బిగ్ బాస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిఖిల్, ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్ ను అనిల్ కడియాల - ప్రవీణ నిర్మించారు. వేదవ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నుంచి ఇంతవరకూ 8 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్స్ పలకరించనున్నాయి.
విక్రమ్ ( నిఖిల్) సస్పెన్షన్ లో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్. తల్లి - తండ్రి వాళ్లిద్దరే అతని ప్రపంచం. విక్రమ్ కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనేది వాళ్ల కోరిక. అలాంటి పరిస్థితులలో అతనికి కమిషనర్ మనోజ్ కుమార్ (సమీర్) నుంచి కాల్ వస్తుంది. 'కేసారం' గ్రామంలో 'శిరీష' అనే యువతిపై జరిగిన అత్యాచారం గురించి మనోజ్ కుమార్ ప్రస్తావిస్తాడు. తిరిగి డ్యూటీలో చేరిపోయి, ఈ కేసును డీల్ చేయమని విక్రమ్ ను కోరతాడు.
అయితే విక్రమ్ మళ్లీ డ్యూటీలో చేరకుండా కోర్టు నుంచి 'సావిత్రి' స్టే తీసుకొస్తుంది. దాంతో కమిషనర్ మనోజ్ కుమార్ మళ్లీ ఆలోచనలో పడతాడు. యూనీఫామ్ వేసుకోకుండా డ్యూటీ చేయమనీ, ఈ కేసును ఛేదించడం అతని వల్లనే అవుతుందని విక్రమ్ తో అంటాడు. 'హంట్' అనే టీమ్ ను ఏర్పాటు చేసి, సాధ్యమైనంత త్వరగా హంతకులను పట్టుకోమని చెబుతాడు. దాంతో తన టీమ్ తో కలిసి విక్రమ్ రంగంలోకి దిగుతాడు.
విక్రమ్ ను అతని గతం వెంటాడుతూ ఉంటుంది. 'గన్' చూసినా .. రక్తం చూసినా అతనిలో ఒక రకమైన ఆందోళన మొదలవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో అతను శిరీష కేసును డీల్ చేయడానికి సిద్ధమవుతాడు. ఈ కేసులో అశోక్ - శివకుమార్ అనే ఇద్దరి పేర్లు తెరపైకి వస్తాయి. విక్రమ్ గతం ఏమిటి? అతను ఎందుకు సస్పెండ్ అయ్యాడు? శిరీష నేపథ్యం ఏమిటి? ఆమె హత్యకి కారకులు ఎవరు? ఈ కేసును పరిష్కరించడంలో విక్రమ్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ.
శిరీష హత్యతో ఈ కథ మొదలవుతుంది. ఈ సీన్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ, కథలోకి ప్రేక్షకులను అడుగుపెట్టేలా చేస్తుంది. సస్పెన్షన్ లో ఉండి కూడా ఈ కేసును ఛేదించడానికి విక్రమ్ రంగంలోకి దిగడంతో కథ ఊపందుకుంటుంది. విక్రమ్ పై ఎందుకు సస్పెన్షన్ వేటు పడింది? ఆ సంఘటన అతనిని ఎందుకు అంతలా ప్రభావితం చేసింది? ఆ సంఘటన కళ్లముందు కదిలినప్పుడల్లా అతను ఎందుకు ఆందోళన చెందుతున్నాడనేది ఒక వైపున ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది.
ఇక శిరీష ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? శిరీషను ఎవరు ఎందుకు హత్య చేశారు? అనే సందేహాలు మరో వైపున ప్రేక్షకులలో కుతూహలాన్ని రేకెత్తిస్తూ దర్శకుడు ఈ కథను పట్టాలెక్కించాడు. ఇక అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఎదురయ్యే సవాళ్లతో కథలో వేగం పెంచాడు.
సాధారణంగా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు యూనిఫామ్ వేసుకుంటారు. అయితే గతంలో డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా పేరున్న విక్రమ్, యూనిఫామ్ కోసం డ్యూటీ చేయవలసి వస్తుంది. అందుకు కారణం ఏమిటనేది సస్పెన్స్ లో ఉంచుతూ ముందుకెళ్లిన విధానం మెప్పిస్తుంది. ఒకటి పోలీస్ ఆఫీసర్ గతం. మరో వైపున అతను ఛేదించే మర్డర్ మిస్టరీ ఈ కథలో కీలకమైన అంశాలుగా కనిపిస్తాయి.
సస్పెన్షన్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ .. అందుకు కారణమైన ఒక గతం. తప్పనిసరి పరిస్థితులలో డిపార్టుమెంటు అతన్నే రంగంలకి దింపడం .. ఇవన్నీ కూడా మనకి తమిళ సినిమాలను గుర్తుకు చేస్తాయి. టైటిల్ ను బట్టి చూస్తే, విక్రమ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అనుకోవడం సహజం. కానీ అందుకు భిన్నంగా ఈ పాత్ర వెళుతోంది. రానున్న ఎపిసోడ్స్ లో పవర్ పెరుగుతుందేమో చూడాలి.
ఇక ఒక పోలీస్ ఆఫీసర్ కి అప్పగించే టీమ్ ను బట్టే ఆ టీమ్ పై అంచనాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ సిరీస్ లో 'హంట్' టీమ్ సభ్యుల ఎంపిక సరిగ్గా లేదేమో అనిపిస్తుంది. అలాగే ఇంతవరకూ ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. మున్ముందు కొత్త రూట్లో పరిగెడుతుందేమో చూడాలి మరి.
ఇంతవరకూ వదిలిన 8 ఎపిసోడ్స్ ను బట్టి చూస్తే, కథాకథనాలు సాదాసీదాగానే అనిపిస్తాయి. పోలీస్ ఆఫీసర్ గా నిఖిల్ పర్సనాలిటీ కరెక్టుగా సరిపోయింది. కాకపోతే బాడీ లాంగ్వేజ్ విషయంలో శ్రద్ధ పెట్టవలసిందేమో అనిపిస్తోంది. నరసింహా కట్టా ఫొటోగ్రఫీ .. సుహాస్ నేపథ్య సంగీతం .. బాబు శృంగవరపు ఎడిటింగ్ ఫరవాలేదు.
ఈ సిరీస్ లో ఇంతవరకూ 8 ఎపిసోడ్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎపిసోడ్స్ కాస్త రొటీన్ గానే అనిపించాయి. కాకపోతే హీరో వైపు నుంచి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే అతను ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులో కొత్త మలుపులు ఉండే అవకాశం ఉంది. వాటిని బట్టి ఈ సిరీస్ మున్ముందు ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
'విక్రమ్ ఆన్ డ్యూటీ' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Vikram on Duty Review
Movie Details
Movie Name: Vikram on Duty
Release Date: 2026-03-06
Cast: Nikhil Maliyakkal, Ashu Reddy, Sameer, Gayathri Chaganti, Raghu, Arya
Director: Vedavyas
Music: Suhas
Banner: Gnapika Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer