ప్రియాంక అరుళ్ మోహన్ .. కుదురుగా కనిపించే కుందనపు బొమ్మ లాంటి కథానాయిక. తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో తనకి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ప్రియాంక తాజాగా నాయికా ప్రధానమైన సినిమా ఒకటి చేసింది. ఆ సినిమా పేరే 'మేడ్ ఇన్ కొరియా'. ఓటీటీలలో కొరియన్ కంటెంట్ కి ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోతున్న సమయంలో, కొరియా నేపథ్యంలో ఈ సినిమా రూపొందడం విశేషం. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.
శెన్బా (ప్రియాంక అరుళ్ మోహన్) తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన యువతి. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని ఒక విలేజ్ లో ఆమె నివసిస్తూ ఉంటుంది. కొండ ప్రాంతంలోని ఆ గ్రామంలో ఆమె తండ్రి ఒక చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉంటాడు. చాలాకాలం క్రితం కన్యాకుమారి నుంచి కొరియా వెళ్లిన ఒక రాణిగారి పాత్రను స్కూల్ వార్షికోత్సవంలో శెన్బా పోషిస్తుంది. ఆ పాత్ర ఆమెపై చాలా ప్రభావం చూపిస్తుంది. అప్పటి నుంచి ఆమెకి 'కొరియా' చూడాలనే ఒక కోరిక పుడుతుంది. వయసుతో పాటే ఆ కోరిక బలపడుతుంది.
శెన్బా కి కొరియా వెళ్లాలనే కోరిక ఎంత బలంగా ఉందనేది ఆమె పేరెంట్స్ కి తెలుసు. అందువలన సాధ్యమైనంత త్వరగా ఆమె పెళ్లి చేసేయాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. ఈ విషయం తెలియగానే వెంటనే వెళ్లి 'మణి'ని కలుస్తుంది శెన్బా. తమ ప్రేమ విషయం తన తండ్రితో మాట్లాడమని ఒత్తిడి చేస్తుంది. 'బార్' లో పనిచేస్తున్న తనతో పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోడని 'మణి' అంటాడు. ఆమెకి ఇష్టమైన కొరియానే వెళ్లి అక్కడ స్థిరపడదామని మాట ఇస్తాడు.
తల్లిదండ్రులతో చెప్పకుండా 'మణి'తో కలిసి శెన్బా కొరియా బయల్దేరుతుంది. అయితే తనని అతను మోసం చేశాడనే విషయాన్ని చివరి నిమిషంలో ఆమె గ్రహిస్తుంది. ఫలితంగా కొరియాలో ఒంటరిగా విమానం దిగవలసి వస్తుంది. భాష తెలియదు .. చేతిలో పెద్దగా డబ్బు లేదు. అలాంటి పరిస్థితులలో ఆమెకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అధిగమించడానికి ఆమె ఏం చేస్తుంది? అనేది మిగతా కథ.
కొండ ప్రాంతంలోని ఒక చిన్న విలేజ్.. పుట్టి పెరిగిన ఊరు తప్ప బయట ప్రపంచంలోకి అడుగుపెట్టని అమ్మాయి .. తల్లిదండ్రులకు ఎప్పుడూ దూరంగా వెళ్లని అమ్మాయి. అలాంటి శెన్బా, స్కూల్ డేస్ నుంచి ప్రేమిస్తూ వచ్చిన 'మణి'ని నమ్మేసి ఇల్లొదిలి వెళ్లిపోతుంది. డబ్బు కోసం అతను మోసం చేశాడని గ్రహించిన ఆమె, ఎవరూ తెలియని ఆ దేశంలో ఎలాంటి రోజులను గడిపిందనే విషయం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.
జీవితంలో చాలామందికి ఏదైనా ఒక దేశం పట్లనో .. ప్రాంతం పట్లనో ఒక రకమైన ఇష్టం ఏర్పడుతుంది. తప్పకుండా అక్కడికి వెళ్లాలనే ఒక బలమైన కోరిక వాళ్లను వెంటాడుతూ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఆనందంతో కాకుండా ఆవేదనతో అడుగుపెట్టవలసి వస్తే, సంతోషంతో కాకుండా సమస్యలతో వెళ్లవలసి వస్తే ఎలా ఉంటుందనేది ఒక ప్రయాణంగా ఈ కథను నడిపిస్తూ వెళ్లారు.
