రను పోషించగా,ఈ నెల 6వ తేదీ నుంచి తెలుగులోనూ  స్ట్రీమింగ్ అవుతోంది.

అలఖ్ పాండే (వినీత్ కుమార్ సింగ్) అలహాబాద్ కి చెందిన ఓ యువకుడు. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన ఈ యువకుడు చదువులలో మొదటి నుంచి మంచి ప్రతిభను కనబరుస్తాడు. అయితే తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్లడానికి ఆయన ఎన్నో కష్టాలను పడవలసి వస్తుంది. ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది. విద్యా వ్యవస్థలోని సమస్యలు ఆయనను ఎంతో ప్రభావితం చేస్తాయి.

ఆర్ధికంగా వెనుకబడిన పిల్లలు .. గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలు .. ఆచారాల పేరుతో చదువులకు దూరమైన ఆడపిల్లలకి అత్యున్నతమైన విద్యా ప్రమాణాలు అవసరమని ఆయన భావిస్తాడు. పేదరికం .. ప్రతికూల పరిస్థితులు చదువుకు ఆటంకం కాకూడదని భావిస్తాడు. అందుకోసం ఆయన ఒక విద్యా సంస్థను స్థాపించి ముందుకు వెళతాడు. 'ఫిజిక్స్ వాలా'గా అన్ని ప్రాంతాలలోని స్టూడెంట్స్ కి చేరువ కావడం మొదలు పెడతాడు. 'హలో బచ్చో' అంటూ ఆయన ఆన్ లైన్ క్లాస్ లు మొదలుపెట్టే తీరు పాప్యులర్ అవుతుంది.     
        
అలఖ్ పాండే స్టూడెంట్స్ ను చైతన్య పరచడంలో సక్సెస్ అవుతాడు. ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు .. తేలికగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పే తీరు పిల్లలకి విపరీతంగా నచ్చుతుంది. ఒకానొక సమయంలో ఆయనకి పెద్ద మొత్తంలో ఫండింగ్ అవసరమవుతుంది. అదే సమయంలో ఆయనకి కుటుంబం వైపు నుంచి, ఇనిస్టిట్యూట్  వైపు నుంచి అనేక సమస్యలు ఎదురవుతాయి. తాను అనుకున్న లక్ష్యం వైపు నుంచి తప్పుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అవరోధాలను ఎలా ఎదుర్కున్నాడు? అనేదే కథ.
    
జీవితంలో కొంతమంది తమకి ఎదురైన పరిస్థితులను దాటుకుంటూ ముందుకు వెళతారు. మరి కొందరు, తమ వెనుక వచ్చేవారికి ఆ సమస్యలు ఎదురుకాకుండా చూడాలని అనుకుంటారు. ఆ రెండో కోవకి చెందిన వ్యక్తిత్వం కలిగిన అహ్మదాబాద్ కి చెందిన 'అలఖ్ పాండే' కథ ఇది. తన కుటుంబం నుంచి .. తన ఇనిస్టిట్యూట్ నుంచి .. విద్యను వ్యాపారంగా మార్చేసిన పోటీ ప్రపంచం నుంచి తనకి ఎదురైన సమస్యలను ఆయన ఎదుర్కొన్న తీరును ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. 

ఆర్ధికంగా వెనుకబడినవారి జీవితాలలో వెలుగు నింపలేకపోయినప్పుడు, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? సామాన్యులకు కూడా నాణ్యతా ప్రమాణాలు కలిగిన విద్య అవసరం అని భావించిన అలఖ్ పాండే ప్రయాణం ఆలోచింపజేస్తుంది. తన చుట్టూ ఉన్నవాళ్లు డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు .. డబ్బు కోసమే పనిచేస్తున్నప్పుడు .. డబ్బు కంటే విలువలు ముఖ్యమని నమ్మిన ఒక అధ్యాపకుడి ప్రయాణం ఎంతటి కష్టతరంగా సాగుతుందనేది చూపించిన తీరు బాగుంది.

కేవలం అలఖ్ పాండే ఎదుర్కొంటున్న సమస్యలు .. కష్టాలను చూపించినట్టయితే ఈ సిరీస్ కాస్త సాగదీసినట్టుగా అనిపించేది. ఒక వైపున ఆయనకి ఎదురవుతున్న అవరోధాలను చూపిస్తూనే, ఆయన కారణంగా చైతన్యవంతులవుతున్న స్టూడెంట్స్ ను .. వారి జీవితాలను ఒకరి తరువాత ఒకరిగా చూపిస్తూ వెళ్లిన తీరు మెప్పిస్తుంది. స్టూడెంట్స్ జీవితాలు .. లక్ష్యం వైపు వెళ్లడం కోసం వాళ్లు పడే కష్టాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.

ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో స్టూడెంట్ జీవితాన్ని పరిచయం చేశారని అనుకోవాలి. చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డుకాకూడదు .. ఆంక్షల పేరుతో ఆడపిల్లలు చదువుకి దూరం కాకూడదు. రెండు గోల్స్ పెట్టుకుని, రెండు పడవలపై ప్రయాణం చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని చదువుతూ ఎదగాలి. అలాగే ర్యాంక్ కోసం పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేయకూడదు .. చదువు మాత్రమే బతుకులను బాగు చేయగలదు అనే అంశాలను టచ్ చేసిన విధానం మనసుకు హత్తుకుంటుంది.

ముఖ్యంగా 'లక్ష్య' నే స్టూడెంట్ ను ర్యాంక్ కోసం పేరెంట్స్ ఒత్తిడి చేయడం, వాళ్లు ఆశించిన ర్యాంక్ ను సాధించడానికి ఆ కుర్రాడు ఆరాటపడటం .. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకి ప్రయత్నించడం వంటి సన్నివేశాలు పేరెంట్స్ ను ఆలోచింపజేస్తాయి. పేరెంట్స్  తమ 'కల'ను నిజం చేసుకోవడం కోసం, పిల్లలకి నిద్ర లేకుండా చేయకూడదనే సత్యాన్ని చాటుతుంది. 

అయితే ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకూ ఉంది. ఫండింగ్ కోసం ప్రయత్నాలు చేయడం .. ఆ విషయాన్ని గురించి చర్చించుకోవడం వంటి అంశాలకు సంబంధించిన సన్నివేశాల కోసం, కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నారేమో అనిపిస్తుంది. కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండేదేమో అనే భావన కలుగుతుంది. అయితే చివరి ఎపిసోడ్ కి వచ్చేసరికి ఆ విషయాలను మరిచిపోతాము. చాలా ఎమోషనల్ గా ఈ ఎపిసోడ్ కనెక్ట్ అవుతూ, కళ్లను తడి చేస్తుంది.

వినీత్ కుమార్ సింగ్ తో పాటు మిగతా కీలకమైన పాత్రలను చేసిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. స్టూడెంట్స్ పాత్రలలో కనిపించిన వాళ్లంతా తమ పాత్రలకి సహజత్వాన్ని తీసుకుని రాగలిగారు. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం ఈ కథకు తమ పూర్తి సపోర్టును అందించాయి. ఎడిటింగ్ కూడా బాగుంది.

ఎప్పుడూ నీ గురించి మాత్రమే ఆలోచన చేయకు. నీ చుట్టూ ఉన్నవాళ్లను గురించి కూడా ఆలోచన చేయి. వాళ్లను నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తే, నువ్వు పడిపోకుండా వాళ్లు చూసుకుంటారు. అనే మాటలు మనకు గుర్తొస్తాయి. ఒక మంచి ఆశయానికీ .. సిద్ధాంతానికి మరణం లేదు అని చాటే సిరీస్ ఇది. స్ఫూర్తిని కలిగించే కంటెంట్ ఇది. అక్కడక్కడా కాస్త సాగతీతగా అనిపించినప్పటికీ, స్టూడెంట్స్ తప్పకుండా చూడాల్సిన కంటెంట్ అనే చెప్పుకోవాలి.