ఇది శెన్బా జర్నీ .. ప్రేక్షకులు ఆమె పాత్రతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. అందం .. అమాయకత్వం .. మంచితనం ఉన్న శెన్బా, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందోనని జాగ్రత్తగా ప్రేక్షకులు ఫాలో అయ్యేలా దర్శకుడు ఆమె ప్రయాణాన్ని చూపిస్తూ వెళ్లాడు. ఇటు ఇండియా .. అటు కొరియా నేపథ్యాలను ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. అక్కడక్కడా కామెడీ టచ్ ఇస్తూనే, సున్నితమైన భావోద్వేగాలను కనెక్ట్ చేయగలిగాడు.
ఈ కథలో పద్ధతిగా పెరిగిన శెన్బా, ప్రేమ పేరుతో దేశం దాటి వెళ్లిపోతుంది. కన్నవాళ్లను మోసం చేసి వచ్చాశానే అనే బాధ ఒక వైపు .. తాను ఎవరినైతే నమ్మి వచ్చిందో అతను మోసం చేశాడనే అనే బాధ ఒక వైపు. తిరిగి ఇంటికి వెళ్లలేదు .. ఒంటరిగా పోరాడటం తెలియదు. అలాంటి ఒక పరిస్థితిలో నాయికపడే మానసిక సంఘర్షణ .. పరిస్థితులను తనకి అనుకూలంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి.
ఈ కథలో కొరియాకి సంబంధించిన పాత్రలు కూడా చాలానే కనిపిస్తాయి. ఆ పాత్రలను కథలో భాగం చేసిన తీరు, అక్కడి నటీనటులతో .. ఆ భాషలోనే నటింపజేయడం మరింత సహజత్వాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. అక్కడి లైఫ్ స్టైల్ ను ఆసక్తికరంగా ఆవిష్కరిస్తూ కొనసాగుతుంది. అయితే ఈ కథలో అనూహ్యమైన మలుపులు .. భయంకరమైన ట్విస్టులు .. భారీ ఎమోషన్స్ గట్రా ఉండవు. కథ చాలా నిదానంగా సాగిపోతుంది. మనుషులు .. మానవ సంబంధాలు అనే అంశాన్నే ప్రధానంగా తీసుకుని నడిచే కథ ఇది.
అందం .. అమాయకత్వం .. మంచితనం కలిగిన ఈ పాత్రలో ప్రియాంక నటన ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్, ఈ కథను మరింత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయగలిగాయని చెప్పచ్చు.
మంచితనం .. మానవత్వం చాటుకోవడం మనుషుల ప్రాథమిక ధర్మం. అవి పరిమళించడానికి ప్రాంతం .. భాషతో పనిలేదు. వాటితో ప్రభావితం కానివారంటూ ఉండరు. నువ్వు మోసపోయావని కుమిలిపోతూ కూర్చోకుండా తోచిన సాయం చేస్తూ వెళితే, నీకు సహాయం చేయడానికి చాలా చేతులు ముందుకు వస్తాయనే చాటే కథ ఇది. కలుపుకుంటూ పోతే గెలుపు నీదే అవుతుంది అనే సందేశాన్ని ఇచ్చే కథ ఇది. అక్కడక్కడా మరీ నిదానంగా నడిచినట్టు అనిపించినా, ఫీల్ మిస్సవ్వదు. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన కంటెంట్ అనే చెప్పచ్చు.
'మేడ్ ఇన్ కొరియా' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Made in Korea Review
Movie Details
Movie Name: Made in Korea
Release Date: 2026-03-12
Cast: Priyanka Arul Mohan, Rishikanth, Park Hye Jin, Jaehyun Jang
Director: Ra Karthik
Music: Dharan Kumar
Banner: Rise East Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer